జగన్ ప్రయాణంపై వార్తలు.. ఎల్లో మీడియా నవ్వులపాలు
ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను టార్గెట్ చేయడంతోపాటు.. జగన్ ప్రయాణాలపై కూడా చిత్ర విచిత్రమైన వార్తలిస్తూ ఎల్లో మీడియా నవ్వులపాలవుతోంది.
ఎల్లో మీడియా వార్త -1
ఏపీ సీఎం జగన్ జనాల్లోకి రావడం లేదు. తాడేపల్లి ప్యాలెస్ కే ఆయన పరిమితం అయ్యారు.
వార్త-2
జగన్ బయటకు వస్తే రోడ్లు బ్లాక్ అయిపోతున్నాయి. ట్రాఫిక్ లో ప్రజలు నరకం చూస్తున్నారు. అసలు జగన్ ఆ కార్యక్రమానికి వెళ్లడం అవసరమా..?
వార్త-3
ఆ కాస్త దూరానికే జగన్ హెలికాప్టర్ వాడాలా..? రోడ్డుపై వెళ్తే సరిపోదా..?
ఎల్లో మీడియా వండి వారుస్తున్న వార్తలివి. జగన్ పై ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలు ఎల్లో మీడియాలో కామన్ గా మారిపోయాయి. కేవలం జగన్ ని టార్గెట్ చేయడం కోసమే ఈ ప్రయాస అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి వార్తలతో టీడీపీకి ఎంతవరకు మేలు జరుగుతుందో తెలియదు కానీ.. సదరు మీడియా సంస్థలు మాత్రం నవ్వులపాలవుతున్నాయి.
ప్రస్తుతం ఏపీలో హెలికాప్టర్ వ్యవహారం ట్రెండింగ్ లో ఉంది. హెలికాప్టర్ ల్యాండింగ్ కి అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్లే పవన్ కల్యాణ్, భీమవరం పర్యటన వాయిదా పడిందని అంటున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ హెలికాప్టర్ పర్యటనపై ఈనాడులో ఓ సెటైరిక్ కథనం వచ్చింది. 30 కిలోమీటర్ల దూరానికి జగన్ హెలికాప్టర్ ఉపయోగిస్తున్నారని, దీనిపై విమర్శలు చెలరేగాయని ఈనాడు ఓ కథనాన్ని వండివార్చింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరవుతున్న సీఎం.. ఓర్వకల్లు విమానాశ్రయానికి వచ్చి, అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడుమూరు రోడ్డులోని వివాహ వేదిక వద్దకు హెలికాప్టర్ లో వెళ్తున్నారని ఈనాడు ఆవేదన వ్యక్తం చేసింది. సీఎం జగన్ రోడ్డు మార్గం ద్వారా వెళ్లినా ఈనాడు ఊరుకునేది కాదు. రోడ్డుపై ట్రాఫిక్ కి అంతరాయం కల్గించారనే కథనం వచ్చేది. పోనీ అసలా కార్యక్రమానికి జగన్ రాకపోయినా అది ఈనాడుకి వార్తే. ఫలానా నాయకుడిని దూరం పెట్టారని మరో యాంగిల్ లో స్టోరీ రెడీ చేస్తారు.
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ ఎల్లో మీడియా బరితెగించిపోతోంది. జగన్ ని టార్గెట్ చేస్తూ వరుస కథనాలిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను టార్గెట్ చేయడంతోపాటు.. ఇలా జగన్ ప్రయాణాలపై కూడా చిత్ర విచిత్రమైన వార్తలిస్తూ ఎల్లో మీడియా నవ్వులపాలవుతోంది.