Gold Rates | నవంబర్ నెలాఖరు కల్లా రూ.62 వేలకు బంగారం.. ఇవీ కారణాలు?!
Gold Rates | బంగారం అంటే భారతీయులకు.. ప్రత్యేకించి మహిళలకు ఎంతో ఇష్టం.. పెండ్లిండ్లు, కుటుంబ శుభ కార్యాలకు.. పండుగల సీజన్‌లో పిసరంత బంగారం కొనుక్కోవాలని ఆశ పడుతుంటారు.. అందుకు అవకాశం లేకపోతే ఉన్న బంగారం ఆభరణాలే ధరిస్తారు.
Gold Rates | బంగారం అంటే భారతీయులకు.. ప్రత్యేకించి మహిళలకు ఎంతో ఇష్టం.. పెండ్లిండ్లు, కుటుంబ శుభ కార్యాలకు.. పండుగల సీజన్‌లో పిసరంత బంగారం కొనుక్కోవాలని ఆశ పడుతుంటారు.. అందుకు అవకాశం లేకపోతే ఉన్న బంగారం ఆభరణాలే ధరిస్తారు. రోజురోజుకు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఇన్వెస్టర్లకు బంగారం ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్. దేశీయ మార్కెట్లో మంగళవారం 24 క్యారట్ల బంగారం తులం రూ.140 పెరిగి రూ.60,220 వద్దకు దూసుకెళ్లింది. మరోవైపు, ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.150 పెరిగి రూ.55,200 వద్ద నిలిచింది.
త్వరలో అమెరికా ఫెడ్ రిజర్వు సమావేశం కానున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1933.50 డాలర్లు పలికింది. ఫ్యూచర్స్ మార్కెట్‌లో డిసెంబర్ డెలివరీ ధర 1.80 డాలర్లు పెరిగి 1948 డాలర్ల వద్ద.. వెండి డిసెంబర్ డెలివరీ ధర 0.34 డాలర్లు పెరిగి 23.42 డాలర్ల వద్ద తచ్చాడుతున్నది. నైమెక్స్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌పై 10 నెలల గరిష్ట స్థాయి దాటి 91.25 డాలర్లు వద్ద ట్రేడ్ అవుతున్నది.
గత 45-60 రోజులుగా తులం బంగారం ధర రూ.59 వేల నుంచి రూ.60 వేల మార్క్ మధ్య తచ్చాడుతున్నది. గత నెల ఒకటో తేదీన ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.55,400 పలికితే, 24 క్యారట్ల బంగారం తులం రూ.60,440 వద్ద నిలిచింది. గత నెల 31న 22 క్యారట్ల బంగారం తులం రూ.55150 వద్ద స్థిర పడితే, 24 క్యారట్ల బంగారం రూ.60,160 వద్ద స్థిర పడింది. గత నెల 17న కనిష్టంగా 22 క్యారట్ల బంగారం రూ.54,100, రూ.59,020 వద్ద నిలిచాయి. ఆగస్ట్ ఒకటో తేదీన గరిష్టంగా రూ.55,400 (22 క్యారట్లు), 24 క్యారట్ల బంగారం రూ.60,440 వద్ద ముగిశాయి. గత నెలలో బంగారం ధర 0.45 నుంచి 0.46 శాతం క్షీణత నమోదైంది.
అక్టోబర్ ఎక్స్‌పైరీ ఎంసీఎక్స్ గోల్డ్ ధర రూ.59 వేల మార్క్‌ను దాటుందని కొటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తున్నది. సెప్టెంబర్ 15న 10 గ్రాముల (24 క్యారట్లు) బంగారం ధర ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.59,148 వరకూ దూసుకెళ్లి తిరిగి రూ.59,999 వద్ద స్థిర పడింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1923 డాలర్ల వద్ద ముగిసింది.
అమెరికాలో అధిక ధరలతో ద్రవ్యోల్బణం చిక్కులు పొంచి ఉంటాయి. యూరప్, చైనా అభివృద్ధి నెమ్మదిస్తుందని కొటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తున్నది. అమెరికాలో ద్రవ్యోల్బణం రిస్క్‌తో డాలర్ విలువ పతనమైతే.. బంగారానికి గిరాకీ పెరుగుతుందని భావిస్తున్నారు. పండుగల సీజన్‌తోపాటు కార్తీకమాసంలో పెండ్లిండ్లు జరుగుతాయి. కనుక పెండ్లిండ్ల సీజన్‌లో భారత్, చైనాల్లో బంగారానికి డిమాండ్ ఎక్కువ అని కొటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, క్రూడాయిల్ ధరలు పెరిగితే నవంబర్ నెలాఖరుకల్లా బంగారం ధర ఔన్స్ 2090 డాలర్లకు, దేశీయంగా మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో పది గ్రాముల బంగారం ధర రూ.62, 000 లకు చేరుతుందని బులియన్ వర్గాలు అంచనా వేస్తున్నారు.