"వాడికి కూడా ధోవతి ఒకటి మడికి ఆరెయ్యమను, శ్యామలని. ఎప్పుడూ రానివాడు ఈ రోజు మాత్రం తప్పని సరిగా దిగుతాడు, ఎక్కడినుండో" తాతయ్య నాన్నతో అనడం నాకే కాదు, మడికి బట్టలు డాబా మీద అరేసి వచ్చిన శ్యామల, అంటే మా అమ్మకీ వినపడ్డాయి. తాతయ్య మాటల్లో ఒక దెప్పిపొడుపు, విమర్శా మిళితమై ఉన్నాయి.
"మనం చెప్పక్కర్లేదు లెండి, వాడి కోసం వెయ్యకుండా తను ఉండదు" నాన్న తాతయ్యకు చెప్పిన సమాధానం కూడా మా ఇద్దరికీ వినపడింది.
నేను అమ్మదగ్గరకి వెళ్లి " దత్తుకక్కాయ్ గురించే కదూ తాతయ్య అనేది" రహస్యం చెప్పినట్టు అమ్మతో అన్నాను. అమ్మ నవ్వుతూ అవునన్నట్టు తలాడించింది.
ఈరోజు నానమ్మ ఆబ్దీకం. సంవత్సరం అంతా ఎక్కడ ఉంటాడో ఏమిటో, వివరం తెలియని, చెప్పని దత్తుకక్కాయ్ తప్పనిసరిగా ఇంటికి వచ్చే రోజు. అందరి భోజనాలు అయి, సేద తీరేటప్పుడు ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోతాడు. మొదట్లో వివరాలు అడిగేది అమ్మ. కొన్నిసార్లు చెప్పేవాడు, కొన్నిసార్లు దాటవేసేవాడు. నాలుగైదు ఏళ్ళ నుండి అడగడం మానేసింది . తానుగా చెబితే వినేది, లేదంటే లేదు. ఒకసారి అమ్మకు చెప్పిన దాని ప్రకారం, గత ఏడు ఏనిమిదేళ్లుగా దక్షిణ కర్ణాటకలో ఒక దేవాలయానికి సంబంధించిన మఠంలో దత్తుకక్కాయ్ ఉంటున్నట్టు తెలిసింది.
తిథికి ఇంటికి వచ్చినప్పుడు అస్సలు ఖాళీగా ఉండడు. స్నానం చేసి వచ్చి, వంట పనికి సాయంగా ఉండేవాడు. తండ్రితో, అన్నయ్యతో కూర్చోడం, మాట్లాడడం చెయ్యడు. పలకరింపుగా, వచ్చిన వెంటనే నమస్కారం చేసేవాడు. మాతో కాసేపు చదువుల విషయాలు మాట్లాడి, తర్వాత పనిలో పడిపోతాడు. బ్రాహ్మణులు వచ్చే వరకు వంటలో సాయం, వాళ్ళు వచ్చాక నాన్నకి క్రతువులో సాయం, అడగకుండానే చేసుకు పోవడం అలవాటు. ఎక్కువ సార్లు రాకపోకలు లేకపోవడం వల్ల మేము తనతో చనువుగా ఉండలేక పోయేవాళ్ళం.
సంవత్సరంలో గుర్తుగా ఆ ఒక్కరోజే ఇంటికి వచ్చే దత్తుకక్కాయ్ గురించి అమ్మ దగ్గరనుండి చాలా వివరాలు విడతలు విడతలుగా సేకరించాను, ఊహతెలిసినప్పటి నుండి.
*******
దత్తుకక్కాయ్ , మా నాన్న వీళ్ళు ఇద్దరే తాతయ్యకు మగసంతానం. ఇద్దరికీ మధ్య తేడా పదిహేను ఏళ్ళు. అందరికంటే పెద్దవాడు మా నాన్న. ముగ్గురు ఆడపిల్లల తర్వాత చివరిగా దత్తుకక్కాయ్ . అసలు పేరు దత్తాత్రేయ, కానీ అందరూ పిలుచుకునే పేర్లు దత్తు, దత్తుడు, దత్తుబాబు వగైరా. చివరి సంతానం కావడంతో నానమ్మకి గారాబం, అపురూపం.
