మస్క్ సంపద ఒక్కరోజులోనే రూ.1.91 లక్షల కోట్లు ఆవిరి
మంగళవారం ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ టెస్లా షేర్లు భారీగా పతనం
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద మంగళవారం భారీగా కుంగింది. ఒక్కరోజు ఏకంగా 22.2 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.91 లక్షల కోట్లు. టెస్లా షేర్ల పతనం క్రమంగా నాలుగో రోజూ కొనసాగడమే ఇందుకు కారణం. టెస్లా కార్ల విక్రయాలు యూరప్‌లో 45 శాతం క్షీణించాయి. యూరప్‌లో మొత్తం ఈవీ విక్రయాలు జోరందుకున్నప్పటికీ టెస్లా విక్రయాలు తగ్గడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ప్రపంచవ్యాప్తంగా టెస్లాకు ఉన్న డిమాండ్‌పై ఆందోళన నెలకొల్పింది. దీంతో న్యూయార్క్‌లో టెస్లా షేర్లు నిన్న ఒక్కరోజే 8.4 శాతం క్షీణించాయి. అలా కంపెనీ విలువ 1 ట్రిలియన్ డాలర్ల దిగువకు చేరింది. నవంబర్ 7 తర్వాత కంపెనీ మార్కెట్ విలువ మొదటిసారి ఈ స్థాయికి దిగి వచ్చింది.
మస్క్ సంపద సగానికి పైగా టెస్లాలోనే ఉన్నది. టెస్లా షేర్లు కుంగడంతో మస్క్ సంపద ఏకంగా 22.2 బిలియన్ డాలర్లు పతనమైంది. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు, ఫెడ్ తన వ్యయాల్ని తగ్గించుకునే ప్రయత్నాలు, సుంకాలు సహా పలు చర్యలు చేపడుతున్నప్పటికీ అమెరికా మార్కెట్లు క్రమంగా నష్టాల్లో జారుకున్నాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో అమెరికా ప్రధాన సూచీ ఎంఅండ్‌పీ 500..3.1 శాతం పడిపోయింది. ఏడు మెగాక్యాప్ టెక్ కంపెనీలను ట్రాక్ చేసే మాగ్నిఫిసెంట్ 7 ఇండెక్స్ కూడా మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో నష్టపోయింది.