ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ లో ఉత్సాహం

అధికారంలోకి రాకపోయినా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఎన్డీఏ కూటమికి చెమటలు పట్టేలా చేసింది.

Advertisement
Update:2024-06-08 16:27 IST

సార్వత్రిక ఎన్నికల్లో 99 స్థానాలతో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పేరుని ప్రతిపాదిస్తూ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ బాధ్యతలు చేపట్టాలని పార్టీ నేతలంతా ముక్తకంఠంతో కోరడంతో రాహుల్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. దీనిపై ఆయన లాంఛనంగా తన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.


కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం..

అధికారంలోకి రాకపోయినా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఎన్డీఏ కూటమికి చెమటలు పట్టేలా చేసింది. భవిష్యత్తుపై కొత్త ఆశలు రేకెత్తించింది. అందులోనూ రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. ఈ దశలో రాహుల్ ప్రతిపక్ష నేతగా కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. గతంలో పార్టీ పగ్గాలు చేపట్టమన్నా కూడా రాహుల్ విముఖత చూపడంతో శ్రేణులు నిరాశ పడ్డాయి. ఇప్పుడాయన ప్రతిపక్ష నేతగా పార్టీని ముందుండి నడిపించడానికి సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

2014లో కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్‌ కు ప్రతిపక్ష హోదా దక్కడం ఇదే తొలిసారి. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి విపక్ష పాత్ర పోషించేందుకు అవసరమైన ఎంపీల సంఖ్య లేదు. కనీసం 10శాతం ఎంపీలు ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఈసారి 99 మంది ఎంపీలతో కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషించబోతోంది. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రల కారణంగానే పార్టీ బలపడిందనే నమ్మకం నాయకుల్లో ఉంది. 

Tags:    
Advertisement

Similar News