చంద్రబాబు గెలిస్తే ఎవరికి లబ్ధి? జగన్ గెలిస్తే ఎవరికి లాభం?
చంద్రబాబు వస్తే ఎవరికి లబ్ధి? జగన్ వస్తే ఎవరికి లాభం అన్నది మాత్రం అత్యంత క్రియాశీలంగా మారనుందని చెప్పాలి.
ఇంకో వంద వీర్రాజులు వచ్చినా.. పవన్ బీజేపీతో కలిసుండే ప్రసక్తే లేదు.. కారణం.. బీజేపీ- పవన్ కాంబోలో అంత పర్సంటేజీ లేదని ఇరు పక్షాలకూ స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఈ రెండు పార్టీల పర్సంటేజీ ఏ పది నుంచి పదిహేను శాతం కూడా లేదు. దానికి తోడు స్థానిక సంస్థల ఎన్నికలను బట్టీ చూస్తే.. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కొంతమేర ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నట్టు కనిపించింది. బీజేపీతో అలయెన్స్ ద్వారా ఈ పార్టీ కొన్ని ప్రాంతాల్లో గెలవాల్సింది ఓడిపోయిందనే పేరొచ్చింది. కారణం.. బీజేపీ మత తత్వ పార్టీ.. ఈ పార్టీతో అంటకాగిన పవన్ కళ్యాణ్ పార్టీ కూడా సేమ్ అలాంటి లక్షణాలనే కలిగి ఉంటుందేమో అన్న ఆందోళన ఓటర్లది. ఈ విషయంపై నిన్న మొన్న పవన్ కళ్యాణ్ తన ఆవేశపూరిత ప్రసంగం సందర్భంగా.. నారాజు కాకుర అన్నయ్య.. నజీరు అన్నయా అంటూ తాను జానీలో పాటలు పెట్టాననీ.. పాత్ర క్రిస్టియన్ దే అయినా పాట మాత్రం ముస్లిం మైనార్టీల కోసం రాయించాననీ.. నాటి నుంచే తనకు రాజకీయాల పట్ల ఒక అవగాహన ఉందని ఆయన పూసగుచ్చారు.
ఇక అసలు విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ కి ఒక పిక్చర్ అయితే క్లారిటీ వచ్చేసింది.. అదే ఒంటరిగా మనతో కాదు.. జేఎస్పీ- బీజేపీ కాంబో తిరిగి అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నది క్లియర్ ఒపీనియన్ అయితే ఉంది. అంటే ఇటువైపే కాదు.. అటు వైపు కూడా క్రిస్టల్ క్లియర్.
ఇక బాబు కూడా ఇప్పటి వరకూ ఒంటరిపోరాటంలో విజయం సాధించిన దాఖలాల్లేవు.. ఈ కండీషన్లో 2014 మోడల్ ని తెరపైకి తెస్తే ఎలా ఉంటుందన్న మాట ఓటర్ల నుంచి టీడీపీ సానుభూతిపరుల నుంచి మరీ ముఖ్యంగా ఎల్లో మీడియా నుంచి తీవ్రస్థాయిలో సలహా సూచనలు వెల్లువెత్తడంతో.. కొంత కాలంగా ఈ రెండు పార్టీలు నువ్వాదరిని- నేనాదరిని అనే పాట పాడుకుంటూ వచ్చాయి. పైకి గంభీర వదనాలతో ఉన్నా లోలోపల ఈ పొత్తు ఎక్కడ కలవకుండా పోతుందో అన్న గుబులు మాత్రం ఈ రెండు పక్షాలను కొంతకాలం వెంటాడాయి.
మేం కలిస్తే తప్పేంటని పరిపరివిధాలుగా ఆలోచనలు మధించీ మధించీ.. ఆఖరున ఒక నిర్ణయానికి వచ్చారు. ఔను మేమిద్దరం తిరిగి కలిసిపోతున్నామనీ.. విజయవాడ నోవాటెల్ వేదికగా.. కలిసిపోయారు. ఇద్దరూ కిస్ పెట్టుకోకపోవడం ఒక్కటే తక్కువ.
