రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2027
వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్న సీఎం చంద్రబాబు
జమిలి ఎన్నికలు వచ్చినా.. ఎన్నికలు జరిగేది 2029లోనే అని సీఎం చంద్రబాబు అన్నారు. మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం. వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నది. ఆ పార్టీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు. వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతున్నది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని చంద్రబాబు తెలిపారు.
యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లతో పాటు ప్రతిచోటా దీనిపై చర్చ జరగాలన్నారు. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలి. గత పరిస్థితులను బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికి కనిపిస్తున్నాయి. 2047లోనూ ఇదే పునరావృతమవుతుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసేది కాదు. భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని కోరారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2027. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సీఎం స్పష్టం చేశారు.