జనసేన ఆవిర్భావ సభలో పొత్తులపై కీలక ప్రకటన..!!

ఆ మాటకొస్తే పవన్ కల్యాణ్ ఎక్కడనుంచి పోటీ చేస్తారనేది కూడా తేలలేదు. పొత్తులపై ఇంకా లేట్ చేయడం పార్టీ రాజకీయ భవిష్యత్ కి మంచిది కాదు అనే అభిప్రాయం వినపడుతోంది.;

Advertisement
Update:2023-03-07 09:26 IST

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది టైమ్ ఉంది. వైసీపీ సింగిల్ గా పోటీ చేయాలనే క్లారిటీతో ఉంది. జనసేనతో పొత్తు ఉందని బీజేపీ చెప్పుకుంటోంది. జనసేన టీడీపీవైపు చూస్తోంది. అవకాశం ఉంటే జనసేన, బీజేపీ, వామపక్షాలతో కూడా కలసి పోటీ చేయాలనే ఆశ టీడీపీది. ఎవరి అంచనాలు వారివి. కానీ అధికారికంగా వైసీపీ మినహా ఇంకా ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి. ఈ దశలో జనసేన ఆవిర్భావ సభకు మహూర్తం ఖరారైంది. ఈనెల 14వతేదీన మచీలీపట్నంలో జనసేన పదో పుట్టినరోజు జరగబోతోంది. ఈవేదికపై పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. పొత్తులపై కూడా పవన్ అంతే ధీమాగా ప్రకటన చేస్తారా..? జనసేన శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారా..? వేచి చూడాలి.

ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలిపోనివ్వను అంటూ పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో స్టేట్ మెంట్ ఇచ్చారు. అంటే కచ్చితంగా ప్రతిపక్షాలన్నీ కలసి పోటీ చేయాలనే ఆలోచన ఆయనది. బీజేపీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రధాన ప్రతిపక్షం టీడీపీతోనే ఆయన ప్రయాణం ఉంటుందని ఓ అంచనా ఉంది. కానీ ఎవరూ బయటపడటంలేదు. పొత్తు ఖరారు చేస్తే రేపు సీట్ల పంపకాల్లో తేడాలొస్తాయనే భయం కూడా ఉంది. ముందు సీట్ల లెక్కలు తేలితే ఆ తర్వాత పొత్తు ఖరారు చేయొచ్చనే ఆలోచన కూడా ఉంది. ఈ మధ్యలో పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి అంటూ కూటమి ప్రకటన చేయాలంటూ మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో పవన్ మరీ అంత పట్టుబట్టకపోవచ్చు కానీ, పొత్తులపై ప్రకటన చేయాల్సిన సమయం మాత్రం వచ్చిందనే చెప్పాలి.

యువగళం పాదయాత్రతో లోకేష్ ఎంతోకొంత ప్రయత్నం మొదలు పెట్టారు. పవన్ వారాహి ఇంకా రోడ్డెక్కలేదు, ఇటీవల పలు సినిమాల్లో బిజీ అయిన పవన్ ఎన్నికల ఏడాదిలో అయినా కాస్త ఫ్రీ అవుతారని అనుకోలేం. పవన్ ఇంకా పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టకపోతే జనసేన అభ్యర్థులు జనంలోకి వెళ్లేదెలా..? పోనీ ఈసారికి టీడీపీకి మెజార్టీ సీట్లు ఇచ్చినా, జనసేన కచ్చితంగా పోటీ చేసే స్థానాలేంటనేది కూడా ఇంకా డిసైడ్ కాలేదు. ఆ మాటకొస్తే పవన్ కల్యాణ్ ఎక్కడనుంచి పోటీ చేస్తారనేది కూడా తేలలేదు. ఇంకా లేట్ చేయడం పార్టీ రాజకీయ భవిష్యత్ కి మంచిది కాదు అనే అభిప్రాయం వినపడుతోంది. ఈ దశలో ఆవిర్భావ సభలో అయినా పవన్ కీలక ప్రకటన చేస్తారేమోననే అంచనా అందరిలో ఉంది.

గతంలో ఓసారి రోడ్ మ్యాప్ అన్నారు, ఆ తర్వాత మూడు ఆప్షన్లు ఇచ్చారు, ఇప్పుడు కచ్చితంగా ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇంకా నాన్చుకుంటూ పోతే కేడర్ చేజారే ప్రమాదం ఉంది. ఓవైపు వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా, ధైర్యముందా అంటూ రెచ్చగొడుతోంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే పవన్ నోరు విప్పాలి. ఆవిర్భావ సభలో అందరికీ క్లారిటీ ఇవ్వాలి. టీడీపీతో పయనం అనేది దాదాపుగా ఖాయమే అనుకుంటున్నా.. దానిపై అధికారిక ప్రకటన ఈనెల 14న జనసేన ఆవిర్భావ సభలో వెలువడుతుందేమో చూడాలి.

Tags:    
Advertisement

Similar News