దేశీయ సూచీలు లాభాల్లో ట్రేడింగ్
ప్రారంభంలో ఒడుదొడుకులకు లోనైనా ప్రస్తుతం లాభాల్లో కొనసాగుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా ఐటీ, మెటల్ రంగ షేర్లలో కొనుగోళ్లు సూచీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ప్రారంభంలో ఫ్లాట్‌గా ట్రేడింగ్ మొదలుపెట్టిన సూచీలు ప్రస్తుతం మిశ్రమంగా కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.14 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్స్ 2,961.90 డాలర్ల వద్ద కదలాడుతున్నది.
ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 249.47 పాయింట్లు పెరిగి 74703.88 వద్ద.. నిఫ్టీ 68.55 పాయింట్ల లాభంతో 22621.90 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, జొమాటో, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటాస్టీల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.