దర్శనాల వివాదం.. వైసీపీ వర్సెస్ బీజేపీ

తిరుమల శ్రీవారి ఆలయం వైసీపీ కార్యాలయం కాదనే విషయాన్ని ఎమ్మెల్యే రాంబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు భానుప్రకాష్ రెడ్డి. ఆయన రాగానే గేటు తెరిచి సలాం కొట్టడానికి ఇక్కడెవరూ రాజకీయ నాయకుల తొత్తులు లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update:2023-03-27 13:30 IST

తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. టీటీడీ అన్నా, సీఎంఓ కార్యాలయం అన్నా అధికారులకు లెక్కలేకుండా పోతోందని విమర్శించారు రాంబాబు. ఈవో ధర్మారెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ మండిపడింది. తిరుమలలో వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. అన్నా రాంబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇది వైసీపీ ఆఫీస్ కాదు..

తిరుమల శ్రీవారి ఆలయం వైసీపీ కార్యాలయం కాదనే విషయాన్ని ఎమ్మెల్యే రాంబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు భానుప్రకాష్ రెడ్డి. ఆయన రాగానే గేటు తెరిచి సలాం కొట్టడానికి ఇక్కడెవరూ రాజకీయ నాయకుల తొత్తులు లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్ర, శని, ఆది వారాల్లో తిరుమలలో కేవలం ప్రోటోకాల్ ప్రముఖులకే దర్శనం ఉంటుందని, వారితోపాటు వచ్చేవారికి దర్శనాలు ఉండవనే విషయం రాంబాబు గుర్తుంచుకోవాలన్నారు. ఆ విషయం తెలిసి కూడా ఎమ్మెల్యే రాంబాబు 30 మందితో కలసి దర్శనానికి వచ్చారని, అది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందే..

తిరుమలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, వెంటనే వైసీపీ ఎమ్మెల్యే శ్రీవారి భక్తులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు భానుప్రకాష్ రెడ్డి. ఈ వివాదంలో వైసీపీ తరపున ఎవరూ మాట్లాడకపోవడం విశేషం. తనకు అవమానం జరిగిందని సీఎంఓ కార్యాలయాన్ని కూడా ప్రస్తావనకు తెచ్చారు ఎమ్మెల్యే. అధికారులెవరూ మాట వినడంలేదన్నారు. నేరుగా ఈవోపైనే ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు మధ్యలో బీజేపీ రియాక్ట్ కావడమే ఇక్కడ విశేషం. 

Tags:    
Advertisement

Similar News