అంతటి గాఢానుబంధాన్ని కనబరిచారు. రాజకీయంగా చెప్పాల్సి వస్తే.. రెండు పార్టీలు ప్రస్తుత గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం మైనస్సుల్లోనే ఉన్నాయి. బాబు నాయకత్వంపై సాక్షాత్ తెలుగు తమ్ముళ్లకే కాదు.. సీనియర్ లీడర్లకు కూడా నమ్మకం లేదు. అందుకే జూనియర్ జపం చేస్తూ వచ్చారు. ఆ జూనియర్ ను కూడా బీజేపీ తన్నుకు పోతే పరిస్థితేంటి? ఇంకా గట్టిగా మాట్లాడితే.. ప్రభుత్వాధినేతలనే మార్చినట్టు.. (మహారాష్ట్రలో లాగ) ఇక్కడేకంగా పార్టీ అధినేతలనే మార్చేస్తే.. వామ్మో ఇంకేమైనా ఉందా?
40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు పరిస్థితి కాస్తా.. మరింత అగమ్యగోచరంలో పడిపోయే ఛాన్సుంది. దీంతో ఉలిక్కి పడ్డ ఎల్లోమీడియా.. బాబును వెనక నుంచి బాగా మాబాగా ప్రొత్సహించినట్టుంది.. దీంతో ఆయన కూడా ఎప్పుడెప్పుడు పవన్ ను తన చంకనెక్కించుకుందామా? అని ఒకింత ఎక్కువ ఆతృత కనబరచి.. ఎట్టకేలకు వన్ ఫైన్ ఈవెనింగ్ ఆ ముచ్చటేదో కానించేశారు.
ఇప్పుడు గ్రౌండ్ రియాల్టీస్ ఏంటి? అని చూస్తే దెబ్బ తిన్న పులి శ్వాస కూడా గాండ్రింపుకన్నా భయంకరంగా ఉంటుందన్నట్టు టీడీపీ ప్రస్తుతం ఇదే సీన్ లో ఉంది. ఒక పక్క 2019 ఎన్నికల ఘోర పరాజయంతో పాటు బోనస్ గా.. స్థానిక ఎన్నికలన్నింటిలోనూ సున్నాకు సున్నా చుట్టేసింది. గుంటూరులో అయితే.. మీరిక్కడ ఓటు వేయకుంటే.. అక్కడ అమరావతి మాకొద్దన్న ఇండికేషన్లు ఇచ్చినట్టే అని పరుష ప్రచారం చేసినా బాబు పాచికలేవీ పారలేదు. దీంతో షాకుల మీద షాకులు ఎదురయ్యాయి.
ఉప ఎన్నికల్లోనూ సేమ్ సీన్. ఒక దశలో వైసీపీ దొంగ ఓట్లతో నెట్టుకొచ్చిందని గట్టిగా నమ్మబలికేలా ఎల్లో మీడియా హడావిడి కూడా ఏమంత కలిసి రాలేదు. బాబాయ్ హత్య కేసును కూడా ఎవ్వరూ పరిగణలోకి తీసుకోలేదు. ఇక గోరంట్ల మాధవ్ బూతు కథనాలపైనా జనం ఏమంత సీరియస్ గా తీసుకున్న దాఖలాల్లేవు..
అయితే ఇప్పుడు వినిపిస్తున్న ప్రధానమైన మాట ఏంటంటే.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయిందనీ. అరవై డెబ్భై సీట్ల వరకూ కోత ఉండొచ్చనీ అంటున్నారు. ఇంకో లెక్క ఏంటంటే.. బాబు పవన్ పర్సంటేజీ కలిస్తే అది 51 శాతాన్ని దాటేస్తుందనీ.. దీంతో ఆటోమేటిగ్గా అధికార పార్టీ 49 శాతానికి పడిపోతుందనీ.. దీంతో వచ్చే రోజుల్లో మనదే రాజ్యం అన్నది ఒక గుడ్డి లెక్క.
