ఎన్నికల కీలక దశలో.. ముద్రగడ లేఖ..
ఈసారి సీఎం జగన్‌కు ఓటు వేసే విషయంలో తప్పు చేయొద్దని, తప్పు జరిగితే మాత్రం రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందని ముద్రగడ హెచ్చరించారు.
ఏపీలో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కి ఇంకా రెండున్నర రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ తరుణంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ప్రజలు, పిఠాపురం ఓటర్లందరినీ ఉద్దేశించి ఓ లేఖ విడుదల చేశారు. శుక్రవారం ఆయన విడుదల చేసిన లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన, టీడీపీ శాశ్వతంగా సముద్రగర్భంలో ఉండిపోయేలా తీర్పు ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
గతంలో గాజు గ్లాసు పగిలి ఆ ముక్కలు హాని కలిగిస్తాయని అందరూ స్టీల్ గ్లాసులు వాడుతున్నారని, ఎన్టీఆర్ పాలనలో అందరూ సైకిల్ తొక్కేవారని, ఇప్పుడు దానికి తుప్పు పట్టడంతో మోటర్ సైకిళ్లు, కార్లు వాడుతున్నారని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం అందరి ఇళ్లలో ఫ్యాన్లు ఉన్నాయని, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రేమాశీస్సులు ఉంచాలని కోరారు.
ఈసారి సీఎం జగన్‌కు ఓటు వేసే విషయంలో తప్పు చేయొద్దని, తప్పు జరిగితే మాత్రం రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందని ముద్రగడ హెచ్చరించారు. ఆ తర్వాత వచ్చే పాలకులు రాక్షస పాలన చూపిస్తారని ఆయన హెచ్చరించారు. గతంలో వారి రాక్షస పాలనకు ఉదాహరణలుగా నిలిచే వీడియోలను సోషల్ మీడియాలో పెట్టానని, ఒక్కసారి అందరూ చూడాలని ఆయన కోరారు.
సీఎం జగన్ పాలనలో పేదలు ఐదువేళ్లతో తృప్తిగా అన్నం తినే పరిస్థితి వచ్చిందని, పేద పిల్లలు ఇంగ్లీషు మాట్లాడే పరిస్థితి వచ్చిందని, మెరుగైన వైద్యం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందుబాటులోకొచ్చాయని, వీటన్నింటినీ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని గౌరవించాలని ముద్రగడ పద్మనాభం తన లేఖలో విజ్ఞప్తి చేశారు. తాను గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రుల వద్ద పనిచేశానని, ఎన్టీఆర్, వైఎస్సార్ లాంటివారు తప్ప పేదవారి ఆకలి తీర్చాలనే ఆలోచన ఎవరూ చేయలేదని ముద్రగడ తెలిపారు. పేదల సంక్షేమం కోసం జగన్ ప్రవేశపెట్టినన్ని పథకాలను దేశంలో ఏ ముఖ్యమంత్రీ ప్రవేశపెట్టలేదని పేర్కొన్నారు.