ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అన్నీ గుర్తుకొస్తాయా..?
అప్పటికే జనాలు చంద్రబాబును నమ్మటం మానేశారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి. మళ్ళీ 2024 ఎన్నికలొస్తున్నాయి కదా అందుకనే పాత హామీలనే కొత్తగా ఇస్తున్నారు.
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరిస్తారు. మామూలుగా ఎవరైనా ఇలాగే వ్యవహరిస్తారని అనుకోవచ్చు కానీ, మరీ చంద్రబాబులా ఎవరూ వ్యవహరించరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు, చేసిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోయినట్లు నటిస్తే కొందరు నటించవచ్చు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికొదిలేసి మళ్ళీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వాటిగురించే పదేపదే మాట్లాడితే ఎలాగుంటుంది..? ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న బీసీల సాధికారత, రైతు సంక్షేమం, నిరుద్యోగ భృతి, అన్నక్యాంటీన్ల ప్రారంభం, ఉద్యోగాల కల్పన లాంటివి కొత్త హామీలేమీకావు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చినవే. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను గాలికొదిలేశారు. 2019 ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతిని, అన్నక్యాంటీన్లంటూ హడావుడి చేశారు.
అయితే అప్పటికే జనాలు చంద్రబాబును నమ్మటం మానేశారు. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి. మళ్ళీ 2024 ఎన్నికలొస్తున్నాయి కదా అందుకనే పాత హామీలనే కొత్తగా ఇస్తున్నారు. బహుశా జనాల మెమొరీ అంటే చంద్రబాబుకు బాగా చులకనలాగుంది. ఇక చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు కూడా అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోరు. ఇవన్నీకూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రెగ్యులర్ గా గుర్తుకొస్తుంటాయి.
తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలు ఎందుకని నిలదీశారు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్ అంశాలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆల్ పార్టీ మీటింగు పెట్టమంటే తనకు చాతకాకపోతే కదా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాల్సిందని ఎదురు ప్రశ్నించారు. ఇప్పుడేమో ప్రతిదానికి ఆల్ పార్టీ మీటింగులంటూ డిమాండ్లు చేస్తున్నారు. అమరావతి శంకుస్ధాపనలాంటి కార్యక్రమాల్లో ప్రతిపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా అదేదో తన పార్టీ కార్యక్రమంలా నిర్వహించేశారు. ఎప్పుడైతే ప్రతిపక్షంలో వచ్చారో అప్పటినుండే ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలంటూ పదేపదే మాట్లాడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు లాంటి ప్రతిపక్షనేత దేశంలో ఏ రాష్ట్రంలోను లేరేమో.