మరి జనం ఏమంటున్నారు. రాష్ట్రం అప్పుల పాలై పోతోందనీ. మరో శ్రీలంక కావడంలో ఎలాంటి అనుమానం లేదన్న మాట గట్టిగా నమ్మేస్తున్నట్టేనా? మనకీ సంక్షేమం వద్దు- అభివృద్ధే ముఖ్యమని భావిస్తున్నారా? దానికి తోడు జగన్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా కోర్టులు ఎలాగూ తప్పు పడుతున్నాయి కాబట్టి.. ఆయనకు పరిపాలన చేతకాదనుకోవాలా? ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని ఫార్ములా హైదరాబాద్ లో ఎలాగూ బెడిసి కొట్టింది కాబట్టి.. మూడు రాజధానులను సమ్మతిస్తూ.. వారు ఈసారి కూడా జగన్ కే తమ ఓటు అంటారా? అన్నది 2024లో గానీ తేలే అవకాశం లేదు.
జగన్ నమ్మకమల్లా ఒకటే..మనం నేరుగా ప్రజలతో సంభాషిస్తున్నాం.. సంబంధ బాంధవ్యాలను నెరుపుతున్నాం. వారిని ఇప్పటి వరకూ ఎక్కడా చేయి వదిలింది లేదు. ప్రచార సమయంలో ఎన్నో హామీలిస్తాం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అవకాశం లేదని చంద్రబాబు కానీ మడమ తిప్పినట్టు మనమింత వరకూ మడమ తిప్పలేదు. జనాన్ని నమ్మినోడు ఇంత వరకూ చెడిందే లేదు. ఆనాడు ఎన్టీఆర్, వైయస్ఆర్ ఈ రోజు తాను.. సేమ్ టు సేమ్. కాబట్టి బేఫికర్ అన్న జగన్ నమ్మిన నమ్మకాలు నిజమవుతాయా?
లేక జనం ఈసారి చంద్రబాబు- పవన్ కాంబోకి ఓటేద్దాం.. అదెంత వరకూ రాష్ట్రాన్ని ముందుకు తీస్కెళ్తుందో చూద్దామని భావిస్తారా..? అని చూస్తే అప్పుడు చంద్రబాబు సీన్ వేరు. రాష్ట్ర పరిస్థితి అంతకన్నా వేరు. కొత్త రాష్ట్రానికి కాస్త అనుభవజ్ఞుడైన పాలకుండుంటే బెటర్ అని జనం భావించడంతో పాటు.. బీజేపీ- పవన్- బాబు కాంబో కూడా కలసి రావడం.. చంద్రబాబుకున్న పరిచయాలు.. రాష్ట్రానికి 4 లక్షల కోట్ల రూపాయల రాజధాని రావచ్చేమో అన్న ఆలోచనలు కూడా తోడు కావడంతో.. అన్నీ మంచి శకునములే అని జనం భావించి.. నమ్మకాన్ని ఉంచి.. పాలన చేతిలో పెడితే.. చంద్రబాబు జనానికి సున్నం. తన బినామీల చేత ఖజానాకు కన్నం వేయించారన్న ప్రచారం బాగా ప్రబలింది.
ఇక రాజధాని ఎంత అట్టర్ ఫ్లాప్ అంటే.. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం ప్రభుత్వ భూముల్లో చేయాల్సింది కాస్తా.. ఇతరుల చేతుల్లో పెట్టారనీ.. దీంతో అది కాస్తా.. ప్రజారాజధాని కావల్సింది కాస్తా `రియల్` రాజధానిగా అవతరించిందన్న జగన్ ప్రచారం జనం నమ్మినట్టే ఉన్నారు. తుళ్లూరులో కూడా వైసీపీ సానుభూతి పరులు పంచాయతీ నెగ్గారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక కమ్మరావతి అన్న ముద్ర ఉండనే ఉంది.
నిజానికి చంద్రబాబు ఇక్కడే అడుసులో కాలేశారేమో అనిపిస్తోంది. సైబరాబాద్ హైటెక్ సిటీ వేరు. అమరావతి రాజధాని వ్యవహారం వేరు. రాజధాని అంటే అది కొందరికి సంబంధించిన అంశంగా ముద్ర పడకూడదు. అందరిదిగా పేరుండాలి. కానీ ఇక్కడ కొందరు రైతులు.. చేసిన వీరంగానికీ.. తమ భూములు ఇంత ధరలు పోతున్నాయంటూ చేసిన హంగామాకూ.. జనం బెదిరిపోయారు. ఇదేదో తేడా ఎవ్వారంలా ఉందే.. అనుకుంటా.. చంద్రబాబు `రియల్ స్కెచ్` కు దూరం జరిగారు. వాళ్లెవరో బాగు పడ్డానికి కాదు కదా?
