యాడ్స్ బాటలో ఆహా కొత్త అడుగు
అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఆధ్వర్యంలోని ‘ఆహా’ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇక యాడ్స్ విండోని ఓపెన్ చేసింది. చందాదారుల నుంచి లభించే ఆదాయానికి తోడు ప్రకటనల మీద ఆదాయం గడించడానికి గూగుల్ తో ఒప్పందం చేసుకుంది.
అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఆధ్వర్యంలోని ‘ఆహా’ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇక యాడ్స్ విండోని ఓపెన్ చేసింది. చందాదారుల నుంచి లభించే ఆదాయానికి తోడు ప్రకటనల మీద ఆదాయం గడించడానికి గూగుల్ తో ఒప్పందం చేసుకుంది. అమెరికా స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్రకటనలతో ప్రయోగాలు చేస్తున్న తరుణంలో, ఓ దేశీయ ప్లాట్ ఫామ్ అయిన ఆహా ఇప్పటికే ఈ హైబ్రిడ్ విధానాన్ని చేపట్టింది.
2020 లో కేవలం తెలుగు సినిమాలని దృష్టిలో పెట్టుకుని పెయిడ్ సర్వీసుగా ప్రారంభమైన ఆహా హైబ్రిడ్ మోడల్ కి మారింది. దీని ద్వారా 15-20 శాతం అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ప్రస్తుతం ఆహాకి తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల మంది సబ్‌స్క్రైబర్ లున్నారు. దీన్ని పెంచుకోవడానికి పెయిడ్ కంటెంట్ వ్యూహంతో తక్కువ ధరలో, ప్రకటనల ఆధారిత టైర్ ని ప్రారంభించింది. జోమాటో, ఇన్ స్టాగ్రామ్, ఐటీసీ మొదలైన జాతీయ బ్రాండ్ల ప్రకటనలతో స్ట్రీమింగ్ అవుతోంది ఆహా. దీని వల్ల వీక్షకులకి వెసులుబాటు ఏమిటంటే, కంటెంట్ లైబ్రరీని ఇప్పుడున్న ప్రీమియం ధరలకి చూడవచ్చు, లేదా ప్రకటనలతో తక్కువ ధరలకి వీక్షించ వచ్చు.
సబ్‌స్క్రైబర్‌లు సంవత్సరానికి రూ. 699 ధరతో హై-క్వాలిటీ డాల్బీ ఆడియోతో కలిపి, 4కె అల్ట్రా హెచ్ డీ లో కంటెంట్ ని వీక్షించగల గోల్డ్ ప్లాన్ ని ఇప్పటికే ప్రారంభించింది ఆహా.
సాధారణ వార్షిక ప్లాన్ ధర రూ. 399 టో ప్రకటనల్ని అనుమతించే తక్కువ ధరల శ్రేణుల్ని కూడా చూడవచ్చు. అలాగే రూ. 149 తో త్రైమాసిక ప్యాకేజీని కూడా అందిస్తోంది. వినియోగదారులు మొబైల్‌లో తక్కువ ధరకి కంటెంట్‌ని చూడాలనుకున్నా, ఇంట్లో పెద్ద స్క్రీన్‌పై అధిక నాణ్యతగల కంటెంట్ ని చూసే సౌలభ్యం లభిస్తే, కాలక్రమేణా వారు ప్రీమియం చెల్లింపు చందాదారులుగా మారవచ్చని అంచనా. మన దేశం వంటి మార్కెట్‌లో వృద్ధి చెందడానికి చెల్లింపు సభ్యత్వాలు సరిపోవని భావించే ఇతరుల తరహాలోనే ఆహా హైబ్రిడ్ మోడల్‌కి మారుతోంది. యుఎస్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే చౌకైన ప్లాన్‌లతో ఒక మోడల్ ని ప్రకటించింది, అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో గత మేలో దాని ఉచిత సేవ మినీటీవీని ప్రారంభించింది.
