సహజ, ఛాయ తమ కెంతో ఇష్టమైన బొగడ చెట్టు క్రింద చేరారు. వాళ్ళిద్దరికీ పేరుకు ఇళ్ళు వేరయినా ఉండేది మాత్రం ఒకే చోట. అది వారి తల్లితండ్రులకు కూడా అలవాటయిపోయింది. యల్.కే.జీ నుంచీ పీ.జీ. దాకా కలిసి చదివినా ఒక్కసారి కూడా వాళ్లిద్దరూ దెబ్బలాడుకో లేదంటే మీకువిచిత్రమని పించవచ్చు.
అంతకంటే విచిత్రం మరొకటి ఉంది. వాళ్ళు ఎంతో సన్నిహితులు. కానీ వారి భావాలు ఉత్తర,దక్షిణ ధృవాలు. అలాంటి వారు ఒకరికొకరు మరింత దగ్గరవుతారన్నట్లు రోజురోజుకూ వీరి అనుబంధం విత్తనం, మ్రాను అయినట్లు బలపడుతోంది. దానికి సాక్ష్యంగా బొగడ చెట్టు.
సహజకి పూలు అంటే పడదు. సహజంగా ఉండాలి కానీ అలంకరణలు చేసుకొని అందాన్ని పెంచుకోవటానికి నేను వ్యతిరేకిని అంటుంది. ఛాయ మాత్రం "పూలు జడకే అందం. భారత స్త్రీకి చక్కటి అలంకారం. అవంటే నాకు ప్రాణం. నీ అంత కాకపోయినా నీ తరువాత నేను విలువ నిచ్చేది వాటికే" అంటుంది స్పష్టంగా.
ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏది అంటే 'మా స్నేహం' అనే ఛాయ అంటే సహజకి, 'ఛాయ నా ఊపిరి' అనే సహజ అంటే ఛాయకి ఒకరంటే ఒకరికి అంత ఇష్టముండటంలోఆశ్చర్యమేముంది?
వాళ్ళ ఇష్టానికి గుర్తుగా సహజ పెరటిలో బొగడ చెట్టుకి సిమెంట్ దిమ్మ కట్టించింది. రోజూ దాని మీద చేరతారు. ఛాయ బాచీ పట్టు వేసుకొని కూర్చోగానే సహజ ఆమె ఒడిలో వాలిపోతుంది. అలా ఆ భంగిమలో వాళ్ళు ఎన్ని ఊసులాడుకుంటారో వారికే తెలియదు. ఆ కబుర్లలో చరిత్రను విప్పుతారు. వర్తమానాన్ని చుడతారు. భవిష్యత్తును దాటేస్తారు. అది వాళ్ళిదరికే పరిమితం అంటారు. వాళ్ళనుకుంటారు కానీ బొగడ చెట్టు మాత్రం వాళ్ళ కబుర్లు అన్నీ చక్కగా విని, గుంభనంగా నవ్వుకుంటూ, వాళ్ళను ఆశీర్వదిస్తూ పూలను అక్షింతలుగా రాలుస్తుంది. ఆ ఆశీస్సులతోనే వారు ఎదుగుతున్నారు. క్షణం కూడా వేస్ట్ చెయ్యని వాళ్ళు మాటలు కాయలు కొరికేసుకుంటున్నారు.
"ఛాయా! నీకెప్పుడూ నా ఒళ్ళో పడుకోవాలని పించదా? అయినా ఆ ఛాన్స్ నేనెప్పుడిచ్చాను కనుక? ఈ రోజు నువ్వు నా ఒళ్ళోపడుకుంటావా? ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగింది సహజ.
"ఉహుఁ! నువ్వు ఇలానే నా ఒళ్లోనే పడుకోవాలి. నువ్వు చెప్పే కమ్మటి కబుర్లు వింటూ నీ ముఖంలో హావభావాలు చూడటం చిన్నతనం నుంచీ నాకు అలవాటయిపోయింది. అప్పుడప్పుడూ అనుకోకుండా వచ్చే మెరుపులా నాకూ ఆ ఆలోచన వస్తుంది. కానీ నా కిదే బాగుంటుంది. ఇలాగే ఉండనీ" అంది సహజ ముఖం పైన గాలికి ఆడుకుంటున్న ముంగురులతో తనూ ఆడుకుంటూ ఛాయ.
"ఛాయా! ఇలా నువ్వు నా ఛాయలా చిరకాలం ఉండిపోవే" అంటూ ఆమె రెండు చేతుల్నీ తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకుంది సహజ.పెళ్ళి' అనే అడ్డుగోడ మనల్ని వేరుచేయదుగా.."
సందిగ్ధత, భయం ఛాయ గొంతులో.
అలా ఉండాలంటే 'నువ్వే కావాలి' సినిమాలోలా పెళ్లి చేసుకోవటానికి మనం ఆడ, మగ కూడా కాదు. నీ మాటలు వింటుంటే సంశయం, భయం అంటే ఎరుగని నాకు కూడా భయాన్ని పుట్టిస్తోంది . పోనీ నేను మగవాడిగా మారిపోనా? అవును మరి. నన్ను ఎప్పుడూ మగరాయుడని అంటుంటావుగా! అప్పుడు ఎంచక్కా పెళ్ళి చేసుకోవచ్చు" అంది హుషారుగా తను వేసుకున్న షర్ట్ కాలర్ ను ఎగరేస్తూ.