కేపిటల్ సిటీ ఉంది? అన్న మాట వైసీపీ బాగానే ప్రచారం చేసింది..
దానికి తోడు చంద్రబాబు కూడా.. అమరావతి చుట్టూ రాజమౌళి సినీ గ్రాఫిక్స్ ద్వారా ఒక పొటెమ్కిన్ విలేజ్ ను సృష్టించే యత్నం చేశారు. పొటెమ్కిన్ విలేజ్ థియరీ ఏంటంటే.. ఒక రష్యన్ యువరాజు.. రాణిని మభ్య పెడుతూ సెట్టింగులు వేసి.. తన పరిపాలన బహుబాగుందని చేసిన ఒకానొక భ్రమ. ఈ భ్రమే అమరావతిని భ్రమరావతి అన్న ప్రచారానికి నాంది పలికింది. దీంతో బాబు ఇక్కడా చేతులెత్తేశారు. శాశ్వత నిర్మాణాలేవీ చేయకుండా అన్నిటినీ టెంపరరీ బేసిస్ లో చేయడం.. ఐదేళ్లలో ఏం చేశావని అడిగితే అందుకు తగిన సమాధానం లేకుండా పోయింది.
సరే ఇవన్ని వదిలేసి.. మరోమారు చంద్రబాబుకు అధికారం ఇస్తే పరిస్థితి ఏంటని చూస్తే.. అంత నమ్మబులేనా? అని ఆలోచిస్తే.. ఒక్కటైతే గ్యారంటీ చంద్రబాబుగానీ తిరిగి అధికారంలోకి వస్తే.. అన్నక్యాంటీన్లను జగన్ గవర్నమెంట్ ఎలా ఊడబెరికేసిందో.. రేపటి రోజున గ్రామ, వార్డు సచివాలయాలను కూడా సేమ్ టు సేమ్ అలాగే లాగేస్తారు. దీంతో లక్షలాది మంది ఉపాధి.. వారి ద్వారా జనం పొందుతున్న 542 సర్వీసులకు స్వస్తి. ఈ మాట ఆయన నిన్నటి ఉభయ ప్రెస్ మీట్లో కూడా అన్నారు.
గతంలో కూడా బాబు ఎన్టీఆర్ తెచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలకు గండి పెట్టేశారు. ఇందులో మద్యపాన నిషేధం వంటి ఎన్నో ముఖ్యమైనవి ఉన్నాయ్. రేపటి రోజున చంద్రబాబు గానీ అధికార పీఠమెక్కితే.. ఇప్పటి వరకూ జనం చేతికి అందుతోన్న పథకాలు. వాటి తాలూకూ డబ్బు మొత్తం అటక ఎక్కడం ఖాయం.
ఎందుకంటే చంద్రబాబు పరిపాలనలో ఇలాంటి నగదు బదిలీ పథకాలకు పెద్దగా ఆస్కారముండదు. ఆయన పొదుపైన పాలన చేయడంలో సుప్రసిద్ధుడు. కాకుంటే ఆయన, ఆయన కొడుకు, బినామీలు, ఎల్లో మీడియా బాసులు భారీగా లబ్ధి పొందుతారన్న మాట బాగా ప్రచారంలో ఉంది. మొన్నటికి మొన్న అంటే 2014- 19 మధ్య కాలంలో ఒక్క ఏబీఎన్ ఆర్కేకి రూ. 700 కోట్ల లబ్ధి చేకూరిన మాట ప్రచారంలో ఉంది. ఇదే పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు కేంద్రంగా జరిగిన అవినీతి గురించి భారీ ఎత్తున ప్రచారం చేసినదీ ఆంధ్ర ఓటరు జనానికి ఇంకా గుర్తే..
ఈ కండీషన్లో చంద్రబాబు స్వార్థానికీ- జగన్ నిస్వార్థానికీ మధ్య 2024 పోరాటం సాగనుందా? అన్న మాట భారీగానే తెరపైకి వచ్చింది. వచ్చే ఏపీ ఎలక్షన్లు మంచి రసకందాయంలో జరగనున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.
