కర్ణాటకలో ఎంట్రీ ఇవ్వబోతున్న వైసీపీ? జగన్ అంచనా ఏంటంటే.!

జగన్ కూడా కేసీఆర్ లాగానే వేరే రాష్ట్రాల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

Advertisement
Update:2022-12-11 09:04 IST

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ మనుగడలోకి రావడంతో ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వరకే పరిమితం అయిన పార్టీని ఇతర రాష్ట్రాల్లోకి విస్తరించాలని చూస్తున్నారు. లోక్‌సభలో చక్రం తిప్పాలంటే.. ఆ మేరకు ఎంపీ సీట్లను గెలుచుకోవాలి. అందుకే ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారి ప్రభావం ఉన్న ప్రాంతాలను ఆయన సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే బాటులో వైసీపీ అధినేత జగన్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తున్నది.

ఉమ్మడి ఏపీలో పోటీ చేసిన వైసీపీ.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఖమ్మం జిల్లాలో తన ప్రభావాన్ని చాటుకున్నది. అయితే ఆ తర్వాత వైఎస్ జగన్ కేవలం ఏపీపైనే ఫోకస్ చేశారు. అధికారంలోకి రావల్సిన అవసరం ఉండటంతో తెలంగాణను అసలు పట్టించుకోలేదు. ఏపీలో తాను అనుకున్నది సాధించిన జగన్.. నెక్ట్స్ ఎలక్షన్స్‌లో కూడా తిరిగి అధికారం చేపట్టాలనే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం, పార్టీ తరపున ఎన్నికల కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక జగన్ కూడా కేసీఆర్ లాగానే వేరే రాష్ట్రాల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ రాష్ట్రంలో బలంగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్, జేడీ (ఎస్) పార్టీలో అధికారంలో కోసం బరిలోకి దిగనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిన ఖర్గే సొంత రాష్ట్రం కావడంతో ఆయన ఈ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటున్నారు. కుమారస్వామి ఈ సారి ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలసి పోటీ చేస్తామని చెబుతున్నారు. కల్యాణ కర్ణాటక (ఓకప్పటి హైదరాబాద్ స్టేట్‌లో భాగం) ప్రాంతంలో బీఆర్ఎస్‌ వల్ల ఓట్లు దక్కుతాయని జేడీఎస్ భావిస్తున్నది. బీజేపీకి కర్ణాటకను దూరం చేయడమే ప్రస్తుతం ప్రతిపక్షాల లక్ష్యంగా ఉన్నది.

బీఆర్ఎస్ లాగానే.. వైసీపీ కూడా తెలుగు వాళ్లు అధికంగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. రాయలసీమ నుంచి చాలా మంది కర్ణాటకకు వలస వెళ్లారు. బెంగళూరులో అత్యధిక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఏపీకి చెందిన వాళ్లే ఉంటారు. అలాగే తెలుగువారికి ఆ నగరంలో వ్యాపారాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు బల్లారి, మైసూరు, గుల్బర్గ ప్రాంతాల్లో తెలుగువారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఎప్పటి నుంచో వైసీపీ ఇక్కడ పోటీ చేయాలని డిమాండ్ వస్తోంది. ఈ సారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపడం ఖాయంగానే కనిపిస్తున్నది.

బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి వైఎస్ జగన్ సన్నిహితుడు. ఆయన ప్రస్తుతం బీజేపీలో యాక్టీవ్‌గా లేరు. ఓబులాపురం మైనింగ్ అక్రమాల కేసులో జైలుకు వెళ్లి.. బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు జనార్ధన్ రెడ్డి సహకారాన్ని వైసీపీ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. రాయచూరు, చిక్‌బల్లాపూర్, కోలార్ జిల్లాల్లో రాయలసీమకు చెందిన వాళ్లు ఎక్కువగా వలస వెళ్లారు. ఆ జిల్లాల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 20 స్థానాల్లో వైసీపీ బరిలోకి దిగే అవకాశం ఉన్నది. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ స్థానాలకు కర్ణాటక నుంచి పోటీ చేయాలా వద్దా అనేది నిర్ణయిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే గాలి జనార్ధన్ రెడ్డితో వైసీపీ అధిష్టానం మంతనాలు జరిపినట్లు సమాచారం. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తున్నది. అంతా ఓకే అయితే కర్ణాటకలోని రాయచూర్, సింధనూర్, దేవదుర్గ, బల్లారి, సిరిగుప్ప, సండూర్, చెళ్లకెరె, చిత్రదుర్గ, హిరియూర్, పావగడ, మధుగిరి, బాగేపల్లి, చింతామణి, గౌరిబిదనూర్, ముళబాగలు, కోలార్ వంటి నియోజకవర్గాల్లో వైసీపీ బరిలోకి దిగడం ఖాయమే.



Tags:    
Advertisement

Similar News