'బాగుంటుంది' అని చెప్పే ముందు నువ్వా సినిమా చూసి వచ్చేప్పుడు ఏమన్నావో గుర్తు తెచ్చుకో" అంది.
ఏమన్నాను?అంత మంచి స్నేహితులుగా చిత్రించిన వాళ్ళ స్నేహాన్ని, ప్రేమగా కలపకపోతే మరో ఇద్దరు తమ లాంటి స్నేహితులతోనే జత చేసుకొని అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటే బాగుండేదన్నాను. ఇప్పుడు ఎందుకది గుర్తు చేస్తున్నావ్?" కళ్ళని ప్రశ్నార్థకంగా త్రిప్పుతూ అంది సహజ.
"అమ్మా, నాన్నా సంబంధాలు నాకు చూడటం ప్రారంభించారు కనుక"
"నిజంగానా" ఆశ్చర్యపోతూ అంది సహజ.
"అవును. మొగ్గ పువ్వవటం ఎంత సహజమో ఈడొచ్చిన పిల్లకు సంబంధాలు చూడాలనుకోవటం అంత సహజమే కదా!"
దానితో ఇద్దరిలో ఒక్క క్షణం నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ "అయితే మన పెళ్ళి మన కొక సమస్యగా తయారవక ముందే మనమే దానికొక పరిష్కారంగా మారదాం" అంది సహజ.
''అంటే!'' అర్ధం కానట్లు చూస్తున్న ఛాయతో "మనం మరో ఇద్దరు ప్రాణస్నేహితులను చూసి ప్రేమిద్దాం అంటున్నా!"
"అమ్మో! "గుండెల మీద చెయ్యి వేసుకుంది భయంగా ఛాయ.
''అబ్బ! ఈ కాలంలో కూడా ప్రేమించటానికింత భయపడిపోతావేం?''
"షాపులో కెళ్ళి పెన్ను కొనుక్కున్నంత తేలికగా స్నేహితులను ఎంచుకుంటున్నారు.అదంత కష్టమేం కాదు. నా కంప్యూటర్ తెలివిని దీనికే ముందు ఉపయోగిస్తా!'
"నిన్ను డిస్కరేజ్ చెయ్యాలని కాదు. ఎందరో ప్రేమికుల కథలు చదువుతున్నాం. ప్రేమించడం, ప్రేమించబడటం కన్నా మించినవి ఈ లోకంలో ఏదైనా ఉందంటే నేను నమ్మను .కానీ ఎన్నో ప్రేమ కథలకు ముగింపు విషాదమే! దానికి కారణాలు ఏమైనా అలాంటి ఊహను కూడా మన జీవితాలలో ఊహించలేను.
ఆమె కళ్ళలోంచి జారిన కన్నీరు సహజ బుగ్గను తడుపుతోంది. "ఛ! ఎందుకలా నెగిటివ్ గా ఆలోచిస్తావ్? ఈ సహజ నీ చెంత ఉండగా ఎలాంటి చెడు జరగదు. జరగనివ్వను. నువ్వు మాత్రం నాకు పిరికి మందు పొయ్యకు" అంటూ లేచి ఛాయ కన్నీటిని తుడిచింది. అదే వారి ఆప్యాయతకు నిదర్శనం.
వాళ్ళిద్దరూ ఎప్పుడూ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. ఒకరి కోసం ఒకరు మాత్రమే తపిస్తారు. వాపోతారు. చరిత్రలో ఒకనాటికి వీరి స్నేహం నిలిచిపోతుందేమో!
"ఏవర్రా మీరు కబుర్లలో పడితే ఆకలి కూడా ఉండదా? ఇదిగో వేడి వేడి ఉప్మా! లాగించండి" అంది సహజ తల్లి హైమవతి రెండు ప్లేట్లను వాళ్ళకు అందిస్తూ.
"థాంక్యూ మా !" అంది సహజ వాటిని అందుకుంటూ.
ఆవిడ ప్రశ్నకు ఛాయ చిరునవ్వే సమాధానమైంది.
"ఎవరు చేసుకుంటారో కానీ దీని నవ్వు చూస్తూ ఏ కష్టాన్నయినా ఈదెయ్యవచ్చు. ఎక్కడున్నాడో ఆ అదృష్టవంతుడు?" అనుకందావిడ స్వగతంలో. ఆవిడను అటు వెళ్ళనిచ్చి సహజ, ఛాయ టిఫిన్ ను తింటూ మళ్ళీ తీర్మానాలలోకి దిగారు.
"ఛాయా! నువ్వొక భయస్తురాల వని అందరికీ తెలుసు. నీ భయంతో బంగారం లాంటి భవిష్యత్తుకి నీకు నువ్వే తుఫాన్ సృష్టించకు.మనం ఒక మంచి స్నేహితుల జంటను వెతుక్కుంటున్నామన్న విషయం మనిద్దరికీ తప్ప మరెవ్వరికీ తెలియకూడదు. చివరికి అమ్మా, నాన్నలకు కూడా!"
"అంటే వాళ్ళకు తెలియకుండా పెళ్ళి కూడా చేసేసుకుందామనా?"
అప్పుడే భయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది ఛాయలో.
