'ఈ సారి గెలిస్తే 30 ఏళ్లు మనమే'.. వైఎస్ జగన్ ధీమా ఏంటి?

జగన్ చేస్తున్న ఆ వ్యాఖ్యలపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామనే వ్యాఖ్యల వెనుక ధీమా ఏమిటో అర్థం కావడం లేదని అంటున్నారు.

Advertisement
Update:2022-11-17 07:47 IST

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎక్కడ మీటింగ్ జరిగినా.. 'ఈ సారి గెలిస్తే 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం' అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రతీ సారి అదే మాట చెప్తున్నారు. వైసీపీ శ్రేణులను ఉత్సాహపరచడానికి అలా చెబుతున్నారని అందరూ భావిస్తున్నారు. కానీ, అది జగన్ మనసులో మాటే అని సన్నిహితులు అంటున్నారు. అయితే, జగన్ చేస్తున్న ఆ వ్యాఖ్యలపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామనే వ్యాఖ్యల వెనుక ధీమా ఏమిటో అర్థం కావడం లేదని అంటున్నారు.

ఇండియాలో అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా ఉన్న పవన్ చామింగ్ (సిక్కిం-24.4 ఏళ్లు), జ్యోతిబసు (పశ్చిమ బెంగాల్ - 23 ఏళ్లు), నవీన్ పట్నాయక్ (ఒడిషా - 22 ఏళ్లు).. ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి కొనసాగారు. వారు పాలించిన/పాలిస్తున్న రాష్ట్రాల్లో వారికి సరైన ప్రతిపక్షం లేదు. అంతే కాకుండా ప్రత్యామ్నాయాలు కూడా లేకపోవడంతో ప్రజలు వరుసగా గెలిపిస్తూ వచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో ఎప్పటికైనా తమకు తిరుగే లేదని సీపీఎం పార్టీ అనుకుంది. కానీ మమత బెనర్జీ రూపంలో వచ్చి.. అసలు కోలుకోలేని దెబ్బ తీసింది. ఇక సిక్కింలో కూడా అదే పరిస్థితి. పవన్ చామింగ్ 24 ఏళ్ల పాటు తిరుగు లేకుండా పాలించారు. కానీ తన పార్టీకే చెందిన ప్రేమ్ సింగ్ తమాంగ్ బయటకు వెళ్లి వేరే పార్టీ స్థాపించి సీఎం అయ్యారు. ప్రస్తుతం ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రతిపక్షాల భయం లేదు. కానీ బీజేపీ అతడిని గద్దె దించే ప్రయత్నంలో ఉన్నది.

పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఒడిషా లాగా దక్షిణాదిలో.. ముఖ్యంగా ఏపీ, తమిళనాడులో రాజకీయాలు చేయడం కష్టమేననే వ్యాఖ్యలు వస్తున్నాయి. తమిళనాడులో ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. వరుసగా రెండో సారి ఎవరికీ అవకాశం ఇవ్వరు. ఇటీవల జయలలిత 2011, 2016లో వరుసగా గెలిచారు. అయితే ఆమె మరణించిన తర్వాత ఏఐడీఎంకేను సమర్థవంతంగా నడిపించే నాయకుడే రాలేదు. దీంతో డీఎంకే అధికారంలోకి వచ్చింది. స్టాలిన్ పాలన పట్ల ప్రస్తుతం ప్రజలు సంతృప్తిగానే ఉన్నా.. వచ్చేసారి గెలిపిస్తారో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. అయితే అక్కడ ఆయనకు సరైన ప్రతిపక్షం లేకపోవడం కలిసివస్తుంది. 

కానీ, ఏపీలో అలాంటి పరిస్థితి ఉందా? తిరుగులేకుండా 30 ఏళ్లు పాలించడం అంత ఈజీనా అంటే.. కాదు అని ఎవరిని అడిగినా చెప్తారు. మరి సీఎం జగన్ ధీమా ఏమిటని అందరూ అనుకుంటున్నారు. ఏపీలో జగన్‌కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు మాత్రమే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజల్లోకి విస్తృతంగా తిరుగుతున్నా.. అతడి వెనుక ఉన్నది చంద్రబాబే అని జగన్‌కు తెలుసు. ఈ సారి కనుక చంద్రబాబు ఓడిపోతే ఇక ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు కూడా నాకు ఇవే ఆఖరి ఎన్నికలు, గెలిపించండి ప్లీజ్ అంటూ హింట్లు ఇస్తున్నారు. వయోభారంతో 2029 నాటికి చంద్రబాబు యాక్టీవ్‌గా ఉండరని, నారా లోకేశ్‌కు తెలుగుదేశం పార్టీని నడిపించేంత సామర్థ్యం లేదని జగన్ అంచనా వేస్తున్నారు.

ఒక్క ఛాన్స్ అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్.. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అభివృద్ధి పనుల విషయంలో కాస్త వెనుకబడినా.. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలవరం పూర్తయితే తనకు తిరుగే ఉండదని జగన్ అనుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో పాటు బీజేపీని ఎదుర్కొని అధికారంలోకి వస్తే తనకు తిరుగే ఉండదని భావిస్తున్నారు. 30ఏళ్లు అంటూ పైకి చెబుతున్నా.. అదంతా పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికే అని.. అయితే ఆ తర్వాత మరో దఫా గెలిచే అవకాశాలు మాత్రం ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.

అయితే, చంద్రబాబు కనుక ఈ సారి ఓడిపోతే రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే కుప్పంలోనే చంద్రబాబును ఓడించి ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని జగన్ వ్యూహం సిద్ధం చేశారు. ఈ సారి ఆయను అసెంబ్లీలోకే అడుగు పెట్టనీయకుండా.. వైసీపీ అధికారంలోకి వస్తే.. కొన్నేళ్ల పాటు పార్టీకి తిరుగు ఉండదని జగన్ అంచనా వేస్తున్నారు. అందుకే పదే పదే ఈ సారి గెలిస్తే 30 ఏళ్లు మనమే అధికారం అంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నారు. గెలిస్తే 30 ఏళ్లు ఏమోగానీ.. మరో దఫా ఆయనకు తిరుగు ఉండదని మాత్రం చర్చ జరుగుతున్నది.

పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లు పూర్తి స్థాయి రాజకీయం చేసి.. నిజమైన సమస్యల మీద పోరాటాలు చేస్తే తప్పకుండా వైఎస్ జగన్‌కు ప్రత్యామ్నాయాలుగా మారతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు గైడెన్స్‌లో వారిద్దరూ పని చేయడం కారణంగానే పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతున్నారని అంటున్నారు. ఏదేమైనా జగన్ వ్యాఖ్యలు కొంత మేరకు వాస్తవమే అయినా.. ఆయన ఈ సారి గెలవడానికి మాత్రం పూర్తి శక్తియుక్తులను ప్రదర్శించాల్సి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News