పవనంత హ్యాపీ పొలిటీషియన్ ఇంకోళ్ళుండరా?
జనసేన పార్టీకి గుర్తు లేకపోయినా, కమిటీలు లేకపోయినా, అభ్యర్థులు లేకపోయినా కూడా చింతలేదు. చంద్రబాబునాయుడు ఒకళ్ళుంటే చాలన్నట్లుగా ఉంది పవన్ కల్యాణ్ పరిస్థితి.
మామూలుగా రాజకీయ పార్టీ పెట్టారంటే ఏ అధినేతకైనా ఊపిరిసలపనంతా పనుంటుంది. పార్టీని ప్రచారం చేసుకోవటం, జనాల యాక్సెప్టెనీ కోసం అవస్థలుపడటం, జెండా, అజెండా విషయంలో జనాలను మెప్పించటం, గ్రామస్థాయి నుంచి రాష్ట్రకమిటీలు నియమించటంలో బిజీగా ఉంటారు. ఇక ఎన్నికలు వస్తున్నాయంటే పొత్తులు లేదా ఒంటరి పోటీకి అభ్యర్థుల ఎంపిక, ప్రాంతాలవారీగా ప్రచారం చేసుకోవటం ఒకటి కాదు రెండుకాదు వందపనులుంటాయి. అన్నింటికీ మించి గట్టి అభ్యర్థులను వెతికి పట్టుకోవటం, నిధుల సమస్య లేకుండా చూసుకోవటం తలకుమించిన పని.
కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మాత్రం అలాంటి సమస్యలేవీ ఉన్నట్లులేదు. పార్టీకి గుర్తు లేకపోయినా, కమిటీలు లేకపోయినా, అభ్యర్థులు లేకపోయినా కూడా చింతలేదు. చంద్రబాబు నాయుడు ఒకళ్ళుంటే చాలన్నట్లుగా ఉంది పవన్ పరిస్థితి. జనసేనకు ఉన్నదల్లా జెండా మాత్రమే. అజెండాతో పనిలేదు, మ్యానిఫెస్టో అవసరంలేదు. ఎలాంటి పబ్లిసిటీ లేకపోయినా రోడ్డు మీదకు అడుగుపెడితే చాలు తండోపతండాలుగా వచ్చే అభిమానులున్నారు.
విచిత్రం ఏమిటంటే ఇప్పుడు వారాహియాత్ర అంటూ తిరుగుతున్న పవన్‌కు ఒకే ఒక్క అజెండా మాత్రముంది. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు తిట్టడం. డైరెక్టుగా రెడ్డి సామాజికవర్గాన్ని మాత్రమే ఎటాక్ చేయటం. వారాహియాత్రలో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రమే పదేపదే నోటికొచ్చింది మాట్లాడారు. ఒక్కసారి మాత్రం ముద్రగడ పద్మనాభంపై ఆరోపణలు చేశారు.
వెంటనే కాపు నేతల నుండి భయంకరమైన ఎదురుదాడి మొదలైంది. ఎదురుదాడిని తట్టుకోలేక పార్టీకి ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అన్న భయంతో చివరకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుపైన కూడా నోరెత్తలేకపోయారు. చివరకు భీమవరంలో తనను ఓడించిన గ్రంథి శ్రీనివాస్ గురించి కూడా మాట్లాడలేదు. అంటే కాపుల జోలికి వెళ్ళకుండా కేవలం రెడ్డి సామాజికవర్గాన్ని మాత్రమే ఎటాక్ చేయాలన్న అజెండా పెట్టుకున్నట్లు అర్థమైవుతోంది. అభ్యర్థులు, ప్రచారం, నిధులు సమస్తాన్ని రెండు పార్టీల తరపున చంద్రబాబే చూసుకునేట్లున్నారు. మహా అయితే ఎన్నికల్లో తనకు కేటాయించిన నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారంతే. అందుకనే రాజకీయాల్లో పవనంత హ్యాపీ పొలిటీషియన్ ఇంకోళ్ళు లేరన్నట్లుగా తయారైంది వ్యవహారం.