"అరె! అప్పుడే పెళ్ళి దాకా వెళ్ళిపోతావేం? అసలు ఈ లోకంలో ఎందరు మనలాంటి స్నేహితులున్నారు? వాళ్ళ పరిచయం వయస్సు ఎంత? లోతు ఎంత? నిజమైన స్నేహమేనా? మంచి వాళ్ళేనా? ఎన్ని చూసుకోవాలి? మన జల్లెడ కోతలో ఒక్క జంట అయినా మిగులుతుందా లేదా అని నేనాలోచిస్తుంటే పెళ్ళట! పెళ్ళి!"
"అది కాదు. రహస్యంగా చేసుకోవటం నా కిష్టముండదు. అమ్మా వాళ్ళను ఒప్పించి చేసుకుంటేనే నాకానందం. అంత కన్నా ఏం లేదే" అంది.
ఛాయ తన కొచ్చిన జీడి పప్పును సహజ నోట్లో పెడుతూ. "నేనేమన్నా అన్నానా చెప్పకుండా చేసుకుందామని. మన కంతా నచ్చితే వాళ్ళ ముందే పెడదాం. వాళ్ళకి నచ్చితే సరేసరి. లేకపోయినా మనం రాజీ అవ్వం" అంది స్థిరంగా.
"అమ్మో! నాకు భయం" అంది గుండెల మీద చెయ్యేసుకుంటూ ఛాయ.
అయితే ఇంకేం ! వెళ్ళి మీ అమ్మా, నాన్న తెచ్చిన సంబంధం చేసుకో! నీ మెడలో మంగళ సూత్రం,మన స్నేహానికి విడాకుల పత్రం ఒకేసారి రాసుకుందాం. పిరికి తనం పరాజయానికి మూలం అని గుర్తుంచుకో!"
"సహజా!" ఛాయ కళ్ళ నిండా కన్నీరు.
"ఛాయా! ఏ పంపూ తిప్పకుండానే నీళ్ళు వచ్చే స్తాయే నీ కంట్లో" అంది హాస్యంగా.
అయినా ఛాయ నవ్వలేదు. ఇక దిగిరాక తప్పలేదు సహజకు.
"సారీ ఛాయా! ఎక్కడికక్కడ నీ భావాలతో, భయాలతో మన యాత్రకు బ్రేక్ వేస్తుంటే అలా అనేసాను. ఒక్కటి చెప్పు. అమ్మా వాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకుని హాయిగా నువ్వు లేకపోయినా బ్రతికేస్తాను అను.ఈ ప్రయత్నానికి తెర దింపేస్తాను".
"ఉహుఁ ! మన గొంతులో ఊపిరి ఉన్నంత కాలం మనం కలిసే ఉండాలి. లేదంటే పెళ్ళి అయినా మానేస్తాను" అంది ఖచ్చితంగా.
"ఇదే మాట మీద నిలబడు. శ్రీకృష్ణుడు భారతాన్ని నడిపినట్లు నేనెలా మన నాటకాన్ని నడిపిస్తానో చూడు. "ఏమిటి వెండి తెర మీదా?" అంది ఛాయ కూడా లేస్తూ. "లేదు. జీవితం తెర మీదే".
ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు.
* * *
ఛాయకి సంబంధాలు చూస్తున్నాం అని చెప్పటంతో ,మా సహజకి కూడా చేయాలిగా. ఇద్దరమూ కలిసి ప్రయత్నిద్దాం అంటూ వాళ్ళు అన్ని మ్యారేజ్ లైన్స్ ని దర్శిస్తూ బాహాటంగా ప్రయత్నిస్తుంటే రహస్యంగా వెబ్ సైట్ లలో వెతుకులాట ప్రారంభించింది సహజ. ప్రతి నిమిషం అన్వేషణ. ఎక్కడ పెళ్ళి పల్లకి కనిపించినా ఆమె కళ్ళు ఆసాంతం చదివితే కానీ వదిలేవి కావు. అవన్నీ సింగిల్ గా కనిపించటంతో స్నేహితుల వేట ఇలా కష్టమని నిశ్చయించుకొని ప్రముఖ దిన పత్రికలన్నిటిలో తన మరో స్నేహితురాలు 'సహాయ' అడ్రెస్ కి యాడ్స్ తయారు చేసింది. అలాగే కంప్యూటర్ లో సంబంధాలు చూసేవారికి కూడా ఒక అప్లికేషన్ పెట్టింది. నాలుగు డబ్బులు మనవి కాదంటే వర్షం కూడా మనం కావాలనుకున్న చోట కురిపించుకోగల కాలమాయె.
అన్ని పత్రికలలో యాడ్స్ పడ్డాక ప్రతిరోజూ సహాయ ఇంటికి వెళ్లి 'పోస్ట్' తెచ్చుకోవటం ఒక పనిగా పెట్టుకుంది. ఫోన్ నెంబరు ఇస్తే వాళ్ళ మాటలు తెలుస్తాయి. కానీ, వారి భావాలు అర్ధం కావని. అది ఉత్తరాలలో అయితేనే కొంచెం గమనించవచ్చని అడ్రెస్ మాత్రమే ఇచ్చింది.
