మరో పదేళ్లు కట్టప్పగానే ఉంటావా..? పవన్ పై వైసీపీ సెటైర్లు

పవన్ కల్యాణ్ కి టీడీపీపై ఉన్న ప్రేమకంటే, వైసీపీపై ఉన్న ద్వేషమే ఎక్కువపాళ్లు ఉన్నట్టుంది. కేవలం వైసీపీని గద్దె దింపడంకోసమే తాను టీడీపీతో కలిసినట్టు ఆయన పదే పదే చెబుతున్నారు. తన భవిష్యత్తుని కూడా అందుకే పట్టించుకోవడంలేదంటున్నారు.

Advertisement
Update:2023-12-15 09:55 IST

టీడీపీ-జనసేన పార్టీల పొత్తు కనీసం ఓ దశాబ్ద కాలం పాటు ఉండాలన్నారు పవన్ కల్యాణ్. దశాబ్ద కాలంపాటు పొత్తు ఉంటేనే రాష్ట్ర విభజన నష్టాన్ని, వైసీపీ పాలన విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోగలమని చెప్పారు. ఆయన ఏ ఉద్దేశంతో దశాబ్దం పొత్తు అన్నారో కానీ.. క్యాడర్ లో నిరుత్సాహం మొదలైంది. అంటే మరో పదేళ్లు మనం టీడీపీతోనే కలసి ఉండాలా, సొంతగా ఎదిగే ప్రయత్నం చేయలేమా అని దిగాలు పడుతున్నారు. 2024లోనే కాదు 2029లో కూడా టీడీపీ విదిల్చే సీట్లు తీసుకుని సైలెంట్ గా ఉండాలా అని బాధపడుతున్నారు జనసైనికులు. వైసీపీ కూడా ఈ వ్యవహారంపై సెటైర్లు పేలుస్తోంది. పవన్ కల్యాణ్ మరో పదేళ్లపాటు చంద్రబాబుకి కట్టప్పగానే సేవలందించేందుకు ప్రిపేర్ అయిపోయారని సోషల్ మీడియాలో కౌంటర్లిస్తున్నారు వైసీపీ నేతలు.

టీడీపీపై ప్రేమా.. వైసీపీపై ద్వేషమా..?

పవన్ కల్యాణ్ కి టీడీపీపై ఉన్న ప్రేమకంటే, వైసీపీపై ఉన్న ద్వేషమే ఎక్కువపాళ్లు ఉన్నట్టుంది. కేవలం వైసీపీని గద్దె దింపడంకోసమే తాను టీడీపీతో కలిసినట్టు ఆయన పదే పదే చెబుతున్నారు. తన భవిష్యత్తుని కూడా అందుకే పట్టించుకోవడంలేదంటున్నారు. "నా భవిష్యత్తు కోసం నేనేం చేయడం లేదు. ఏపీ భవిష్యత్తు కోసమే కృషి చేస్తున్నా. ఒక్క సీటు కూడా వైసీపీకు వెళ్లకుండా పని చేయాలి." అని కార్యకర్తలకు ఉద్బోధించారు పవన్.

వైసీపీ పాలనలో ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని, దిక్కే లేకుండా పోయిన ఏపీని గాడిలో పెట్టాలంటే.. ఒక్కసారి జనసేనను నమ్మాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముస్లింలు మైనార్టీలు కాదని, మెయిన్ స్ట్రీమ్ నాయకులని పేర్కొన్నారు. మైనార్టీలు ఇబ్బందుల్లో ఉంటే సాటి మనిషిగా అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. పల్లం వైపే నీరు వెళ్తుందని, పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు దానంతట అదే వస్తుందని చేరికల సభలో చెప్పారు పవన్. ఏపీలో ప్రజలు తప్ప నాయకులంతా బాగు పడుతున్నారని విమర్శించారు.

అంతా బాగానే ఉంది కానీ.. జనసేన సభలో కూడా ఆయన టీడీపీతో కలసి పనిచేస్తాం.. ఏడాది కాదు, పదేళ్లు అంటూ టార్గెట్ ఫిక్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. జనసేన నేతలు, కార్యకర్తలు కూడా ఆలోచనలో పడ్డారు. వైసీపీ నుంచి అదిరిపోయే సెటైర్లు పడుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News