మరణం
ఎవరిదైతేనేమి
వల్లకాడుగా మారేది
మా పేదింటి వాడలే కదా.
పోరాటం ఎక్కడ జరిగినా
ఆకలికి నకనకలాడే చేతులే
నినాదాలై పైకి లేస్తాయి.
పోరు
ఏ అడవిలో తూటాలై పేలినా
మా గుడిసెలల్లో ఇంటిదీపాలు ఆరిపోతాయి.
యుద్దం
ఏ కారణం చేత రగిలినా
తెగిపోయిన తాళిబొట్లు
కన్నబిడ్డల కన్నీటిబొట్లు
రక్తపు నదిలో పొంగిపోతుంటాయి.
ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా
శవ పరీక్షలలో
మా బహుజన జాతుల మూలాలే బయటపడ్తుంటాయి.
కావాలనీ ఎవ్వడు తుపాకి పట్టుకోడు
ఆకలే
ఒకడ్ని పోలీస్
మరొకడ్ని నక్సలైటు గా మార్చుతుంది.
వీరుడు
ఎవరైతేనేమి
గుండె పగిలేలా
దుఃఖించే అమ్మల కడుపుకోత ఒక్కటే కదా..
సిద్దాంతం కోసం ఒకడు
ఆశయం కోసం మరొకడు
నిరంతరం రణ భూమిలో
రాజ్య కట్టుబాట్ల కోసం కాలిపోతుంటారు.
నక్సలైటు పోలీసు సామాన్యుడు
రాలిపోయింది ఏ బిడ్డడైనా
అది
రాజ్యం చేసిన నేరమే.
- అవనిశ్రీ
Advertisement