వారం రోజులు గడిచాయి. రోజుకు అయిదు, ఆరు ఉత్తరాలు వస్తున్నాయి కానీ ఒక్కటీ పర్లేదు చూద్దాం అనేట్లు కూడా లేవు. అందరూ లేటెస్ట్ గా స్నేహం కుదుర్చుకున్న వాళ్ళే. అలాంటి వాళ్లకు తమ లాంటి వాళ్ళ స్నేహం గురించి సరైన అవగాహన ఉండదు. పైగా తేలికగా చూస్తారు. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి. ఒక్కటి కూడా వాళ్ళు అనుకొన్న స్థాయిలో నిలబడ లేదు.
నెలలు గడిచిపోతుంటే నీరసం వచ్చేది సహజకు. ఇంతలో తమకు సంబంధాలు కుదిరిపోతాయా అన్న ధైర్యం ఉన్నా అనుకూలమైన సంబంధం ఇద్దరిలో ఏ ఒక్కరికి దొరికినా తమ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అని విచారిస్తున్న సహజ చేతిలో ఒక గులాబీ రంగు కవర్ పట్టింది 'సహాయ'.
ఎందుకో అది చూడగానే మంచి శుభవార్త ఉందనిపించింది. ఆత్రంగా తీసి చదవటం ప్రారంభించింది.
* * *
మీ ఇద్దరకూ,
మేమిద్దరమూ రాస్తున్న ఉత్తరం ఇది. నా స్నేహితుని కిరాణా షాపులో కూర్చున్న మాకు అతను పొట్లాలు కట్టే పేపర్ లో అనుకోకుండా మీ యాడ్ చూడటం జరిగింది. అది మా అదృష్టమే అనిపించింది. అంతా మంచిగా జరిగితే మీకు కూడా!
మేం జీసస్, మహమ్మద్ అనే పేరు గల వాళ్ళం. మతాలూ వేరయినా మా ఫాదర్స్ చేసే ఉద్యోగాలు రైల్వే అవటంతో, రైల్వే క్వార్టర్స్ లో ప్రక్క ప్రక్క ఇండ్లలో పెరిగాం. మా పద్ధతులు, భావాలు వేరయినా అవి ఏ నాడూ మా స్నేహానికి అడ్డురాలేదు. పుట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ మాకు మేమే స్నేహితులం. మరొకరిని మా స్నేహ సామ్రాజ్యంలోకి ఆహ్వానించలేదు. ఇప్పటి పెళ్ళి రూపంలో మీ కిద్దరికీ ఇష్టమయితే మనమంతా కలిసి ఒక స్నేహపురాన్ని స్థాపిద్దాం. ఏమంటారు? ఎప్పుడు కలుద్దాం? మీదే ఆలస్యం ! మా నుంచి మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాం! మీరిద్దరూ ఎలా ఉన్నా ఫరవాలేదు. ఏ కులమయినా, ఏ మతమయినా అభ్యంతరం లేదు. మా లాంటి స్నేహితులు,ఆడవారు అయితే చాలు. మిగతా అన్ని విషయాలలో సర్దుకుపోవటానికి, సహకరించటానికి మేము తయారు! ఆలస్యం చేయక మీ, మా సమస్యల చిక్కుముడిని విప్పేస్తారనే ఆశతో...
జీసస్
--------
మహమ్మద్
అంటూ ఇద్దరూ సంతకాలు చేశారు క్రింద. ప్రక్కనే వారి చిరునామాలు కూడా వ్రాసారు.
ఆ ఉత్తరం ఎంతో ఆనందాన్నిచ్చింది వాళ్ళిద్దరికి.పేర్లు చూసేటప్పటికి ఆలోచనలో పడ్డారు.వారిని చేసుకోవాలా, వద్దా అని కాదు.ఛాయ వారితో ఇమడగలదా అన్నదే ఆమె ఆలోచన. తనలాగా దూసుకుపోయే మనస్తత్వం కాదు. అందుకే పదే పదే అంతగా కలవర పడవలసి వస్తోంది.సరే! ఒకసారి ఛాయతో మాట్లాడదాం. జీవితాంతం కలిసి ఉండాల్సిన విషయం క్షణాలలో నిర్ణయం తీసుకోకూడదుగా. బాగా ఆలోచించి అడుగులు వేయాలి. అది ఏదైనా జీవితంలో వెనుతిరిగి చూసుకుంటే నిరాశ, నిట్టూర్పులుకు దారి తీయకూడదు. గతం అంతా అందమైన అనుభూతులు గానే మిగలాలి. అదొక్కటే తన ధ్యేయం.
గమ్యం. కాకపొతే అందరూ ఒంటరిగా నడుస్తూ జంటను వెతుక్కొని, జతగాడితో తమ జీవనాన్ని సాగిస్తే తాము మాత్రం ఇద్దరమూ కలిసి ఇద్దరు భాగస్వాములతో సంతోషంగా జీవితం గడపాలన్నది తమ ఆశయంగా మిగలకూడదు. ఆశయం ఆచరణ సాధ్యమై మరొకరికి ఆదర్శంగా నిలబడాలి. అప్పుడే జీవితాన్ని గెలిచినట్లు.
తన ఆలోచనలు వెళ్ళే తీరు చూసి ఆమెకు నవ్వు వచ్చింది. "ఏమిటి ! నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావ్" అన్న ఛాయ ప్రశ్నతో. "మనకు మొగుళ్ళు దొరికారా?" అంది ఆమె ప్రక్కనే కూర్చుంటూ. "ఆఁ ! దొరికినట్లే! నువ్వొప్పుకుంటే !"
