ఆల్‌టైమ్‌ కనిష్టస్థాయికి రూపాయి

ఈ మార్కును దాటడం ఇదే తొలిసారి

Advertisement
Update:2024-12-19 16:11 IST

మన దేశ కరెన్సీ రూపాయి విలువ భారీగా క్షీణించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 85 స్థాయిని దాటింది. ఈ మార్కును దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ.. 2025లో వడ్డీ రేట్ల విషయంలో ఆచితూచి వ్యహరిస్తామని పేర్కొనడం మన రూపాయితో పాటు, వర్ధమాన దేశాల కరెన్సీలపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలోనే బుధవారం నాటికి 84.94గా ఉన్న రూపాయి మారకం విలువ గురువారం ఉదయం 85.06 వద్ద ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి చేరింది.

భౌగోళిక రాజకీయ పరిణామాలు, దేశీయ పరిణామాల కారణంగా గత కొంతకాలంగా రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. దేశీయంగా వృద్ధి నెమ్మదించడం, వాణిజ్య లోటు పెరగడం, దేశీయంగా పెట్టుబడులు సన్నగిల్లడం వంటి కారణాలతో రూపాయి విలువ క్షీణించింది. అదే సమయంలో అమెరికా డాలర్‌ మరింత బలపడింది. అక్కడ బాండ్‌ రాబడులు పెరగడమూ మరో కారణం. తాజాగా వడ్డీ రేట్ల కోత విషయంలో దూకుడు ఉండకపోవచ్చన ఫెడ్‌ చీప్‌ జెరోమ్‌ పావెల్‌ వ్యాఖ్యలు రూపాయి విలువ పతనానికి దారితీసింది. రూపాయితో పాటు కొరియన్‌ వోన్‌, మలేసియన్‌ రిగింట్స్‌, ఇండోనేషియా రూపాయి విలువలు కూడా స్వల్పంగా పతనమయ్యాయి.

Tags:    
Advertisement

Similar News