విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య..?
సనపల రమణయ్య విశాఖ రూరల్ (చినగదిలి) తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. కొమ్మాదిలో నివాసం ఉంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ చేశారు.
విశాఖపట్నంలో ఘోరం జరిగింది. మండల మేజిస్ట్రేట్ అయిన తహసీల్దార్‌ను గుర్తు తెలియని వ్యక్తి రాడ్లతో కొట్టి దారుణంగా హతమార్చాడు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తహసీల్దార్ రమణయ్య చనిపోయారు.
విశాఖ రూరల్ తహసీల్దార్‌గా విధినిర్వహణ
సనపల రమణయ్య విశాఖ రూరల్ (చినగదిలి) తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. కొమ్మాదిలో నివాసం ఉంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన్ను విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ చేశారు. అక్కడ విధులు ముగించుకుని కొమ్మాదిలోని ఇంటికి వచ్చిన ఆయనకు శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ వచ్చింది. ఆయన అపార్ట్‌మెంట్ కిందికి వచ్చి గేటు దగ్గర ఓ వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఇంతలో ఆ వ్యక్తి రమణయ్యపై ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను విశాఖ అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ అక్కడ చనిపోయారు.
కారణాలేంటి?
విశాఖ రూరల్ తహసీల్దార్‌గా పని చేస్తున్నప్పుడు కొన్ని భూముల వ్యవహారంలో ఆయన తమ మాట వినలేదని కొందరు ఆగ్రహంగా ఉన్నారని, వారే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఏకంగా తహసీల్దార్‌ను హత్య చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలిసినవారు ఈ పని చేస్తారా అనేది అనుమానమే. ఈ నేపథ్యంలో హత్యకు వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు.