Mahesh Babu: మహేష్ బాబు జీవితంలో అతి చెత్త సంవత్సరం

Mahesh Babu: మహేష్ జీవితంలో ఈ ఏడాది అతిచెత్త సంవత్సరంగా నిలిచిపోతుంది. అన్న, తల్లి, తండ్రి.. ఇలా అందర్నీ ఈ ఒక్క ఏడాదిలోనే కోల్పోయాడు మహేష్.

Advertisement
Update:2022-11-15 08:12 IST

ప్రతి వ్యక్తికి జీవితంలో బ్యాడ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు హీరో మహేష్ బాబు జీవితంలోకి అలాంటి చేదు రోజులు వచ్చాయనిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా తనవాళ్లను కోల్పోతున్నాడు మహేష్. మరీ ముఖ్యంగా ఈ ఘటనలన్నీ ఈ ఏడాదిలోనే జరగడం మరింత బాధాకరం, దారుణం.

2022.. మహేష్ బాబు జీవితంలో చెత్త ఏడాదిగా నిలిచిపోతుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే అన్నయ్య రమేష్ బాబును పోగొట్టుకున్నాడు మహేష్ బాబు. రమేష్ బాబు కేవలం అన్నయ్య మాత్రమే కాదు, మహేష్ కు ప్రాణస్నేహితుడు కూడా. ప్రతి విషయాన్ని అన్నయ్యతో చర్చించేవాడు మహేష్. అలాంటి అన్నయ్య లేని లోటును ఈ ఏడాది ఆరంభం నుంచి చవిచూస్తున్నాడు మహేష్.

ఓవైపు అన్నయ్య లేడనే బాధలో ఉంటున్న మహేష్ కు మరో పెద్ద దెబ్బ. కొన్ని రోజుల కిందట తల్లి ఇందిరను కోల్పోయాడు మహేష్. అమ్మ అంటే మహేష్ కు ఎనలేని ప్రేమ. అమ్మతో కబుర్లు చెప్పడం, ఆమె చేసే కాఫీ తాగడం మహేష్ కు జీవితంలో అత్యంత ఇష్టమైన క్షణాలు. అమ్మ చేసే సాంబారు, నాన్-వెజ్ రుచులు మహేష్ కు ఇష్టమైన వంటకాలు. ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని వంటకాలు రుచిచూసినా అమ్మ చేతి వంట ది బెస్ట్ అంటాడు మహేష్.

అలా అమ్మను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహేష్ పై విధి విరుచుకుపడింది. ఇప్పుడు ఏకంగా తండ్రి కృష్ణను కోల్పోయాడు. మహేష్ జీవితంలో కృష్ణది కేవలం తండ్రి పాత్ర మాత్రమే కాదు. ఓ స్నేహితుడు, మార్గదర్శి, గురువు.. ఇలా మహేష్ జీవితంలో ఎన్నో పాత్రలు పోషించారు కృష్ణ. తండ్రి అంటే మహేష్ కు ఓ శక్తి. అలాంటి శక్తిని ఇప్పుడు మహేష్ కోల్పోయాడు.

ఇలా నెలల వ్యవథిలో అన్నయ్య, తల్లి, తండ్రిని పోగొట్టుకొని ఒంటరి అయ్యాడు మహేష్ బాబు. అందుకే మహేష్ జీవితంలో 2022 ఓ చెత్త సంవత్సరం.

Tags:    
Advertisement

Similar News