కవిత్వమంటే..

Advertisement
Update:2023-06-20 16:10 IST

పసిపాప నవ్వితే రాలే

ముత్యాల సరాలకు

అక్షర రతనాలు అద్దాలని వుంది.

తోటలో పూదరహాస వికాసాలకు

పదాల నగిషీలు చెక్కాలని వుంది

నేల పరుపుపై పరుచుకున్న

వెన్నెల దుప్పట్లను

వాక్యాల్లో కరిగించాలని వుంది..!

నిశ్శబ్దంలోని శబ్దంతో

ఖాళీలను పూరించాలని వుంది.

శూన్యానికి చీకటికి మధ్య

తేడాని కొలవాలని వుంది

గుండె చప్పుళ్ళ లయతో

శృతి కలపాలని వుంది.

అభావంలోని భావాన్ని

ఓ పద్యంగా మలచాలని వుంది..!

ఆంధ్రం, ఆంగ్లంలో

తర్ఫీదు పొందిన కలం

భాష కోసం తడుముకుంది

రెండు భాషలు పరాయై

ఒకదాన్నొకటి పెనవేసుకున్నాయి.

మిశ్రమ భాషతో కలం కలవర పడి

ప్రతీ పదానికి శబ్దకోశం శోధిస్తూ

ప్రతిపదార్థాలకై గూగులమ్మతో

గారాలు పోతోంది..!

ఈ ప్రయత్నం కవిత్వమెలా అవుతుంది.

నేను కవినెలా అవుతాను..?

భావం మనసున పుట్టాలి

పురిటిలోనే భాషను పేనాలి.

ఊహల వన్నెలు జత కట్టాలి.

వేలికొసలు

అలవోకగా రూపాన్ని ఇవ్వాలి.

గణాలతో పనిలేకున్నా గుణం

కనబడాలి.

అది కదా కవిత్వమంటే..!

-ఝాన్సీ కొప్పిశెట్టి

(ఆస్ట్రేలియా)

Tags:    
Advertisement

Similar News