ఒక్కోసారి...దిగులు-
గుబులై బుగులైనప్పుడు
అలా తోటలోకి వెళతాను...!
అనుబంధాలన్నీ బూటకాలే
స్వార్థంతో అల్లుకున్న ---
బంధాలేనాఅని ,
చెట్లతో వాపోతాను...!
స్తబ్దుగా వున్న వనమంతా
కలకలంతో కదులుతుంది
గాలి గలగలలతో అమాంతం
వాటేసుకుంటుంది...
ఓదార్పుగా ---
నాలుగు ఆకులు రాలుస్తుంది...!
పేగు బంధాలు..రక్త సంబంధాలు
అన్నీ పునాదుల్లేని కల్తీ కట్టడాలే ,
అవసరం తీరాక కుప్పకూలే --
మట్టిగోడలేనా అని
గొంతు చించుకుంటాను....!
ప్రశాంతంగా వున్న ప్రకృతి
ఉరుములతో శృతి కలుపుతుంది
నా దుఃఖంలో పాలుపంచుకుంటుంది!
అమ్మ మనసు వెన్నయితే
బిడ్డ అది కరిగించే సెగని
అమ్మ గుండె బ్రద్దలయి కన్నీరయితే
కరగని పాషాణమేనా బిడ్డంటూ
విలవిల్లాడతాను....!
ఆకాశం భోరున వర్షిస్తుంది
నా కన్నీటిని తనలో ---
ఐక్యం చేసుకుంటుంది..!!
శ్రీమతి. ఝాన్సీ కొప్పిశెట్టి (ఆస్ట్రేలియా)
Advertisement