స్టాక్ మార్కెట్ క్రాష్.. రూ. 10 లక్షల కోట్లు ఆవిరి

సెన్సెక్స్‌ 1400 పాయింట్ల పైగా నష్టపోగా.. నిఫ్టీ కూడా 22,200 దిగువన ట్రేడింగ్‌;

Advertisement
Update:2025-02-28 14:10 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ఉంచి బలహీన సంకేతాలతో ఉదయం భారీ నష్టాల్లో మొదలైన సూచీలు.. మరింత నష్టాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్‌ 1400 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ కూడా 22,200 దిగువకు చేరింది.ఐటీ, టెక్‌, ఆటో, టెలికాం షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ షేర్లలోనూ అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్లలో సియోల్‌, టోక్యో, షాంఘై, హాంకాంగ్‌ షేర్లూ భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1420.50 పాయింట్ల నష్టంతో 73191.93 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 421.60 పాయింట్ల నష్టంతో 22123.45 వద్ద కొనసాగుతున్నది. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, టైటాన్‌ మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. దీంతో మదుపర్ల సంపద దాదాపు రూ. 10 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ. 383 లక్షల కోట్లకు చేరింది.

నష్టాలకు కారణాలివే..

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికైన నాటి నుంచి స్టాక్‌ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతున్నది. ఎప్పటికప్పుడు ట్రంప్‌ చేస్తున్న టారిఫ్‌ ప్రకటనలు వాణిజ్య యుద్ధ భయాలు రేపుతున్నాయి. మెక్సికో, కెనడాపై విధించిన సుంకాలు మార్చి 4 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. తాజాగా చైనాపై అదనంగా మరో 10 శాతం సుంకం విధిస్తానని ట్రంప్‌ ప్రకటించడం విశేషం. చైనాపై సుంకాలూ అదే రోజు నుంచి అమలవుతాయని పేర్కొన్నారు. ఈయూపైనా 25 శాతం సుంకాలు వేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనలు మదుపర్లలో ఆందోళనకు కారణమవుతున్నాయి.

దేశీయ బ్యాంకుల నాలుగో త్రైమాసిక ఫలితాలు బలహీనంగా నమోదుకావొచ్చన్న అంచనాలు కూడా మార్కెట్‌ పతనానికి మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే క్యూ 3 ఫలితాలు నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో క్యూ 4 కు సంబంధించి తాజా అంచనాలు మరింత ఆందోళనలోకి నెట్టేశాయి.

Tags:    
Advertisement

Similar News