జగన్ బ్రాండ్ ఈసారి పనిచేస్తుందా?
2019 ఎన్నికల నాటి గాలి మరోసారి బలంగా వీస్తుందని కొందరు వైసిపి నాయకుల భావన. అయితే ఆనాడు జగన్ విపక్షంలో ఉన్నారు. ఆయన పాలన గురించి ప్రజలకు తెలియదు. ఆయన ఎలా పాలన చేస్తారో 'ఒక చాన్స్' ఇద్దామని చూశారు. కానీ 2024లో ఎన్నికలు మాత్రం జగన్ పరిపాలనకు ఇవ్వబోయే తీర్పు.
ఏపీలో ఈసారి ఎన్నికలు చాలా భిన్నంగా ఉంటాయి. ఈ సంగతి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌కు బాగా తెలుసు. 2024 ఎన్నికలలో తన ఇమేజ్ ఒక్కటే సరిపోదు అని ఆయనకు అర్ధమైంది. 2019 ఎన్నికల నాటి గాలి మరోసారి బలంగా వీస్తుందని కొందరు వైసిపి నాయకుల భావన. అయితే ఆనాడు జగన్ విపక్షంలో ఉన్నారు. ఆయన పాలన గురించి ప్రజలకు తెలియదు. ఆయన ఎలా పాలన చేస్తారో 'ఒక చాన్స్' ఇద్దామని చూశారు. కానీ 2024లో ఎన్నికలు మాత్రం జగన్ పరిపాలనకు ఇవ్వబోయే తీర్పు. ఆయన పాలనలో సంక్షేమ కార్యక్రమాల మెరుపుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కానీ అభివృద్ధి కార్యక్రమాలు నిధుల కొరత వలన నత్తనడకన సాగుతున్నాయి.
అయితే ఆ ఫలాలు అందరికీ అందడంలేదన్నా విమర్శలున్నాయి. వారు కచ్చితంగా జగన్‌కు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశమూ ఉంది. ఉద్యోగ వర్గాలు, నిరుద్యోగ యువతలో జగన్‌పై వ్యతిరేకత ఉన్నట్టు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మధ్యతరగతి ఓటర్లు కూడా వైసీపీ పట్ల వ్యతిరేకంగా ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనేక అంశాలు 2024 ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. జగన్ ఫొటోతో ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చేసి ఓట్లేయమంటే ప్రజలు వింటారా? అనే సందేహాలు లేకపోతేదు. వారంలో నాలుగు రోజుల పాటు ప్రజలల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. 'గడప గడపకూ కార్యక్రమం' ఉద్దేశం ఎమ్మెల్యేలు ప్రజలతో కనెక్ట్ కావడమే. సమస్యలు ఎన్ని ఉన్నా సరే, ముందు శాసనసభ్యుల ముఖాలు చూస్తే ఎంతో కొంత శాంతిస్తారన్నది థియరీ.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలలు ఎలాగో గడచిపోయాయి. కానీ కరోనా వచ్చి రెండేళ్ళ పాటు స్తబ్దత నెలకొంది. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇపుడిపుడే ప్రజల్లోకి వెడుతున్నారు. ''మేము చేయడానికి ఏమీ లేదు. ప్రజల సమస్యలు తీర్చడానికి నిధులు లేవు. వెళ్ళి ఏం చేయాలి'' అన్నది వైసీపీ ఎమ్మెల్యేల ఆవేదన. అయినా సరే వెళ్లాల్సిందే అని జగన్ హుకుం జారీ చేశారు. నిరంతరం ప్రజల్లో ఉండి శ్రమపడితేనే వాళ్ళు మళ్ళీ గెలిపిస్తారు అని జగన్ అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరు చేస్తేనే తమకు ఆసరాగా ఉంటుందని ఎమ్మెల్యేల వాదన. జగన్ బ్రాండ్, గాలి కంటే కూడా ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే ప్రజలు తీర్పు వెలువడుతుందని వైసీపీ నాయకత్వం అంచనా వేస్తోంది. 27 మందికి పైగా ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని జగన్ నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. అందులో కొందరు మంత్రులూ ఉన్నారు.
