స్మార్ట్ థియేటర్లతో విప్లవాత్మక మార్పు

మల్టీప్లెక్స్ విప్లవం తర్వాతేంటి అన్న ప్రశ్నకి సమాధానంగా కాన్ ప్లెక్స్ స్మార్ట్ థియేటర్లు రాబోతున్నాయి.

Advertisement
Update:2023-05-09 13:21 IST

మల్టీప్లెక్స్ విప్లవం తర్వాతేంటి అన్న ప్రశ్నకి సమాధానంగా కాన్ ప్లెక్స్ స్మార్ట్ థియేటర్లు రాబోతున్నాయి. ప్రేక్షకుల సినిమాలు చూసే అనుభవాన్ని పూర్తిగా మార్చి వేస్తూ హై ఎండ్ టెక్నాలజీ నుపయోగించుకుని సిద్ధమవుతున్న స్మార్ట్ థియేటర్లు సామాన్య ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. దేశంలో 100 స్మార్ట్ సిటీలు అన్న ప్రభుత్వ నినాదం ఏమైందో గానీ, కాన్ ప్లెక్స్ స్మార్ట్ థియేటర్స్ సంస్థ దేశవ్యాప్తంగా స్మార్ట్ థియేటర్లు స్థాపించేందుకు బృహత్ ప్రణాళికతో రంగంలోకి దిగింది. మొదటి థియేటర్ గా బీహారు రాష్ట్ర రాజధాని పాట్నాలో ప్రారంభించింది (వీడియో చూడండి).

ఇంటరాక్టివ్ సీట్లతో బాటు అత్యాధునిక సాంకేతికాలతో ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించే స్మార్ట్ థియేటర్స్ గ్రూపు సంస్థగా అవతరించేందుకు ‘కాన్ ప్లెక్స్’ సిద్ధమైంది. ఈ వ్యాపార నమూనాలో భాగంగా వికేంద్రీకృత ఫ్రాంచైజీలతో సరికొత్త థియేటర్ నెట్వర్క్స్ ని సృష్టించబోతోంది. మూడవ శ్రేణి నగరాల్లో/పట్టణాల్లో ఈ థియేటర్లని అందుబాటులోకి తెస్తుంది. సినిమా ప్రేక్షకుల్ని పూర్తిగా లీనం చేసే, బయటి ప్రపంచాన్ని మరిపించే మధురనుభూతితో కూడిన ఆకర్షణీయమైన వాతావరణాన్ని అందించడానికి, సరికొత్త సౌకర్యాలని, సాంకేతికాల్నీ పొందుపరచడం ద్వారా మల్టీప్లెక్సులకంటే ముందంజలో వుండబోతోంది.

కేవలం 40-50 సీట్ల సామర్ధ్యంతో ఈ స్మార్ట్ థియేటర్లు వుంటాయి. విలాసవంతమైన సోఫా సీట్లు/జంట లాంజర్‌లు, సెమీ రీక్లైనింగ్ సీట్లు, డాల్బీ సౌండ్ ఎఫెక్టులు కలిగి వుండే ఆడిటోరియంలో హోమ్ థియేటర్ అనుభవాన్నిస్తాయి. రీక్లైనింగ్ సీట్లలో హాయిగా పడుకుని సినిమా చూడొచ్చు. టికెట్టు ధర మాత్రం 250 రూపాయలే. స్పీకర్లలో అత్యుత్తమ ధ్వని, వెండి తెరపై అద్భుత దృశ్య నాణ్యత ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. బాగాలేని సినిమాలు కూడా బావున్నట్టు అనిపిస్తాయి.

వ్యాపారవేత్తలు రాహుల్ ధ్యాని, అనీష్ పటేల్ లు ఈ కాన్సెప్ట్ వెనుక వున్న వ్యక్తులు. ఇద్దరూ బలమైన వ్యాపార నేపథ్యాల నుంచి వచ్చారు. రాహుల్ మార్కెటింగ్ లో, ఆర్కిటెక్చర్‌లో నిపుణుడు. అనిష్ ఫైనాన్స్ లో, లీగల్ విషయాల్లో నిపుణుడు. మూడవ శ్రేణి నగరాల్లో/పట్టణాల్లో ప్రేక్షకులు ప్రేక్షకులు మల్టీప్లెక్స్ అనుభవానికి సంబంధించిన అన్ని విలాసాల్ని సులభంగా అందుకోవచ్చు. అత్యాధునిక పరికరాలు, ఖరీదైన సీటింగ్, డిజిటల్ కనెక్టివిటీ మొదలైన వాటితో సినిమా ప్రేక్షకులకు సాంప్రదాయ మల్టీప్లెక్స్ మోడల్‌ కి ప్రత్యామ్నాయాన్ని ఈ స్మార్ట్ థియేటర్స్ అందిస్తాయి.

అంతే కాదు, ఎవరైనా వ్యాపార ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నా, లేదా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి రాత్రిపూట విహారయాత్రని ప్లాన్ చేస్తున్నా, ప్రైవేట్ చలనచిత్ర ప్రదర్శనల కోసం వెళ్ళిడానికి స్మార్ట్ థియేటర్ మంచి కేంద్రం కావచ్చు. ఇలాటి సందర్భాల్లో ప్రేక్షకులు చూడాలనుకున్న సినిమాలని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ పాత, కొత్త సినిమాల లైబ్రరీ వుంటుంది. అలాగే, ఆహార పానీయాల కోసం ముందస్తుగా ఆర్డర్ చేయవచ్చు.

సినిమాలు అభివృద్ధి చెందుతున్నట్టే కంటెంట్‌ ని వినియోగించే సాధనాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. సినిమాల్ని ఆస్వాదించడానికి సరికొత్త, ఇంకా తెలివైన మార్గం కాన్ ప్లెక్స్ స్మార్ట్ థియేటర్‌లలో వుంది. ఈ ఆధునిక సినిమా థియేటర్ అనుభవం, మరింత సన్నిహిత వాతావరణంలో, మల్టీప్లెక్సుల్లోని అన్ని సౌకర్యాలతో, ఆహార పానీయాల ఎంపికలతో, నగదు రహిత లావాదేవీల కోసం డిజిటల్ చెల్లింపుల కియోస్క్ లతో, స్మార్ట్ టీవీల ద్వారా ప్రకటనలతో, ప్రేక్షకులకు లాయల్టీ రివార్డులతో ఇదొక పూర్తిగా వేరే ప్రపంచం.

మొత్తం 11,200 స్మార్ట్ థియేటర్లు దేశ వ్యాప్తంగా నెలకొల్పబోతున్నారు. కాన్ ప్లెక్స్ ఫ్రాంచైజీ కోసం కంపెనీ వెబ్సైట్లో కెళ్ళి వివరాలు పొందవచ్చు. మూడు ఫ్రాంచైజీ మోడల్స్ వున్నాయి : 50-60 సీట్లతో-మినీ మోడల్, 61-81 సీట్లతో ఎక్స్ ప్రెస్ మోడల్, 81-100 సీట్లతో ప్రీమియం మోడల్. పెట్టుబడి 50 లక్షల నుంచి కోటి రూపాయలుంటుంది. ఈ పెట్టుబడి రెండేళ్లలో తిరిగి వస్తుంది. ఈ ఫ్రాంచైజీని తీసుకుంటే సినిమా టిక్కెట్లు, ఫలహారశాల, లొకేషన్‌లోని వివిధ పాయింట్‌లలో ప్రకటన ప్రచారాలు, పార్కింగ్ మొదలైన మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. అంతేగాక ఉదయం పూట థియేటర్‌ని కాన్ఫరెన్స్ లకు, సెమినార్‌లకు అద్దెకివ్వచ్చు. సాయంత్రం వేళల్లో వివిధ ఉత్పత్తుల లాంచింగ్, గెట్ టుగెదర్, బర్త్ డే పార్టీలు, ఇతర వేడుకలు మొదలైన వాటికి అద్దెకివ్వొచ్చు. కేవలం 18 నెలల్లో కాన్ ప్లెక్స్ సంస్థ మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 187 స్మార్ట్ థియేటర్లకి ఫ్రాంచైజీ ఒప్పొందాలు కుదుర్చుకుంది.


Full View


Tags:    
Advertisement

Similar News