మా అమ్మానాన్నల పెళ్లి అయ్యే సరికి దత్తుకక్కాయ్ కి ఐదేళ్లు. కొత్తగా కాపురానికి వచ్చిన పద్దెనిమిదేళ్ల మా అమ్మకు దొరికిన చిట్టినేస్తం మరిది దత్తాత్రేయ. కన్నతల్లి తర్వాత అక్కల కంటే కూడా వదినతోనే ఎక్కువ అభిమానంతో ఉండేవాడు.
మా తాతయ్యకు ఒక అన్న ఉండేవారు. సంగీత, సాహిత్యాలలో మంచి పండితుడు కావడంతో సంపాదన కూడా బాగా ఉండేది. దురదృష్టవశాత్తూ ఆ దంపతులకు సంతానం లేదు. ఆయన సంపాదన, ఆస్తులు అన్యుల పాలవడం ఇష్టం లేక దత్తాత్రేయను దత్తత అడిగారు. నానమ్మకి ఇష్టం లేకపోయినా, మా తాతయ్యమాట కాదనలేక పోయింది. "ఎక్కడకి పోతున్నాడు? మన కళ్లముందే అన్నయ్య దగ్గర పెరుగుతాడు. వాళ్ళ సంగతి కూడా ఒకసారి ఆలోచించు!" అన్న తాతయ్య వాదానికి అయిష్టంగానే తలొగ్గింది నానమ్మ. మా అమ్మకు ఆ ఉపకార ప్రక్రియ అత్తగారికి ఇష్టం లేకుండానే జరగడం, వ్యక్తిగతంగా తన చిట్టినేస్తం దూరం అవడం మనసుకు బాధ కలిగించింది.
దత్తత అంటే ఏంటి, దాని పర్యవసానం ఏమిటి తెలియని దత్తాత్రేయ, కొద్దిరోజుల కోసమే అనుకొని నివాసం మారాడు పెద్దనాన్న ఇంటికి.
రోజులు గడుస్తున్న కొద్దీ తనకి నిజం ఏంటో తెలిసి నానమ్మ మీద బెంగ పడసాగాడు. తాతయ్య మీద కోపం పెరగసాగింది, తనని వేరు కుటుంబంలో ఉంచినందుకు!
దత్తుకక్కాయ్ ను తనవైపు త్రిప్పుకోడానికి దత్తత తల్లి, అతను అడిగినవే కాకుండా అడగనివి కూడా కొనివ్వడం, వస్తు, వాహన సౌకర్యాలతో అతన్ని కట్టి పడేయడం చెయ్యసాగింది. దత్తుకక్కాయ్ కి యుక్తవయసు వచ్చే నాటికి చేతినిండా డబ్బులు, సౌకర్యాలు ఉండడంతో విలాసవంత జీవితం అలవాటైంది. మెల్లగా, కన్న తల్లిదండ్రుల కుటుంబంతో రాకపోకలు తగ్గినాయి. చదువు అంతంత మాత్రంగా ఉంటూ, చెడుస్నేహాలు, వాటిద్వారా చెడుఅలవాట్లు చేరువ అయ్యాయి. చెడుఅలవాట్లతో ఉచితంగా వచ్చిపడే అనారోగ్యం సమస్యలూ తరచూ రాకపోకలు మొదలు పెట్టినయ్. పెంచుకుంటున్న తల్లిదండ్రులకు అలవికాక, చెయ్యి జారిపోయాడు దత్తుకక్కాయ్. తాతయ్యకు అర్హత లేక ఊరుకుండి పోవాల్సి వచ్చింది. ఉపకారం అవుతుందన్న దత్తత ఉపద్రవం అయిన వ్యధ, దిగులుతో మంచంపట్టి చనిపోయింది నానమ్మ.
పెళ్లి చేస్తే ఇంటి పట్టున ఉంటాడు, బాగు పడతాడు అనే పెద్దవాళ్ళ నమ్మకం వమ్ము కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ కొద్ది సమయంలోనే ఇద్దరు పిల్లలు కలిగినా, దత్తుకక్కాయ్ ప్రవర్తనలో మార్పులేదు. అలాగే వదిలేస్తే పిల్లలు, భార్య వీధిన పడతారని, భార్య తరఫు వాళ్ళు ఆస్తి పంపకాలు చేయించి, వాళ్లకు భద్రత కలిగించారు. దత్తుకక్కాయ్ కి వచ్చిన ఆస్తి కర్పూరంలా కరిగిపోవడానికి ఎక్కువ నెలలు పట్టలేదు. అదే సమయంలో దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కాలం చేశారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించని దత్తుకక్కాయ్ కి తన ఇంట్లోనే స్థానం లేకుండా పోయింది. మా నాన్న, తాతయ్యల దగ్గర గౌరవం పోయింది.