విషయం అంతా విన్నాక ఠక్కున సమాధానమిచ్చింది వద్దని ఛాయ.
"ఏం? ఎందుకు వద్దంటున్నావ్" సూటిగా ప్రశ్నించింది సహజ.
"ఏదో మన కులం వాళ్ళయితే అమ్మా వాళ్ళను ఒప్పించవచ్చు. వేరే మతం కూడా!వాళ్ళు ఒప్పుకోరు.వెంటనే ఎవడ్నో తీసుకువచ్చి ఆ మూడు ముళ్ళు వేయించేస్తారు. జరగబోయేది అదే " అని రెండు వాక్యాలలో ఎంతో ఖచ్చితంగా చెప్పేసింది.
అమ్మా, నాన్నల సంగతి ప్రక్కన పెట్టు. అది తర్వాత. ముందు మన సంగతి చూడు. ఎన్ని నెలలు గడిచాయో ఒక్కసారి ఆలోచించు. ఈ కాస్త టైములో ప్రపంచాన్ని చూసిన అనుభూతి కలిగింది. ఎన్నో సంవత్సరాలు పెళ్ళిళ్ళు కాకుండా మిగిలిపోయిన వాళ్ళున్నారు. మతం మారితే ఏముంది? వాళ్ళు మనలా భారతీయులు.మనలో ప్రవహించే రక్తమే వారిలో కూడా ప్రవహిస్తోంది. అంత వరకే నా ఆలోచన. కాకపొతే మహమ్మదీయులలో మళ్ళీ మళ్ళీ పెళ్ళి చేసుకొనే అవకాశముంది. అలా ఎవరినీ చేసుకోనని అగ్రిమెంట్ రాయించుకుందాం. అలా ఇష్టపడితేనే ముందుకు వెళదాం. ఆ ఏటికి నువ్వు ఎదురీదలేవని 'మహమ్మద్' ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. 'జీసస్' గురించి నువ్వాలోచించు. వాళ్ళు ఏసు ప్రభువును ప్రార్థిస్తారు. మనం రాముడ్ని, వేంకటేశ్వరుడిని కొలుస్తాం. వాళ్ళు చర్చికి వెళతారు. మనం గుడికి వెళతాం. ఇష్టమైతే వాళ్ళతో కలిసి అడుగులు వేద్దాం.లేదంటే మనింట్లో మనం ఉంటాం. మంచి వాళ్ళు భర్తలయితే ఇలాంటివన్నీ పెద్ద అడ్డంకులు కావు. ఏమంటావ్?"
"తప్పదా? ఎంత రాద్ధాంతమవుతుందో? చివరకు సక్సెస్ అవుతామన్న నమ్మకం నాకు లేదు."
"నాకుంది. ముందు నీ అభిప్రాయం ముఖ్యం. అది చెప్పు. " "సహజా! ఇక సీరియస్ గా విషయానికొచ్చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచే మన కట్టు, బొట్టు, సాంప్రదాయం అంటే ప్రాణమని నీకు తెలుసు.కలియుగంలో ఎన్నో మార్పులు వచ్చినా నాలో మార్పు రాలేదు. అలాంటిది ఇప్పుడు అతన్ని చేసుకుంటే, బొట్టు లేకుండా విధవరాలిలా.. ఉహుఁ !.. అస్సలు అది నేను సహించలేను. మన పద్ధతులను గౌరవించి నాకు అడ్డు రానంటేనే.. "
"ఛాయా! మనకి, మన మాటకి గౌరవం లేని చోట ఒక్క క్షణం కూడా ఉండం.మన అభిప్రాయాలు, వాళ్ళ అభిప్రాయాలు కలిస్తేనే ముందుకు సాగేది. లేకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు.కులం, మతం అంటూ చాదస్తంగా మాత్రం ఈ ఛాన్స్ వదులుకోవద్దు. చూద్దాం అంటున్నాను. అంతే !"
"ఏమో ! నాకు భయంగానే ఉంది."
"ఏం భయం లేదు. మన జాతీయ జెండాలో మూడు రంగులు ముచ్చట గొలుపుతూ మనల్ని మురిపించటం లేదూ! అలాగే మన మూడు మతాలూ ఒక్కటై త్రివర్ణ పతాకంలా ఎగురుతూ జీవితం రంగురంగులుగా ఉంటుందనే నమ్మకం నాకుంది."
"సరే! కలసి నడుద్దాం"
"ఏంటి సినిమా పేరుచెబుతున్నావా? నిజంగా అంటున్నావా?"
"జోకులెయ్యకు. ఈ సమరంలో అలనాటి అర్జునునిలా అస్త్రాలు ఎక్కడ వదిలేస్తానా అనే భయంతో ఛస్తుంటే.. !"
"ఆఁ! ఆఁ! ఆ పని మాత్రం చెయ్యకు తల్లీ! అస్త్ర సన్యాసం మన మధ్య లోకి తెస్తే నిజంగా కృష్ణావతారం ఎత్తాల్సి వస్తుంది" అంది నవ్వుతూ. సహజ "తథాస్తు !"అంది.
దేవతలు తథాస్తు అన్నట్లుగా చిటపటమంటూ ఒక్కసారిగా పెద్ద పెద్ద చినుకులు ప్రారంభమయ్యాయి.
అంతే !ఒక్కసారిగా పరుగు
లంకించుకున్నారు ఇద్దరూ.
