బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ - రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వెన్నెముక లేని నాయకత్వం ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించలేదన్నారు. ఎవరో వచ్చి విశాఖ ఉక్కును అమ్ముతాం అంటే ఊరుకోమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement
Update:2024-03-16 21:57 IST

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జగన్ పాలకులు కావాలనుకుంటున్నారని, ప్రశ్నించే గొంతుకలు కావాలని అనుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఇవాళ విశాఖపట్నంలో కాంగ్రెస్ నిర్వహించిన 'న్యాయ సాధన సభ'లో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ, వైసీపీపై విమర్శలు చేశారు.

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అర్థమని, మోడీ బలం, బలగం వారేనని అన్నారు. మోడీ బలం వాళ్లే అయినప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన ఏమైనా ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. వీళ్లలో ఎవరు గెలిచినా మోడీ దొడ్లోకి పోయేవారేనని రేవంత్ ఎగతాళి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాతిక ఎంపీలు మోడీ ఖాతాలో ఉన్నవేనన్నారు. ప్రజలు అనుకోవచ్చు.. మేము ఈ పక్కన ఉన్నాం..ఆ పక్కన ఉన్నాం అని.. జగన్ పక్కన ఉన్నా, చంద్రబాబు పక్కన ఉన్నా వీళ్ళిద్దరూ ఢిల్లీలో ఉండేది మోడీ పక్కనేనన్నారు. ఢిల్లీలో వీరెవరైనా మోడీని అడుగుతారా? మోడీని నిలదీస్తారా? మీ ప్రాంతం కోసం ఏమైనా తెస్తారా? అని ప్రశ్నించారు.

ఒకవేళ వాళ్ళు తెచ్చేవాళ్లే అయితే ఐదేళ్లు అధికారంలో టీడీపీ ఉంది.. మరో ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉంది.. మరెందుకు పోలవరం పూర్తి కాలేదు? రాజధాని ఎందుకు రాలేదో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబు, జగన్ పాలన చేసే నాయకులు కావాలని అనుకుంటున్నారు.. వాళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు కావాలని అనుకోవడం లేదని రేవంత్ విమర్శించారు.

ఏపీకి కావాల్సింది పాలకులు కాదు.. ప్రశ్నించే గొంతులు కావాలన్నారు. ఈ ప్రాంతంలో సమస్యలపైన జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు, నిటారుగా కొట్లాడేవాళ్ళు కావాలన్నారు. వెన్నెముక లేని నాయకత్వం ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించలేదన్నారు. ఎవరో వచ్చి విశాఖ ఉక్కును అమ్ముతాం అంటే ఊరుకోమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఢిల్లీ నుంచి సుల్తాన్లు వచ్చినా విశాఖ ఉక్కును ఇంచు కూడా కదిలించలేరని అన్నారు. ఏపీలో కనీసం 25 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలను గెలిపిస్తే చట్టసభల్లో వారు ప్రజల కోసం పోరాడతారని కోరారు.

Tags:    
Advertisement

Similar News