అలాంటి పరిస్థితుల్లో వచ్చిన ఒక నానమ్మ తిథిరోజు భోజనాల తర్వాత వెళ్ళిపోయాడు దత్తుకక్కాయ్! ఆ వెళ్లినవాడు ఎక్కడికెళ్ళాడో, ఏం చేశాడో ఎవ్వరికి తెలియదు, మరుసటి సంవత్సరంలో నానమ్మ తిథి వచ్చేవరకూ! ఆ వచ్చినప్పుడు అందరూ ప్రశ్నలతో ముంచెత్తారు తన సంగతులు తెలుసుకోవాలని. అందరికీ మౌనం లేదా చిరునవ్వే సమాధానం తన నుండి.
తాతయ్య కోపంగా " ఇప్పుడు ఎవరిని ఉద్ధరించాలని వచ్చావు?" అనడంతో, సమాధానం చెప్పకుండా చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళసాగాడు దత్తుకక్కాయ్. గంభీరంగా మారిన వాతావరణానికి మేము పిల్లలం భయపడిపోయాం. అప్పుడు అమ్మా నాన్నా వెళ్లి అడ్డుపడి, ఇంట్లోకి తెచ్చారు తనని. మరో అరగంట భారంగా గడిచాక గానీ ఇంట్లో మామూలు స్థితి ఏర్పడలేదు. ఆ తరవాత నుండి దత్తుకక్కాయ్ నానమ్మ తిథి రోజు మాత్రమే వచ్చేవాడు ఇంటికి. దానికి అందరం అలవాటు పడ్డాం! పడేసాడు అనుకోవచ్చేమో!
******
సామాన్యంగా ఉదయం ఏడు గంటలకల్లా వచ్చే దత్తుకక్కాయ్ ఈ ఏడాది తిథిరోజు తొమ్మిది అవుతున్నా ఇంకా రాలేదు. వీధి తలుపు చప్పుడు అయినప్పుడలా అమ్మ దత్తుకక్కాయే వచ్చాడనుకొని చూస్తోంది. పది గంటలప్పుడు నాన్న దగ్గరకి వచ్చి " దత్తు ఇంకా రాలేదు ఎందుకో" అంటున్న అమ్మ గొంతు గద్గదమయ్యింది. కళ్ళు నీటి కుండలయినయ్యి.
" ప్రయాణం ఆలస్యం అయి ఉండచ్చు. నువ్వు కంగారు పడకు. తప్పక వస్తాడు వాడు" అన్నాడు నాన్న ఊరడింపుగా.
మరోగంట గడచినా దత్తుకక్కాయ్ జాడలేదు. అమ్మ పనుల మీద శ్రద్ధ చూపించలేక పోతోంది. ఇంతలో బ్రాహ్మణులు వచ్చారు. దాంతో నాన్న ఆ క్రతువులో మునిగి పోయారు. తాతయ్య కూడా కలవర పడడం నేను గమనించాను. ఇంటి పురోహితులు చనువుగా " తమ్ముడేడి? కనపడడం లేదు" అడిగారు.
"ప్రయాణం ఆలస్యం అయినట్టుంది. ఏ క్షణానైనా రావచ్చు" చెప్పారు నాన్న. శ్రాద్ధకర్మ అంతా అయినా దత్తుకక్కాయ్ రాలేదు.
బ్రాహ్మణుల భోజనాలు అయి, సంభావన ఇచ్చి పంపడాలు అయినాక, అమ్మకు ఒక్కసారిగా దుఃఖం పెల్లుబికింది. ఏడుస్తూ " ఎక్కడ ఉన్నాడో? ఎందుకు రాలేక పోయాడో ఏమీ తెలియదు. " అంటున్న అమ్మను నాన్న భుజంమీద రాస్తూ అనునయించ సాగారు.
