జీవిత కాల అధ్యక్ష వివాదంపై సజ్జల వివరణ
జగన్‌ను జీవిత కాల అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నట్టు విజయసాయిరెడ్డి ప్రకటించింది నిజమేనని..కానీ ఆ తర్వాత ఆ ప్రతిపాదనను జగన్ తిరస్కరించారని సజ్జల వెల్లడించారు.
వైసీపీకి జగన్ మోహన్ రెడ్డి జీవిత కాలం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటూ ప్లీనరిలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించడం దానిపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసీకి ఫిర్యాదు చేయడం గతంలో జరిగింది. దీనిపై ఇటీవల వైసీపీని ఎన్నికల కమిషన్ వివరణ కోరింది. అందుకు స్పందించిన వైసీపీ.. జీవిత కాలం అధ్యక్షుడిగా జగన్‌ను ఎన్నుకున్నారన్నది కేవలం మీడియా రిపోర్టు మాత్రమేనని వివరణ ఇచ్చింది. అయినప్పటీకి ప్లీనరీలో విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన వీడియో ఆధారంగా ప్రతిపక్షం విమర్శలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. పార్టీ పెట్టిందే జగన్ కాబట్టి ఆయనను పదేపదే ఎన్నుకోవడం కంటే జీవితకాలం ఆయన్నే ప్రకటిస్తే బాగుంటుందన్నది పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయం మాత్రమేనన్నారు. జగన్‌ను జీవిత కాల అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నట్టు విజయసాయిరెడ్డి ప్రకటించింది నిజమేనని..కానీ ఆ తర్వాత ఆ ప్రతిపాదనను జగన్ తిరస్కరించారని సజ్జల వెల్లడించారు.
దాంతో ఆ జీవితకాల అధ్యక్షుడు అన్న అంశానికి అప్పుడే ముగింపు పడిందన్నారు. జగన్‌ను కేవలం ఐదేళ్లకు అధ్యక్షుడిగా మాత్రమే ఎన్నుకోవడం జరిగిందని.. అదే విషయాన్ని ఈసీకి కూడా తెలియజేశామన్నారు. తాము ఐదేళ్లకు అధ్యక్షుడనే పంపామని.. కానీ కొన్ని ఫిర్యాదులు వెళ్లడం, మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో మరింత స్పష్టత ఇవ్వాలని మాత్రమే ఈసీ కోరిందన్నారు. శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ను ఎన్నుకోలేదు, ఐదేళ్ల కాలానికే అధ్యక్షుడిగా ఎన్నుకున్నామన్న విషయాన్ని మరోసారి ఈసీకి వివరంగా తెలియజేస్తామని సజ్జల చెప్పారు.