ప్రజా సమస్యలపై ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మళ్లీ జనంలోకి వెళ్తున్నారు. రైతు సమస్యలపై బుధవారమే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా శుక్రవారానికి (ఈనెల 13వ తేదీకి) వాయిదా వేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చకుండా ఆయా వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈక్రమంలోనే రైతు సమస్యలపై శుక్రవారం, కరెంట్ చార్జీల భారంపై ఈనెల 27న, విద్యార్థులకు ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు అమ్మ ఒడి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ''వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమ బాట'' పేరుతో ఈ ఆందోళనలు నిర్వహిస్తోంది. 13న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రైతు సమస్యలపై ర్యాలీలు చేసి కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయనున్నారు. రైతులకు రూ.20 వేల పెట్టబడి సాయం ఇవ్వాలని, ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంట బీమా పథకాన్ని పునరుద్దరించాలని డిమాండ్‌తో ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలపై మోపిన కరెంట్ చార్జీల భారాన్ని తగ్గించాలని కోరుతూ ఈనెల 27న ఆందోళన చేయనున్నారు. ఎస్‌ఈ ఆఫీసులు, సీఎండీ ఆఫీసుల ఎదుట ఆందోళనలు, ఆయా కార్యాలయాల్లో ప్రజలతో కలిసి వినతిపత్రాలు అందజేయనున్నారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీ రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేయనున్నారు. ఆ తర్వాత కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పిస్తారు. రీ యింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు ఇవ్వాలని, అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రతి చిన్నారికి రూ.15 వేల చొప్పున నిధులు ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలపై దాడులను నిరసిస్తూ జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంపై జగన్ వరుస ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఇకపై తరచూ ప్రజా సమస్యలపై ప్రజల మధ్యే ఉండాలని నిర్ణయించారు.