" వాడు ఏనాడు బాధ్యతగా ప్రవర్తించాడు గనక ఇవాళ కొత్తగా బాధ పడాలి? వాడికి ఇలాంటివి మామూలే. వాడి గురించి ఆలోచిస్తూ కూర్చోకు" తనదైన ధోరణిలో అన్నారు తాతయ్య.
అమ్మ ఏదో అనబోతుంటే నాన్న సంజ్ఞలతో అడ్డుపడి, " అందరూ రండి భోజనాలకి" అంటూ వాతావరణం మార్చారు.
ఎప్పుడూ లేనిది ఈ యేడాది నానమ్మ తద్దినం చాలా అసౌకర్యంగా, అశాంతితో గడిచింది దత్తుకక్కాయ్ రాకపోవడం వల్ల, రాకపోవడానికి కారణం తెలియక పోవడం వల్లా!
రెండు రోజుల తర్వాత తాతయ్య " నేను ఉడిపి, శృంగేరి ఇంకా ఆ చుట్టుపక్కల తీర్ధాలు చూసివస్తాను" అని అమ్మానాన్నలతో చెప్పి ప్రయాణమయ్యారు. అలా అప్పటికప్పుడు అనుకొని ప్రయాణాలు చెయ్యడం అలవాటే ఆయనకి.
బయల్దేరిన తాతయ్యతో " దత్తుబాబు గురించి వీలుచేసుకొని వాకబు చెయ్యండి అక్కడి మఠాలలో" అని విన్నవించుకుంది అమ్మ.
మరో అయిదు రోజులకి తాతయ్య నుండి ఫోను వచ్చింది నాన్నకి. మాట్లాడిన తర్వాత " నాన్న త్రియంబకం కూడా వెళ్లి వస్తాడట" చెప్పారు నాన్న అమ్మతో. దత్తుకక్కాయ్ గురించి వార్త ఏమీ చెప్పక పోవడంతో అమ్మ నిరాశ పడింది.
మరో వారం రోజుల తర్వాత తాతయ్య వచ్చారు. ఆ సమయంలో అమ్మ ఇంట్లో లేదు, గుడికి వెళ్ళింది. తాతయ్యా, నాన్నా మాట్లాడుకున్నది ప్రక్క గదిలో నుండి విన్న నాకు తెలిసింది -
దత్తుకక్కాయ్ పోయిన ఏడాది తద్దినంకి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు, తను వేసుకునే మందులు మా ఇంట్లోనే మర్చిపోయాడు. వాటిని నాన్న తనకు తెలిసిన డాక్టర్ కి చూపించి అడిగితే, క్షయ వ్యాధికి సంబంధించిన మందులని చెప్పారు. దత్తుకక్కాయ్ కి వ్యాధి ముదిరి, మొన్న నానమ్మ తిథి రోజునే తానూ కాలంచేశాడు. మఠం వాళ్ళు అంత్యక్రియలు వాళ్ళ పద్ధతిలో జరిపించి, నాన్న ఫోన్ నెంబర్ సంపాదించి, మూడో రోజు కబురు తెలిపి, వచ్చి అస్తికలను తీసుకు వెళ్లమన్నారు. తాతయ్య వెళ్లి అస్తికలను త్రయంబకం గోదావరిలో కలిపి, అక్కడే కర్మకాండ చేశారు. తన భార్యకు, దత్తుకక్కాయ్ కి ఇష్టంలేని దత్తత ఇచ్చినందుకు ప్రాయశ్చిత్త క్రియ చేసుకుని వచ్చారు తాతయ్య.
దత్తుకక్కాయ్ దాచుకున్న ఫోటో ఒకటి, కొంత డబ్బు మఠం వాళ్ళు తాతయ్యకు ఇచ్చారు. డబ్బు మఠానికి దానం చేశారు తాతయ్య. ఫోటో నాన్నకి ఇచ్చారు. అందులో నానమ్మ ఒడిలో నవ్వుతూ కూర్చున్న మూడు నాలుగేళ్ళ దత్తాత్రేయ ఉన్నాడు. ఫోటో వెనక తను వ్రాసుకున్న మాటలు -
"అమ్మా… మళ్లీ జన్మలోనూ నీకే పుడతా. అప్పుడు మాత్రం నన్ను ఎవరికీ దత్తత ఇవ్వకు!"
రా.శా (రాయపెద్ది వెంకట రమణ శాస్త్రి)