ఎన్నికల వేళ.. వైసీపీ 2 అరుదైన ఘనతలు
వైసీపీ నుంచి కొత్తగా ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలతో రాజ్యసభ చైర్మన్ ధన్‌కడ్ ప్రమాణస్వీకారం చేయించారు.
సార్వత్రిక ఎన్నికల వేడి తీవ్రస్థాయిలో ఉన్న వేళ వైసీపీ రెండు అరుదైన ఘనతలు సాధించింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోతోంది. ఒకపక్క రానున్న ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గద్దె దింపాలని టీడీపీ–జనసేన–బీజేపీల కూటమి ప్రయత్నిస్తుండగా.. జగన్ మాత్రం వైనాట్ 175 అంటూ ప్రచారంలో శరవేగంగా దూసుకెళుతున్నాడు.
ఇంతకీ జాతీయస్థాయిలో వైసీపీ సాధించిన అరుదైన గుర్తింపు ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యసభలో ఉన్న 11 ఎంపీ స్థానాలనూ తన ఖాతాలో వేసుకోవడం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ అరుదైన ఘనతను ఆ పార్టీ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీడీపీకి ఉన్న ఒక్క సభ్యుడు కనకమేడల రవీంద్రబాబు పదవీ కాలం ముగిసింది. దీంతో టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం శూన్యమైంది.
మరోపక్క వైసీపీ నుంచి కొత్తగా ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డిలతో రాజ్యసభ చైర్మన్ ధన్‌కడ్ ప్రమాణస్వీకారం చేయించారు. గొల్ల బాబూరావు హిందీలోను, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి ఇంగ్లీషులోను ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మరో ఘనత ఏమిటంటే.. రాజ్యసభలో వైసీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా నిలవడం. ప్రస్తుతం ఈ జాబితాలో బీజేపీ 97, కాంగ్రెస్ 29, టీఎంసీ 13 స్థానాలతో టాప్ త్రీ స్థానాల్లో ఉన్నాయి. తాజా ప్రమాణస్వీకారాలతో మొత్తం 11 స్థానాలతో వైసీపీ నాలుగో స్థానంలో నిలిచింది. కాగా... సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ జగన్ తమ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.