స్టోర్ కు రండి.. నచ్చింది ఫ్రీగా తీసుకెళ్లండి!
బాక్సింగ్ డే సందర్భంగా పెర్త్ లో ఓ వ్యాపారి ఆఫర్.. స్వల్ప తొక్కిసలాట
రండి బాబూ రండి.. ఆలస్యం చేస్తే ఆశాభంగం.. అతి తక్కువ ధరకే ఈ సరుకులన్నీ ఇచ్చేస్తున్నాం.. అని మన అంగళ్లలో చిరు వ్యాపారులు కష్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.. ఏ వస్తువు కొన్నా ఒకే రేటు.. అంటూ హర్ ఏక్ మాల్ పేరుతో ఇంకో తరహాలో వస్తువుల అమ్మకాలు సాగిస్తుంటారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ కు చెందిన గార్మెంట్స్ వ్యాపారి డేనియల్ బ్రాడ్ షా తీరే వేరు. కొత్త తరహా మార్కెటింగ్ టెక్నిక్స్ తో కష్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈక్రమంలో బాక్సింగ్ డే (ఈనెల 26న) సందర్భంగా తనకు చెందిన స్ట్రీట్ ఎక్స్ గార్మెంట్ స్టోర్ లో నచ్చింది ఏదైనా ఫ్రీగా తీసుకెళ్లండని పబ్లిసిటీ చేశాడు. ఇంకేముంది.. 26న ఉదయం షాప్ షట్టర్ ఓపెన్ చేయడమే ఆలస్యం పోలోమంటూ జనాలు లోపలికి చొచ్చుకెళ్లారు. తమకు నచ్చిన దుస్తులు చేతికొచ్చినన్ని లాక్కొచ్చేశారు. దీంతో ఆ స్టోర్ వద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన స్టోర్ లో కేవలం 30 సెకండ్ల వ్యవధిలోనే 400 రకాల ఐటమ్స్ ను కష్టమర్లు తీసుకెళ్లారని.. వాళ్లెవరూ గాయపడలేదని డేనియల్ చెప్పారు.