"ఈ పరుగు రేపు జీసస్, మహమ్మద్ లను పెళ్ళి చేసుకునే వరకూ ఆపకూడదు" అంది సహజ ముగింపు సమావేశంగా.
* * *
అనుకొన్న విధంగానే జీసస్, మహమ్మద్ లను కలిశారు. ఇద్దరూ బాగున్నారు. వాళ్ళ వ్యక్తిత్వాలూ అనుకూలంగానే ఉన్నాయి. సహజ, ఛాయ చెప్పినవాటికన్నిటికీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు.
జీసస్ కి ఛాయ ఎంతో నచ్చింది. ఏడడుగులు వేయటానికి ఏడు గంటలు చర్చించుకున్నారు. అది చాలు అనుకొని తృప్తిగా లేచారు. తమను పోషించగల సంపాదన, తమ భావాలను విలువనిచ్చే తమ లాంటి స్నేహితులు - అది చాలు అనుకున్నారు స్నేహితులిద్దరూ!
ఇప్పటి దాకా కథ బాగానే నడిచింది. ఇక్కడ నుంచీ అసలైన కథ ప్రారంభం.
ఒకే రోజు ఒకే టైం లో నలుగురూ వాళ్ళ తల్లితండ్రులకు విషయాన్ని చెప్పారు. కానీ అది WTC మీద బాంబ్ పేలినంత హడావిడి తెచ్చింది ఆ ఆ కుటుంబాలలో.
మాటల యుద్ధంప్రారంభమయ్యింది. బెదిరింపుల అస్త్రాలు వదిలారు. మేమేం తక్కువా అని ఒక్క ఛాయ తప్ప అందరూ ఎదురు అస్త్రాలు ప్రయోగించారు. అవి ఒకదాని నొకటి ఢీకొని విడిపోయాయి. రోజులు గడుస్తున్నాయి.గెలుపు, ఓటమి తెలియని యుద్ధం నిశ్శబ్దంగా సాగుతూనే ఉంది.
ఎవరికి వాళ్ళు మనసులోనే మథన పడుతున్నారు. బయటకు మౌనాన్ని ప్రదర్శిస్తున్నారు.సహజ ఏదీ అనుకోదు. కానీ ఏదన్నా పట్టు పట్టిందంటే అది అయ్యేదాకా నిద్రపోదు.
ఆమె మనస్తత్వం తెలిసిన తల్లితండ్రులు హైమవతి, సర్వేశ్వర్ గట్టిగామందలించలేకపోయారు.
అలా అని ఊరుకోనూ లేదు. అసలు వీళ్ళిద్దరినీ ఇంతగా కలిసి ఉండనీయకుండా ఉండాల్సింది అనుకున్నారు. సహజ ముందు ఏమీ అనలేక ఛాయ దగ్గర ఉన్న చనువుతో ఆమెనే మందలించారు.
"అసలు ఇదంతా నీ వల్లనే జరిగింది. నువ్వు ఒప్పుకోకపోతే సహజ ఒక్క అడుగు కూడా ముందుకువెయ్యలేదు.ఇప్పటికయినా మించిపోయింది లేదు. నీ కిష్టం లేదని చెప్పు చాలు. చిన్నప్పటి నుంచీ మీ ఇద్దరూ ఏదీ కోరకుండానే ఇచ్చాం. ఈ ఒక్క విషయంలో మా మాట విను. మన కులం, మన మతం లోనే మంచి వాళ్ళను వెదుకుదాం.తొందర పడకండి." అన్నారు.
అది హెచ్చరికో, సలహానో, బెదిరింపో అర్ధం కాక ఛాయ సతమత మయ్యింది.
వీళ్ళ మాటలు విని సహజను తను కాదనగలదా? అది అంతా చేసేది తమ కోసమే కదా! తన మనస్తత్వం తెలిసి మహమ్మద్ ని మనిషిని చూడకుండానే తను చేసుకుంటానన్న దాని త్యాగం ముందు నేనెంత? ఆలోచనల వేడికి నరాలు చిట్లిపోతాయేమోనన్నంత బాధ, పిరికితనం అణువణువున నరనరాలలో రక్తం లా ప్రవహిస్తుంటే ఛాయ ఆ ఒత్తిడికి తట్టుకోలేక, ఎవరికీ అన్యాయం చేయడం ఇష్టం లేక, తనకు తను ధైర్యం చెప్పుకోలేని పరిస్థితులను వివరిస్తూ లెటర్ రాసి అజ్ఞాతం లోకి వెళ్ళిపోయింది
ప్రతి ఉదయంలా ఆ రోజూ తెల్లవారింది. పక్షుల కిలకిలా రావాలు, సరిగమలు,కువకువలు,
సంగీతాన్ని గుర్తు చేసేక్షణాలు.
అందమైన ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. వాటితో పాటూ ఛాయ లేదన్న నిజం మొదట విస్తుపరిచింది ఆమె తల్లి తండ్రులు విష్ణు వర్ధన్, సావిత్రిలకు. విషయం తెలియగానే సర్వేశ్వర్, హైమవతి కి నోట మాట రాలేదు. కుమిలి పోసాగారు.ఏదో విధంగా జరగబోయే దాన్ని ఆపాలనుకున్నారే కానీ ఇలా జరుగుతుందని ఊహిస్తే అసలు కాదనే వాళ్ళం కాదే! ఎన్ని వందలు,వేలసార్లు ఆ మాటను మనసులో అనుకున్నారో!