''ఒక్క చాన్స్ ఇవ్వండి'' అని జగన్ తన పాదయాత్ర సందర్భంగా తరచూ ప్రతీ చోటా ప్రజల్ని అభ్యర్థించారు. ప్రజలు నమ్మారు.. 2019లో జగన్‌కు వచ్చిన ఊపు కూడా అలాగే ఉంది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చి 151 సీట్లు వైసీపీ గెలుచుకున్న తరువాత ఏపీలో విపక్షాల గుండెలు జారిపోయాయి. వైసీపీ వ్యతిరేక శిబిరం జగన్ కనీసం రెండు టర్ములు సీఎం కచ్చితంగా అవుతారని ఏపీలో విపక్షానికి 2029 ఎన్నికల తరువాతే మోక్షం లభించవచ్చునని కూడ ఆ శిబిరంలో వినిపించింది. వైసీపీ ప్రభంజనం ఆ స్థాయిలో ఉన్నందున విపక్షాలు గజగజ వణికిపోయాయి. జగన్ అంతటి రాజకీయ బలవంతుడు అనే భావించేవారు. వైసీపీ కూడా అత్యంత పటిష్టంగా ఉండేది. జగన్ జపమే పార్టీలో అంతటా వినిపించేది. అయితే పాలనా పగ్గాలు అందుకున్న తరువాత జగన్ పూర్తిగా పార్టీని పక్కన పెట్టేశారన్నా విమర్శలున్నాయి. ఆయన తన శైలిలో పరిపాలిస్తున్నారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుపై ఇప్పటికీ మిశ్రమ స్పందన ఉంది. పార్టీ నాయకులలో భిన్న అభిప్రాయాలున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ క్యాడర్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం సహజం. వారే ప్రజల వద్దకు వెళ్ళి తాము ఫలానా పని చేయించామని చెప్పుకునేవారు. ప్రజలు కూడా వారిని ఆశ్రయించేవారు. కానీ వైసీపీ కొత్త విధానాల వల్ల క్యాడర్‌లో నిరాశ అలుముకున్నట్టు చెబుతున్నారు. నామినేటెడ్ పదవుల విషయంలోనూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు సరైన న్యాయం జరగలేదన్న విమర్శలున్నాయి. పార్టీని పదేళ్ల పాటు తన భుజాల మీద మోసిన క్యాడర్ వైసీపీకి దూరం అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజం లేదని కొందరు మంత్రుల వాదన.
కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో ముఖ్య నాయకులకు కాంట్రాక్ట్ పనులు ఇప్పించారు. తమ ప్రభుత్వమే కదా అని ఉత్సాహంగా కాంట్రాక్టు పనులు చేసినవారికి అప్పులే మిగిలాయి. బిల్లులు మంజూరవు కాకపోవడంతో చాలా మంది పార్టీ క్యాడర్ ఇలా కాంట్రాక్టులు తీసుకుని అవస్థల పాలవుతూ ఉన్నారు. అప్పులు తెచ్చి కాంట్రాక్టులు చేసి తీరా బిల్లులు రాకపోవడంతో వడ్డీలు పేరుకుపోయి ఏమీ కట్టలేక మానసిక వ్యధతో బాధపడుతున్నారు. పార్టీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు వైసీపీ పెద్ద నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.
మూడేళ్ల పాలన పూర్తి చేసుకుని వైసీపీ నాలుగో ఏట అడుగుపెట్టింది. పార్టీ శ్రేణుల్లో స్తబ్దత ఆవరించింది. ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కనీసం 50 మంది కీలకమైన నాయకులు క్యాడర్‌తో తరచూ మాట్లాడతారన్న టాక్ ఉంది. ఒకటి రెండు నియోజకవర్గాలతో ఆ కథ ఆగిపోయింది. దాంతో ఎవరికి తమ గోడు చెప్పుకోవాలి..ఎలా తమ బాధను చెప్పుకోవాలి అని క్యాడర్ సతమతమవుతోంది. పార్టీ పెద్దలు క్యాడర్‌తో పనేంటి అని అనుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది. టీడీపీ కూడా గతంలో తమకు తిరుగులేదని భావించి క్యాడర్‌ని పట్టించుకోని ఫలితంగానే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోయిందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. టీడీపీ నుంచి గుణపాఠాలను వైసీపీ నేర్చుకోవడం లేదని వైసీపీ శ్రేణుల్లో ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది.