మొదటిరోజు 'పుష్ప-2' కలెక్షన్స్ ఎంతంటే?
మొదటి రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 175 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'పుష్ప:ది రూల్'. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తున్నది. ప్రి సేల్ బుకింగ్స్‌లోనే హవా చూపెట్టిన ఈ సినిమా మొదటిరోజు వసూళ్లలోనూ సత్తా చాటినట్లు సమాచారం. డిసెంబర్ 4 రాత్రి నుంచి థియేటర్లలో సందడి చేసిన 'పుష్ప-2' కలెక్షన్ల పరంగా ఓవర్సీస్‌లోనూ టాప్‌లో కొనసాగుతున్నది.
మొదటి రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 175 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో ఈ మూవీ తొలిరోజు దాదాపు 4.2 మిలియన్ల డాలర్ల (రూ. 35 కోట్లుపైన) వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది. అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు చేసిన మూడో ఇండియన్ మూవీ 'పుష్ప-2' అని పేర్కొన్నది.
ప్రీ సేల్ బుకింగ్స్ నుంచే బుక్ మై షోలో 'పుష్ప-2' దూసుకుపోతున్న విషయం విదితమే. తాజాగా ఈ మూవీ మరోసారి హవా చూపెట్టింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై ఒక్క గంటలోనే లక్ష టికెట్స్ అమ్ముడయ్యాయి. గతంలో ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమా గంటలో 97700 టికెట్స్‌తో టాప్‌లో ఉన్నది. ఇప్పుడు ఆ మార్క్‌ను పుష్పరాజ్ దాటేసింది.