తిరుమలలో ధ్వజారోహణం.. పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ సీఎం

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ 2024 క్యాలెండర్‌, డైరీని సీఎం జగన్ విడుదల చేశారు.

Advertisement
Update:2023-09-18 21:25 IST

తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ఉత్సవాలు మొదలయ్యాయి. అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈఘట్టానికి ముందు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిని, పరివార దేవతలను, సేనాధిపతి, ధ్వజపటాన్నిమాడ వీధుల్లో ఊరేగించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్త్రాలు తీసుకెళ్లిన సీఎంకు మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్‌ కరుణాకర్‌ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. రంగనాయక మండపంలో సీఎం జగన్‌కు వేద పండితులు ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ 2024 క్యాలెండర్‌, డైరీని సీఎం జగన్ విడుదల చేశారు.

తిరుపతిలో అభివృద్ధి కార్యక్రమాలు..

తిరుమల యాత్రలో భాగంగా ఈరోజు సీఎం జగన్ తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పద్మావతిపురంలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ ని జగన్ ప్రారంభించారు. గోవిందరాజస్వామి డిగ్రీ కాలేజీకి సంబంధించి.. ఎస్.వి.ఆర్ట్స్ కాలేజీ హాస్టల్ భవనాల శిలాఫలకాలను ఆవిష్కరించారు. టీటీడీలో పనిచేసే దాదాపు 6,700 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించే కార్యక్రమాన్ని ప్రారంభించారు జగన్. రూ. 313 కోట్ల రూపాయల ఖర్చుతో.. 3,518 మందికి సంబంధించి తొలివిడత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం తిరుమల చేరుకున్న సీఎం జగన్.. వకులమాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్ ప్రారంభించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. 




Tags:    
Advertisement

Similar News