అమ‌రావ‌తి పేచీ ఇప్ప‌ట్లో తేలేనా!?

ఏపీ కి మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని జగన్, ఒకే ఒక రాజధాని, అది కూడా అమరావతే ఉండాలని మిగతా పక్షాలు వాదిస్తూ ఉండగా, బీజేపీ కూడా అమరావతి రాజధానికి మద్దతు పలుకుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై నోరు విప్పక పోవడం విశేషం.

Advertisement
Update:2022-09-16 05:45 IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని పేచీ ఇప్ప‌ట్లో తేలేలా లేదు. మూడు రాజ‌ధానుల‌ను ఎందుకు ఏర్పాటు చేయాల‌నుకుంటున్నారో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గురువారంనాడు మ‌రోసారి అసెంబ్లీ వేదిక‌గా స్ప‌ష్టం చేశారు. ప‌రిపాల‌నా సౌల‌భ్యం, అభివృద్ధి స‌మ‌తుల్య‌త సాధించేందుకు విశాఖ‌ప‌ట్ట‌ణం, క‌ర్నూలు, అమ‌రావ‌తి ప్రాంతాల‌లో పాల‌న‌, న్యాయ‌, శాస‌న రాజ‌ధానుల ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌ను వ‌క్కాణించారు.

ఇదే సంద‌ర్భంలో అమ‌రావ‌తిని ఏకైక రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని డిమాండు చేస్తూ అమ‌రావ‌తి సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో ఉత్త‌రాంధ్ర యాత్ర చేప‌ట్టారు. ఇప్ప‌టికే జెఎసి నేతృత్వంలో దాదాపు వెయ్యి రోజులుగా ఇదే డిమాండ్ పై నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. రాయ‌ల‌సీమ ప్రాంతంలో యాత్ర కూడా ముగించారు. మూడు రాజ‌ధానుల అంశంపై ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని కోర్టు కూడా త‌ప్పుబ‌ట్టింది. దీంతో ఆ ఉత్త‌ర్వుల‌ను వెన‌క్కి తీసుకుంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ అంశంపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌సంగం మూడు రాజధానుల వైపే మొగ్గు చూపుతున్న‌ట్టు మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది.

మ‌రోవైపు బిజెపి అమ‌రావ‌తిని రాజ‌ధానిగా కొన‌సాగించాల‌నే వాద‌న‌ను వినిపిస్తున్న‌ది. రాష్ట్ర‌, కేంద్ర నాయ‌కులు కూడా ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే చెబుతున్నారు. తాజాగా, ఆ పార్టీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్. నరసింహారావు, ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఉండాలనే ఆలోచనను బిజెపి వ్యతిరేకిస్తుంద‌ని, రాష్ట్రానికి అమరావతి ఒకే రాజధానిగా ఉండాలని స్ప‌ష్టం చేశారు. రాజ‌ధానిపై ఇంత జ‌రుగుతున్నా కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన వైఖ‌రి ప్ర‌క‌టించ‌కుండా తాత్సారం చేస్తోంది. దీని వెన‌క వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ విష‌యాన్ని నానుస్తూ అప్ప‌టి స‌మ‌యానుకూలతను బ‌ట్టి అధికారికంగా ప్ర‌క‌టించ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు రాష్ట్ర నాయ‌కుల‌తో పాటు ఎంపీల మాట‌ల‌ను బ‌ట్టి అర్ధ‌మ‌వుతోంది. బిజెపి జాతీయ అద్య‌క్షుడు న‌డ్డా వ్యాఖ్య‌లు కూడా అమ‌రావ‌తి రాజ‌ధాని అనే అభిప్రాయాన్ని క‌లిగిస్తున్నాయి. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ శంకుస్థాప‌న చేసిన అమ‌రావ‌తి రాజ‌ధాని సాకారం కాక‌పోతే ఆయ‌న ప్ర‌తిష్ట‌కు భంగం వాటిల్లే ప్ర‌మాదం ఉంటుంద‌నే ఆలోచ‌న కూడా బిజెపి శ్రేణుల్లో ఉంది. ఈ పేరు మీద ఏ కొద్దిపాటి నిధులు ఎప్పుడు కేటాయించినా అవి అమ‌రావ‌తి అభివృద్ధికేన‌న్న‌ప్ర‌క‌ట‌న‌లు కూడా బిజెపి నేత‌ల‌నుంచి వెలువ‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధాని శంకుస్థాప‌న చేశార‌న్న సెంటిమెంట్ వ‌ల్ల కూడా ఇదే ప్రాంతానికి బిజెపి మొగ్గు చూపుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

గురువారం న్యూఢిల్లీలో జివిఎల్ విలేకరుల సమావేశంలో అందరి సమ్మతితో అమరావతిని ఎంచుకున్నందున అమరావతిని ఏకైక రాజధానిగా బీజేపీ భావిస్తోందని అన్నారు. విశాఖపట్నంను రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై బిజెపి ఎంపి స్పందిస్తూ, తమ పార్టీ స‌మ‌తుల అభివృద్ధికి (వివిధ ప్రాంతాల‌) వ్యతిరేకం కానప్పటికీ, రాష్ట్ర రాజధానికి అమరావతిని సరైన ప్రదేశంగా భావిస్తున్నామని చెప్పారు. ఇటీవ‌ల ఆ పార్టీ రాష్ట్ర నాయ‌కులు మాధ‌వ్‌, వీర్రాజు వంటి వారు కూడా రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఉంటుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

అమరావతి, విశాఖపట్నంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జ‌రిగింద‌న్న మాట‌ల యుద్ధంపై జివిఎల్ తీవ్రంగా స్పందించారు. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని గత టిడిపి ప్రభుత్వం రెండింటినీ ఆయన తీవ్రంగా విమర్శించారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీలు రెండూ ఇన్సైడ్ ట్రేడింగ్‌ పేరుతో అక్రమ లాభాలు గడిస్తున్నట్లు తెలుస్తోంద‌న్నారు. 

Tags:    
Advertisement

Similar News