రాజకీయ కురుక్షేత్రంలో జగన్ కర్ణుడు..చంద్రబాబు అర్జునుడు
దారుణ పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ అన్ని శక్తులూ కూడగట్టుకుని రాజకీయ కురుక్షేత్రానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. అప్రతిహతమైన విజయం సాధించిన వైసీపీ రాజకీయ రణక్షేత్రంలో యుద్ధరంగంలో శాపగ్రస్తుడైన కర్ణుడిలా ఒంటరిగా, పోరాడాల్సిన స్థితి నుంచి సాయం కోసం ఎదురుచూసేలా పరిస్థితులు మారిపోయాయి.
గత ఎన్నికల్లో జగన్ రెడ్డి పన్నిన పద్మవ్యూహంలోకి వెళ్లి తిరిగి రాలేకపోయిన అభిమన్యుడిలా ఓటమిని మూటగట్టుకున్నారు చంద్రబాబు. కాలం గిర్రున తిరిగింది. మళ్లీ ఎన్నికల రాజకీయ కురుక్షేత్రానికి రంగం సిద్ధం అవుతోంది.
ఈ సారి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్న అర్జునుడిలా కదనకుతూహలంతో చంద్రబాబు కనిపిస్తున్నారు. సర్వశక్తులు ఒడ్డుతూ, కలిసొచ్చే ఏ ఒక్క సమీకరణానికి వదులుకోకుండా, అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారు. తాను క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూనే, తనయుడు లోకేష్‌ని పాదయాత్రలో ఓ పక్క నుంచి నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ వస్తున్నారు.
టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి నియోజకవర్గ విభేదాలు, నాయకుల మధ్య సమన్వయం అప్పగించారు. బావమరిది కమ్ వియ్యంకుడు బాలయ్యను చంద్రబాబు తలపెట్టిన కార్యక్రమాలకు హాజరయ్యేలా చూసుకుంటున్నారు.
నందమూరి కుటుంబ సభ్యులను ప్రతీ ముఖ్య కార్యక్రమంలోనూ వేదికపై ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ శతజయంతిని ఘనంగా నిర్వహించి, తన మిత్రుడు తమిళ్ సూపర్ స్టార్ రజనీని రప్పించి తనని ప్రశంచేలా ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు జనసేన జారిపోకుండా పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.
దారుణ పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీ అన్ని శక్తులూ కూడగట్టుకుని రాజకీయ కురుక్షేత్రానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. అప్రతిహతమైన విజయం సాధించిన వైసీపీ రాజకీయ రణక్షేత్రంలో యుద్ధరంగంలో శాపగ్రస్తుడైన కర్ణుడిలా ఒంటరిగా, పోరాడాల్సిన స్థితి నుంచి సాయం కోసం ఎదురుచూసేలా పరిస్థితులు మారిపోయాయి.
జైలులో ఉన్నప్పుడు తన కోసం పాదయాత్ర చేసిన చెల్లి, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తల్లి తెలంగాణకు తరలిపోయారు. బాబాయ్ హత్యకి గురయ్యారు. ఈ హత్యకేసులో మరో బాబాయ్ భాస్కర్ రెడ్డి అరెస్టు కాగా, ఆయన తనయుడు తనకి లక్ష్మణుడిలా సాయంగా ఉండే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇరుక్కున్నాడు. వైఎస్ జగన్ రెడ్డికి అన్నీ తానై వ్యవహరించే విజయసాయిరెడ్డి కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నారని ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో యుద్ధరంగంలో ఒక్కో శాపం తగిలి అశక్తుడైన కర్ణుడిలా ఉంది జగన్ పరిస్థితి. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఎవరిది విజయమో, ఎవరిది అపజయమో తేలనుంది.