పవన్ కల్యాణ్ పై మళ్లీ ట్రోలింగ్.. ఈసారి ఎలా బుక్కయ్యారంటే..?
అలాంటివారికి మరోసారి దొరికేశారు జనసేనాని. మహిళా దినోత్సవం రోజున ఆయన వేసిన ట్వీట్ కి సోషల్ మీడియాలో విపరీతంగా కౌంటర్లు పడుతున్నాయి.
సోషల్ మీడియాలో జనసైనికులు ఎంత యాక్టివ్ గా ఉంటారో, వారి యాంటీ బ్యాచ్ కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ట్వీట్లకు, ఆయన ప్రసంగాలకు కౌంటర్లు ఓ రేంజ్ లో ఉంటాయి. వైసీపీ నుంచి కొంతమంది పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసి మరీ ట్వీట్లు వేస్తుంటారు. తాజాగా అలాంటివారికి మరోసారి దొరికేశారు జనసేనాని. మహిళా దినోత్సవం రోజున ఆయన వేసిన ట్వీట్ కి సోషల్ మీడియాలో విపరీతంగా కౌంటర్లు పడుతున్నాయి.
మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కల్యాణ్ చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ ఎన్నికల అజెండాలో ఈ అంశం కూడా ఉందని గుర్తు చేసిన ఆయన, మహిళల రక్షణకు, వారి రాజకీయ అభివృద్ధికి జనసేన కృషి చేస్తుందని చెప్పారు. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారని, స్త్రీలు గౌరవింపబడే చోట శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయని నమ్మే వ్యక్తుల్లో తాను ఒకరినని చెప్పుకొచ్చారు పవన్.
మహిళలను కీర్తిస్తూ, వారి తరపున పోరాటం చేస్తానని చెబుతూ, వారికి రాజకీయ ప్రాధాన్యత దక్కాలని ఆకాంక్షిస్తూ పవన్ కల్యాణ్ వేసిన ట్వీట్లలో ఎలాంటి పొరపాటు లేదు. కానీ కావాలనే ఇక్కడ కొంతమంది పవన్ వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ఆయనను కించపరిచేలా ట్వీట్లు వేశారు. మహిళల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు కొంతమంది. 33 శాతం రిజర్వేషన్ కోసం పవన్ ట్వీట్ వేశారని, అందులో కూడా 3 అనేది కామన్ గా కనపడుతోందంటూ మరొకరు సెటైర్ పేల్చారు. 2019 ఎన్నికల్లో మహిళలకు జనసేన తరపున పోటీ చేసే అవకాశం లేకుండా చేసిన పవన్ కల్యాణ్, ఇప్పుడిలా స్టేట్ మెంట్లివ్వడం కామెడీగా ఉందని చాలామంది కామెంట్లు పెట్టారు. మొత్తమ్మీద మహిళా దినోత్సవం రోజున పవన్ కల్యాణ్ వేసిన ట్వీట్ మాత్రం వైరల్ గా మారింది. పాజిటివ్ రియాక్షన్స్ కంటే ఎక్కువగా నెగెటివ్ కామెంట్లు పడుతున్నాయి.