వైసీపీ మేనిఫెస్టోపై కీలక అప్ డేట్..
ప్రస్తుతం విశాఖలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేపు పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు జగన్. ఈ సమావేశంలో మేనిఫెస్టో ఖరారవుతుందని అంటున్నారు.
వైసీపీ మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తారు..?
నవరత్నాలకు మించి ఈసారి ఏముంటాయి..?
మద్యపాన నిషేధం గురించి జగన్ ఏం చెబుతారు..?
జగన్ కొత్త హామీలు టీడీపీకి చుక్కలు చూపిస్తాయా..?
ఈ ప్రశ్నలన్నిటికీ మరో నాలుగైదు రోజుల్లో సమాధానం తెలుస్తుంది. ఈనెల 26 లేదా 27న వైసీపీ మేనిఫెస్టో విడుదలవుతుందని అంటున్నారు. సిద్ధం సభల్లోనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. ఈనెల 25న సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని అంటున్నారు.
కీలక సమావేశం..
ప్రస్తుతం విశాఖలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేపు పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు జగన్. ఈ సమావేశంలో మేనిఫెస్టో ఖరారవుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు ఈ మేనిఫెస్టోలో ఘనమైన హామీలుంటాయని తెలుస్తోంది. సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి లీకులు బయటకు రాలేదు.
భారీ అంచనాలు..
టీడీపీ సూపర్ సిక్స్ ప్రకటించినా చంద్రబాబు మాటల్ని ఎవరూ నమ్మడంలేదు. కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టోల కిచిడీలాగా అది తయారైంది. హామీలు నెరవేర్చని చంద్రబాబు ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ దశలో వైసీపీ మేనిఫెస్టోపై భారీ అంచనాలున్నాయి. గతంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలను 99 శాతం అమలు చేసి చూపించిన జగన్, ఈసారి కూడా నవరత్నాలకు మించిన పథకాలతో ప్రజల ముందుకొచ్చే అవకాశం ఉంది. వైసీపీ మేనిఫెస్టో బయటకు వస్తే మాత్రం కూటమిలో మరింత భయం పెరగడం ఖాయం.