గత సంవత్సరం ప్రారంభంలో ఆహా తమిళ కంటెంట్ ని జోడించింది. తెలుగులో ఇప్పటికీ 22 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఓటీటీ ప్రకటనల మార్కెట్ (డెలాయిట్ 2022 నివేదిక ప్రకారం) గత సంవత్సరం 1.1 బిలియన్ డాలర్ల నుంచి 2026 నాటికి 2.4 బిలియన్ డాలర్లకి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
ఓటీటీ ప్రకటనల్ని స్ట్రీమింగ్ టీవీ ప్రకటనలు అని కూడా పిలుస్తారు. ఇవి వీడియో కంటెంట్‌లో వీక్షకులకి అందించే ప్రకటనలు. సాంప్రదాయ కేబుల్, శాటిలైట్ టీవీ ప్రసారాలకి బదులుగా ఎక్కువ మంది వీక్షకులు స్ట్రీమింగ్ వీడియో కంటెంట్ కి మొగ్గు చూపుతూండ
డంతో ఓటీటీ ప్రకటనలు కొత్త ప్రేక్షక సమూహాన్ని చేరుకోవడానికి ప్రకటనదారులకి అవకాశాన్ని అందిస్తాయి.
మొబైల్, డెస్క్‌టాప్ వంటి అన్ని పరికరాలలో ఓటీటీ కంటెంట్ ని ప్రసారం చేస్తే, టీవీ యాడ్స్ కేవలం టీవీలకే ప్రసారమవుతాయి. స్ట్రీమింగ్ టీవీ ప్రకటనలు కొందరికి చాలా కొత్త కాన్సెప్ట్ కావచ్చు, కానీ స్థిరపడిన బ్రాండ్‌లు తమ మార్కెటింగ్ వ్యూహాలని మెరుగు
పరచడానికి, కొత్త మార్గాల్లో ప్రేక్షకుల్ని చేరుకోవడానికీ దీనిని ఉపయోగిస్తున్నాయి ఒక ప్రకటనని ఎంత మంది వ్యక్తులు వీక్షించారనేది ఓటీటీ యాడ్స్ తోనే తెలుస్తుంది. ఓటీటీ అడ్వర్టైజింగ్ అనేది స్మార్ట్ ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి బహుళ స్క్రీన్స్ పై ప్రసారం చేసుకో వీలుగల డిజిటల్ ప్రకటనల రూపం.
సాంప్రదాయ టీవీ ప్రకటనలతో ప్రచార ఫలితాల్ని కొలవడం దాదాపు అసాధ్యం. కానీ ఓటీటీ ప్రకటనలతో ప్రచారం ఎంత బాగా పని చేస్తుందో విశ్లేషించడానికి అవసరమైన డేటాని, మెట్రిక్స్ నీ సులభంగా వీక్షించవచ్చు. పోతే, ఓటీటీ యాడ్స్ ప్లాట్ ఫామ్స్ ఒకవైపు వుంటే, యూట్యూబ్ ఇంకో వైపు వుంది. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో ఇదొకటి. ప్రపంచ వినియోగదార్లలో 40 శాతం కంటే ఎక్కువ మంది యూట్యూబ్ లో యాడ్స్ చూసే వస్తువులు కొనుగోలు చేస్తున్నారంటే బోలెడు ఆశ్చర్యం కలగొచ్చు.
ఇలా చేతిలో పట్టుకుని ఎక్కడికైనా తీసికెళ్ళ గల డిజిటల్ పరికరాలుంటే, ఒకే చోట కదలకుండా గట్టిగా బిగించిన శాటిలైట్ టీవీల్లో రేపు యాడ్స్ పరిస్థితేమిటని చానెళ్లకి బెంగ పట్టుకుంది. వేల కోట్ల నిధులు పొందుతూ ప్రభుత్వ భజన చేసే గోదీ మీడియా ఛానెల్స్ కి ప్రభుత్వమున్నంత వరకూ - ప్రైవేట్ యాడ్స్ ఓటీటీలు ఎగరేసుకుపోయినా, యూట్యూబ్ దోచుకుపోయినా ఢోకా వుండదు. ఆ తర్వాతే వుంటాయి ఆకలిదప్పులు.