అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..
ఎన్నికల ఫలితాల తర్వాత అంబటి రాంబాబు బయటకు రాలేదు, కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేరు. దీంతో ఆయన్ను కవ్వించేందుకే టీడీపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపీ జలవనరుల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గంట, అరగంట అనే నినాదాలతో హోరెత్తించారు. అంబటి రాంబాబు ఫొటో చేతిలో పట్టుకుని ర్యాలీగా కదలి వచ్చి హడావిడి చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంబటి ఇంట్లోకి చొచ్చుకునిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాసేపు అంబటి ఇంటిముందే ఉన్న వారు ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయారు.
చీర, గాజులు.
అంబటి రాంబాబుకి చీర, జాకెట్, పూలు, గాజులు ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్టూడెంట్ విభాగం నేతలు వచ్చారు. అంబటి ఫొటోను కూడా తీసుకొచ్చి వారు ఆయన ఇంటిముందు కాసేపు నినాదాలు చేశారు. ఆయన ఇంటి ముందే కుర్చీ వేసి, ఆ కుర్చీలో అంబటి ఫొటోకు దండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసులు ఈ వ్యవహారాన్ని ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం విశేషం. ఏకంగా అంబటి ఇంటి ముందు కుర్చీ వేసి, ఆ కుర్చీలో అంబటి ఫొటోకు దండ వేసినా పోలీసులు నిలువరించలేదు. అయితే ఆందోళనకారులు అంబటి ఇంట్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నాన్ని మాత్రం వారు అడ్డుకున్నారు.
ఎన్నికల తర్వాత వైసీపీలోని కీలక నేతలంతా ఒక్కొక్కరే బయటకు వస్తున్నారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ని చెడామడా తిట్టినవారు కూడా ఇప్పుడు కాస్త గౌరవంగానే మాట్లాడుతున్నారు. కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్.. వీరంతా టీడీపీ దాడుల్ని ఖండించేందుకు మీడియా ముందుకొచ్చారు. అంబటి రాంబాబు మాత్రం బయటకు రాలేదు. పల్నాడు ప్రాంతంలో దాడులు జరిగాయంటూ ఎన్నికల తర్వాత హడావిడి చేసిన, ఆయన ఫలితాల తర్వాత మాత్రం కనపడలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేరు. దీంతో ఆయన్ను కవ్వించేందుకే టీడీపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.