అయితే జగన్ కి కావచ్చు.. ఆయన కుటుంబం ఇప్పటి వరకూ చేసిన పాలిటిక్స్ కావచ్చు.. ఒకసారి పాలిస్తే.. రెండోసారి పోటాపోటీగా అయినా గట్టెక్కే ఛాన్సులైతే ఉన్నాయి. ఇప్పటికీ జగన్ ఆశలు ఆశయాలు సజీవమనే చెప్పాలి. కాకుంటే అదంతా జనం చేతుల్లో చిన్నపాటి ఓటింగ్ పర్సంటేజీలో ఉంది. ఎల్లో మీడియా చేస్తూ వస్తోన్న ప్రచారాలను కొందరైతే బలంగానే నమ్ముతున్నారు. రాష్ట్రంలో పోలీసు పాలన- రౌడీ రాజ్యం నడుస్తోందన్న మాట విశ్వసిస్తున్నవారున్నారు. దానికి తోడు మనమంతా కట్టిన పన్నులు ఎవరికో అయాచితంగా వెళ్లిపోతున్నాయనీ.. రాష్ట్రం మరో వెనిజులా కావడం ఖాయమనీ అంటున్నవారు లేక పోలేదు. అయితే కరోనా కాలంలో జగన్ ఉన్నాడు కాబట్టి సరిపోయిందని భావిస్తున్న వారూ ఉన్నారనుకోండి. ఇలా పరి పరివిధాలుగా ఇక్కడి స్థితిగతులు కనిపిస్తున్నాయి. ఈ చిన్నపాటి ఓటింగ్ శాతమే.. వచ్చే రోజుల్లో అధికార పక్షం తలరాతను తారు మారు చేస్తుందన్న మాట ఒకటి వినిపిస్తోంది.
ఇప్పుడు చంద్రబాబు- పవన్ కలయిక ద్వారా జరిగిందే ఇది. ఈ ఇరు పక్షాలు వచ్చే ఎన్నికల్లో చిన్నపాటి తేడాను చెరిపేయడమే లక్ష్యంగా కలిశాయి. మరి ఈ మ్యాజిక్ నిజమవుతుందా? లేక జగన్ 175కి 175 వర్కవుట్ అవుతుందా? పోయినసారి పవన్ రెండు చోట్లా ఓడినట్టు- ఈసారికి చంద్రబాబు సైతం కుప్పంలో కుప్ప కూలనున్నారా? జనం అంతరంగ ఆలోచన బట్టీ ఉంటుంది.
దానికి తోడు.. వచ్చే ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర సంవత్సరం వరకూ ఉంది. ఈ మధ్యకాలంలో జగన్ తన రెండో విజయాన్ని ఎలా ఖాయం చేసుకోనున్నారు. వివేకా హత్య కేసు దాని తాలూకూ పరిణామాలు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయా? లేక ఇదంతా జనం పట్టించుకోకుండా తమ లబ్ధి ఎంత? దానికెంత విలువ ఇవ్వాలి? అన్నది మాత్రమే చూస్కుంటారా? తేలాల్సి ఉంది.
ఇక ఫైనల్ గా చూసుకుంటే
చంద్రబాబు వస్తే ఎవరికి లబ్ధి? జగన్ వస్తే ఎవరికి లాభం అన్నది మాత్రం అత్యంత క్రియాశీలంగా మారనుందని చెప్పాలి. జగన్ వస్తే.. పది మందికీ ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరుతుంది. అదే బాబు తాను తన కులం, కోటరీ, ఎల్లో మీడియా, బినామీలు మాత్రమే లాభ పడే అవకాశాలున్నాయన్నది ఏకంగా పవన్ కళ్యాణ్ కడుపు మండి చేసిన నాటి ప్రచారం చెప్పక చెబుతోంది. దీన్నిబట్టీ.. బాబు- పవన్ కలయిక వల్ల లాభమెవరికీ, నష్టమెవరికీ అని బేరీజు వేసుకుంటే లెక్క మొత్తం తేలిపోనుంది. ఆ లెక్క వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ఓటరు జనం వేస్కుంటారా? లేదా చూడాలి మరి.