'విద్యార్థులు స్కూల్లో అయినా ఉండాలి.. సీఎస్ జైల్లో అయినా ఉండాలి' -AP హైకోర్టు హెచ్చరిక‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మండి పడింది. చట్ట ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం పేద విద్యార్థులకు ఫ్రీ సీట్లు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. తమ ఆదేశాలను ధిక్కరించినందుకు జైలుకు వెళ్ళాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించింది.

Advertisement
Update:2022-09-02 09:12 IST

ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలన్న తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని ఏపీ హైకోర్టు మండిపడింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలనే నిబందన ఉన్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.

ఆర్టీఈ చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలంటూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేశ్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వం తమ ఆదేశాలను అమలు చేయకుండా ప్రైవేటు పాఠశాలలకు సాయపడుతోందని మండిపడింది.

ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని, ఇప్పటికైనా ఆర్థికంగా వెనుకబడిన వారి వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఇవ్వాలని మరో సారి ఆదేశాలు జారీ చేసిన కోర్టు ''విద్యార్థులు స్కూల్లో అయినా ఉండాలి.. లేదంటే మీరు జైల్లో అయినా ఉండాలి'' అని ఏపీ ప్రధాన‌ కార్యదర్శి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌లను హెచ్చరించింది.

రాష్ట్రంలో ఉన్న 16 వేల ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కో దానిలో కనీసం ఐదుగురు పేద పిల్లలకు ఫ్రీగా సీట్లు కేటాయించినా, 80 వేల మంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువుకునే అవకాశం లభించి ఉండేదని అడ్వకేట్ యోగేశ్ వాదించారు.

దీనిపై ప్రభుత్వ న్యాయవాది నాగరాజు తన వాదనలు వినిపిస్తూ.. సీట్ల భర్తీ ప్రక్రియను సిద్ధం చేశామని, వివరాలను సమర్పించేందుకు గడువు ఇవ్వాలని కోరారు.

Tags:    
Advertisement

Similar News