జగన్ కి నమ్మకస్తులా..? వేసెయ్ వేటు

డీజీపీ విషయంలో ఎన్నికల ముందే పంతం నెగ్గించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు సీఎస్ ని సాగనంపారు. కొత్త సీఎస్ తో మరో ముగ్గురు ఐఏఎస్ లపై వేటు వేయించారు.

Advertisement
Update: 2024-06-07 11:55 GMT

ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటి ఇబ్బంది ఐఏఎస్, ఐపీఎస్ లకు వచ్చింది. జగన్ కి నమ్మకస్తులు అనే పేరున్న వారందర్నీ టీడీపీ టార్గెట్ చేస్తూ పోతోంది. సీనియర్లు, ప్రతిభావంతులయినా కూడా ఎవ్వర్నీ వదిలిపెట్టడంలేదు. తాజాగా ముగ్గురు ఐఏఎస్ అధికారుల్ని జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాపై తొలి వేటు పడింది.

సీఎస్ తో మొదలు..

ఏపీలో అధికారం మారిపోవడంతో, అధికారులపై ప్రతీకారం మొదలైంది. డిప్యుటేషన్ పై వచ్చిన వారికి చుక్కలు చూపిస్తున్నారు. మాతృ సంస్థకు వెళ్లే విషయంలో కూడా అడ్డుపుల్లలు వేశారు. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ పోస్ట్ విషయంలో కక్షసాధింపు మొదలైంది. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయాల్సిన దశలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని సెలవుపై పంపించారు. ఆయన స్థానంలో సీఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మిగతా ఐఏఎస్ ల లెక్కలు తేలుస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మార్పులు జరిగాయి కానీ, టీడీపీ అంతకు మించి అన్నట్టుగా ఉంది. జగన్ టీమ్ అనే ముద్ర ఉన్న వారందర్నీ పక్కనపెడుతోంది. సీఎస్ తో మొదలై ప్రస్తుతం ముగ్గురు ఐఏఎస్ ల దగ్గర ఈ బదిలీ వ్యవహారం ఆగింది. ముందు ముందు ఇంకెన్ని రాజకీయ బదిలీలు ఉంటాయో వేచి చూడాలి. డీజీపీ విషయంలో ఎన్నికల ముందే పంతం నెగ్గించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు సీఎస్ ని సాగనంపారు. కొత్త సీఎస్ తో మరో ముగ్గురు ఐఏఎస్ లపై వేటు వేయించారు. రాబోయే రోజుల్లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల విషయంలో కూడా అస్మదీయుల్ని ఏరికోరి తెరపైకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. 

Tags:    
Advertisement

Similar News