మద్యం కేసు వ‌దినమ్మ పుణ్యమేనా?

చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళు చేస్తున్న ఎగతాళి, వ‌దినమ్మ ఆరోపణలు అన్నీ కలిపి చంద్రబాబుపైన కేసు నమోదవ్వటానికి కారణమైనట్లుంది.

Advertisement
Update:2023-10-31 10:43 IST

మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై సీఐడీ చంద్రబాబుపై మరో కేసు నమోదుచేసింది. 2014-19 మధ్యలో చంద్రబాబు ఏడు మద్యం తయారీ కంపెనీలకు అనుమతులిచ్చారు. ఈ ఏడు కంపెనీల నుండి 254 బ్రాండ్లు మార్కెట్లో ఉన్నాయి. 1971 నుండి 2019 వరకు రాష్ట్రంలో మొత్తం 20 డిస్టిల్లరీలు ఏర్పాటయ్యాయి. ఇందులో 14 కంపెనీలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అనుమతించినవి కావటమే గమనార్హం.

1995లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి 2003లో పదవిలో నుండి దిగిపోయేవరకు ఏడు కంపెనీలను అనుమతించిన చంద్రబాబు 2014-19 మధ్యలో మరో ఏడింటికి అనుమతులు మంజూరుచేశారు. చంద్రబాబు మంజూరు చేసిన డిస్టిల్లరీలన్నీ తనకు అత్యంత సన్నిహితులు, టీడీపీ సీనియర్ నేతలకే కేటాయించారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999 లాంటి అనేక బ్రాండ్లకు అనుమతులిచ్చింది చంద్రబాబే. అయితే జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అండ్ కో మాత్రం మద్యం బ్రాండ్లపై విచిత్రమైన ఆరోపణలు మొదలుపెట్టారు.

పైన చెప్పిన బ్రాండ్లను ఉదహరిస్తు పదేపదే జగన్‌ను ఎగతాళి చేసేవారు. పైన చెప్పిన బ్రాండ్లన్నింటికీ చంద్రబాబే అనుమతులిచ్చి మళ్ళీ వాటన్నింటికీ జగన్ అనుమతిచ్చినట్లు సెటైర్లు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ అధ్యక్షరాలిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ప్రభుత్వంపైన వ్యక్తిగతంగా జగన్‌పైన ఎన్ని ఆరోపణలు చేస్తున్నారో అందరు చూస్తున్నదే. మద్యం అమ్మకాల్లో రూ.32 వేల కోట్ల కుంభకోణం జరిగిందని పదేపదే ఆరోపణలను చేస్తునే ఉన్నారు. మద్యం కుంభకోణంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

పురందేశ్వరి ఎక్కడ మాట్లాడినా, సందర్భం లేకపోయినా సరే మద్యం కుంభకోణం గురించే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన మద్యం వ్యాపారాన్ని, 45 వేల బెల్ట్ షాపుల వ్యాపారం గురించి పురందేశ్వరి మాటమాత్రంగా కూడా ప్రస్తావించటంలేదు. మద్యం వ్యాపారం, చీప్ లిక్కర్ మొత్తం జగన్ హయాంలోనే మొదలైనట్లుగా ఆరోపిస్తున్నారు. చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళు చేస్తున్న ఎగతాళి, వ‌దినమ్మ ఆరోపణలు అన్నీ కలిపి చంద్రబాబుపైన కేసు నమోదవ్వటానికి కారణమైనట్లుంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News