ఆలోచనలకిది సమయం కాదు. అసలే భయస్తురాలు. ఏ అఘాయిత్యం చేసుకుంటుందో అని హడావిడిగా రైలు పట్టాలు, చెరువులు, ఇదీ అదీ అనకుండా పది మంది పది వైపులా చేరి ఊరంతా వెతికారు.
బస్ స్టేషన్ లు, రైల్వే స్టేషన్ లూ అంతా వదలకుండా అతి జాగ్రత్తగా గమనించినా ఫలితం దక్కలేదు. రోజులు అసలే బాగోలేవు. ఏ దుర్మార్గుల దృష్టిలోనయినా పడితే కన్నెపిల్ల పరిస్థితి ఏమిటి? అందరిదీ అదే ఆలోచన. వెదుకులాట వెదుకులాటే. ప్రయోజనం మాత్రం శూన్యం. అయినా ప్రయత్నాలు ఆపక అలా పిచ్చివాళ్ళలా రోడ్డు అమ్మట కార్లు, స్కూటర్లు, ఆటోలు పట్టుకొని ప్రయత్నిస్తూనే ఉన్నారు. తమ పిల్లను కాపాడమని భగవంతుని ప్రార్దిస్తూనే ఉన్నారు.
* * *
సహజకు ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటు. రోజూ లాగే కళ్ళు తెరవగానే కనిపించే హడావిడి లేదు.
టి.వి. శబ్దాలు వినిపించటం లేదు. తల్లి తండ్రుల మాటలూ లేవు. ఏదో జరిగిందని సిక్స్త్ సెన్స్ పదేపదే అంటుంటే దుప్పటిని ప్రక్కకు తోసి బయటకు వెళ్ళింది. తలుపులన్నీ బార్లా తీసే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తలుపులు వెయ్యకుండా, తనను లేపకుండా, తనతో చెప్పకుండా... ఛాయ వాళ్ళకేమయినా తెలిసి ఉంటుంది అనుకొని డ్రస్సును సరిచూసుకుని, తల దువ్వుకొని, ముఖాన్ని అద్దంలో చూసుకొని ఫరవాలేదనుకున్నాక బయలుదేరింది.
అక్కడ పనిమనిషి పాపాయమ్మ ఒకటే ఏడుస్తోంది రాగాలు తీస్తూ.
"ఛాయమ్మ ఎంత మంచిది. చివరకు ఇలా మాకు దూరమయి పోయావా తల్లీ! " అంటూ. సహజ గుండె ఒక్క క్షణం కొట్టుకోవటం ఆగిపోయిందేమో అన్నంత అనుమానం వచ్చింది.
పరుగున ఆమె చెంతకు చేరి "ఏయ్ ! పాపాయమ్మా! ఏంటి? ఏంటి మాట్లాడుతున్నావ్?ఛాయకు..
నా ఛాయకు ఏమయింది? " జారిపోతున్న హృదయాన్ని అరచేతుల్లో పట్టుకొన్న ఫీలింగ్ సహజలో.
"ఏడకెళ్లిపోయిందో, ఏమయిపోయిందో తెలియదు తల్లీ. ఉత్తరం రాసి పెట్టి వెల్లిపోనారు తల్లీ! " మళ్ళీ ఏడవటం ప్రారంభించింది.
అందరూ ఛాయను వెదకటానికి వెళ్ళి ఉంటారు. కనీసం తనను లేపాలని కూడా ఎవరికీ అనిపించలేదా? కంగారులో తన గురించి పట్టించుకునేది ఎవరు? తనకు కూడా చెప్పకుండా ఎక్కడకు వెళ్ళింది ఛాయ? అక్కడే నేల మీద ఎగురుతున్న ఉత్తరాన్ని తీసుకొని చదివింది. పరిస్థితులు గాబరా పెడుతున్నా మనసులో ధైర్యంగానే ఉంది సహజకు.
ఛాయ పిరికిది. దానికి ప్రాణాలు తీసుకొనే ధైర్యం లేదు. తనను వదిలి నాలుగు రోజులు కూడా ఉండలేదు. తను ముందు ధైర్యాన్ని సడలి పోనివ్వకుండా చూసుకోవాలి. అయినా ఏదయినా ఫీల్ అయితే తనతో చెప్పాలి కానీ ఇలా చెప్పా పెట్టకుండా ఎక్కడికో ఎలా వెళ్ళింది? ఎటు వెళ్ళి ఉంటుంది? రోజులు అసలే బాగాలేవు. గడప దాటిన ఆడపిల్లకు చెట్టుకున్న పండుకు తేడా లేని రోజులు. ఎవరికీ వాళ్ళు అంది పుచ్చుకొని తినేద్దామనుకొనే వాళ్ళే! ఛాయా! ఛాయలా నా వెన్నంటే ఉండేదానివి. నీ నీడలా నేనెన్నటికీ దూరం కాను అని ఎన్ని కబుర్లు చెప్పావ్! ఇలా అందుకు చేసావ్! నీ కిష్టం లేదంటే జీవితాంతం పెళ్ళి చేసుకోకుండా ఇలా ఉండిపోయే
దాన్ని. ఆ విషయం నీకు తెలియదా?" అని తనలో తానే కుమిలిపోతున్న సమయంలో ఫోన్ రింగ్ అయింది.
ఫోన్ తీసి 'హలో' అంది. అటు నుంచీ మహమ్మద్ "నిరాహార దీక్షలు ఫలించాయి. జీసస్ ఇంట్లో నిట్టూర్పుల వేడి చల్లారలేదు. కానీ వాడికీ గ్రీన్ సిగ్నల్ పడిపోయినట్లే. ఈ శుభవార్త మీకు చెబుదామని ఫోన్ చేసాను."
ఛాయ విషయం చెబుదామా, వద్దా అని ఒక్క క్షణం ఆలోచించినా సహజకు విషయం చెప్పటమే మంచిదని,తమ మధ్య రహస్యాలు ఉండకూడదని నిశ్చయించుకొంది.
"సహజగారూ! సహజగారూ! ఏమిటి మాట్లాడరు? మీకు సంతోషంగా లేదా?"
అతనికేమీ అర్ధం కావటం లేదు. సహజ సమాధానం కోసం ఆత్రంగా చూస్తున్నాడు.
"అదేమీ లేదు. మా ఇంట్లో కోప్పడ్డారని ఛాయ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది."
"అలాగా! మేమిద్దరం ఇప్పుడే బయలు దేరుతున్నాం. మీరేం కంగారు పడవద్దు. ఛాయ తప్పక కనబడుతుంది. ఆమెను తెచ్చి అప్పచెప్పే పూచీ మాది." అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసాడు.ఎలా ఇల్లు చేరిందో ఆమెకే తెలియదు.
బొగడ చెట్టుకి ఆనుకొని ఛాయను క్షణక్షణం గుర్తు చేసుకుంటుంది సహజ. తనవల్లే.. తనవల్లే ఇదంతా.. అమాయకురాలు బలయింది.. తను ఈ ప్రపోజల్ పెట్టకపోయినా బాగుండేది.. తలుచుకొని తలుచుకొని ఏడుస్తోంది. గంట వ్యవధిలో అపస్మారక స్థితిలో ఉన్న ఛాయను సహజ ముందుకు తీసుకొచ్చారు జీసస్, మహమ్మద్.
అసలేమయిందంటే జీసస్, మహమ్మద్ బయలు తీరుతుంటే విషయం తెలుసుకున్న వారి తల్లితండ్రులు మేరీ, జాన్సన్, నూర్, ముంతాజ్ లు కూడా వాళ్ళతో బయలుదేరారు. తాము అంగీకరించక పోవటం వల్లనే ఇలా జరిగిందన్న పశ్చాత్తాపం వారిని అలా బయలుదేరనిచ్చింది. టాక్సీ సిటీ పొలిమేరలో ఉండగా ఛాయ రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయి కనిపించింది.
బొగడ చెట్టు క్రింద 'భయం' అంటే ఎరుగని సహజ భయంకరమైన ఆలోచనలతో పోరాడుతున్న సమయంలో ఛాయను అక్కడకు తీసుకువచ్చారు. ఛాయ తలను ఒళ్ళో పెట్టుకుంటూ, "ఛాయా! నా ఛాయా! వచ్చావా? రా! ఇలా నా ఒళ్ళో పడుకోవే! ఇలా నీ కోరిక తీర్చుకుంటున్నావా? ఏమయిందిరా నీకు? నా కోసం కళ్ళు తెరువ్! " అది బ్రతిమాలటమో,ఆజ్ఞాపనో, ఆవేదనో ఆమెకే తెలియటం లేదు. నీళ్ళు తెచ్చి జల్లినా ప్రయోజనం లేకపోయింది.
ఒకరు డాక్టరు దగ్గరకు పరిగెత్తారు.
ఊరంతా వెతికి వెతికి వచ్చిన ఛాయ,సహజ తల్లి తండ్రుల నిరాశ ప్రాణాలకు ఛాయ దొరికిందన్న వార్త గ్లూకోజ్ తాగినంత బలాన్ని ఆనందాన్నిచ్చింది. డాక్టరు ఇచ్చిన ఇంజక్షన్ తో అరగంట తర్వాత వారందరి ఆందోళనలకు తెరదించుతూ ఛాయ కళ్ళు తెరిచింది. అందరి కళ్ళలో సంతోషంతో వెలుగులు విరిసాయి.
విచిత్రంగా బొగడపూలు చిరుజల్లులా సహజ, ఛాయాల మీద పడి అందరినీ ఆశ్చర్యపరిచాయి.
కుల, మతాలను ప్రక్కన పెట్టి, పిల్లల హృదయాలకు విలువనిచ్చి వాళ్లకు పెళ్ళి చేసి సర్వ మానవసమానత్వంకి ప్రతీకగా నిలుద్దామని అందరూ నిశ్చయించుకున్నారు. పండుగ చేసుకున్నారు.
జీసస్, మహమ్మద్, వారి తల్లితండ్రులకు వీడ్కోలు ఇద్దామని బయటకు వచ్చిన వారికి ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్యవం సందర్భంగా షర్ట్ లకు జెండాలను తగిలించుకొని, చేతిలో మరో చిన్న పుల్లకు అంటించిన జెండాలతో బారులుగా బయలుదేరుతున్న బాల బాలికలు కనిపించారు. అవే తమ పెళ్ళి తోరణాలు గా అనిపించాయి ఆ జంటలకు.