యువగళం ముందు నిరసన గళం..

తిరుపతి జిల్లాలో యువగళం ఎంట్రీ ఇచ్చిన తర్వాత, స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు లోకేష్. దీంతో వైసీపీ నేతలు నిరసనకు దిగారు.

Advertisement
Update:2023-02-26 09:10 IST

యువగళం పాదయాత్ర మొదలైనప్పటినుంచి అక్కడక్కడ వైసీపీ శ్రేణులనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఎక్కడా నాయకులు కలబడలేదు, లోకేష్ యాత్రను అడ్డుకోలేదు. ముందస్తుగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే తిరుచానూరులో మాత్రం ఈ ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోకేష్ బస చేస్తున్న టెంట్ దగ్గరికి వైసీపీ శ్రేణులు చొచ్చుకు వచ్చాయి. ప్లకార్డులు చేతబట్టుకుని నిరసనకు దిగాయి. నోటికి తెల్లరిబ్బన్ కట్టుకుని వారు శాంతియుతంగానే వచ్చినా.. అక్కడ టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపుతప్పే ప్రమాదముందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడివారినక్కడ సర్దిచెప్పి పంపించేస్తున్నారు.

నగరి నియోజకవర్గంలో కూడా మంత్రి రోజాపై తీవ్ర విమర్శలు చేశారు నారా లోకేష్. టీడీపీ శ్రేణులు ఇంటిపైకి వెళ్లడంతో పోలీస్ కేసు కూడా నమోదైంది. తిరుపతి జిల్లాలో యువగళం ఎంట్రీ ఇచ్చిన తర్వాత, స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు లోకేష్. దీంతో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. చంద్రబాబు, లోకేష్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లోకేష్ బస చేస్తున్న ప్రాంతానికి వైసీపీ శ్రేణులు తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. “లోకేష్ నాయుడు గారు అవినీతిని నిరూపించండి లేదా క్షమాపణలు చెప్పండి” అంటూ ఫ్లకార్డులతో నిరసన తెలిపారు వైసీపీ నాయకులు. సర్దిచెబుతున్న పోలీసులతో కూడా వారు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో, పోలీసులు వైసీపీ నేతలను అలిపిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

యువగళం చప్పగా సాగుతోందన్న విమర్శల నేపథ్యంలో కాస్త మసాలా దట్టించారు నారా లోకేష్. మీసం మెలేయడం, దమ్ముంటే రండి చూస్కుందాం అంటూ సవాళ్లు విసరడంతోపాటు.. ఎక్కడికక్కడ స్థానిక నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీని పర్యవసానమే ఈ నిరసనలు, ఆందోళనలు. యువగళం అసలు లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో తెలియదు కానీ, ఈ హడావిడితో ప్రతిరోజూ వార్తల్లోకెక్కుతోంది.

Tags:    
Advertisement

Similar News