ఏపీలో మూడు రాజధానుల నుండి ముగ్గురు భార్యలకు మళ్ళిన రాజ‌కీయ చర్చ

ఏపీలో మూడురాజధానుల చర్చ కాస్తా ముగ్గురు భార్యల వైపు మళ్ళింది. పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ మీద వైసీపీ నేతలు విమర్శలు చేస్తుండగా, తానుమూడు పెళ్ళుళ్ళు చేసుకున్నందుకు వాళ్ళకు అసూయగా ఉందని పవన్ వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement
Update:2022-10-23 11:52 IST

ఆంధ్రప్రదేశ్ లో 'మూడు రాజధానులు వర్సెస్ అమరావతి ఏకైక రాజధాని' అనే రాజకీయ చర్చలు ఇప్పుడు ముగ్గురు భార్యలవైపు మళ్ళింది. విశాఖపట్నంలో మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు పూర్తిగా వ్యక్తిగత స్థాయికి దిగజారాయి.

2014లో రాష్ట్ర విభజన అనంతరం అధికారంలో ఉన్న టీడీపీ అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేయాలని నిర్ణయించింది. అయితే, 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ఈ నిర్ణయానికి విరుద్ధంగా మూడు ప్రాంతాలలో రాజధానిని నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతిని శాసనసభ రాజధానిగా ఇలా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని వారు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఉత్తరాంధ్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఇటీవల మూడు రాజధానులకు మద్దతుగా విశాఖ గర్జన ర్యాలీని నిర్వహించింది. అక్టోబరు 15న వైజాగ్‌లో జరిగిన ర్యాలీకి వేలాది మంది హాజరయ్యారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లపై మంత్రులు, ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు.

అక్టోబర్ 15న విశాఖ గర్జనలో పర్యాటక శాఖ మంత్రి రోజా , పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించడంతో చర్చ అటువైపు మళ్ళింది. "పవన్ కళ్యాణ్ పెళ్లికి విశాఖపట్నం అమ్మాయి కావాలి. షూటింగ్ లకు, సినిమా కలెక్షన్లకు విశాఖపట్నం కావాలి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాఖపట్నం కావాలి కానీ రాష్ట్ర రాజధాని ఇక్కడ అక్కర్లేదా'' అని ఆమె అన్నారు.

తనపై చేస్తున్న వ్యాఖ్యలకు ప్రతీకారంగా అక్టోబర్ 16న పవన్ స్పందిస్తూ.. ''నేను ముంబై యాక్టింగ్ స్కూల్ లో చదివి ఉంటే రాజధాని కూడా అక్కడే ఉండాలా.. నా మూడు పెళ్లిళ్ల వల్ల మూడు రాజధానులను మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునే హక్కు నాకు దక్కుతుందా? ? దీంట్లో ఏదైనా లాజిక్ ఉందా?, మీరు కూడా పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకోవచ్చు, మూడు పెళ్ళిళ్ళు చేసుకోకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నానని వారు నాపై విపరీతమైన అసూయతో ఉన్నారు.'' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

అదే రోజు, పరిశ్రమలు, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పవన్ వ్యాఖ్యల‌పై విరుచుకుపడ్డారు.పవన్ కళ్యాణ్ ప్రజలను మళ్లీ పెళ్లి చేసుకోమని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. "పవన్ కళ్యాణ్ నగరంలో ఉండే వరకు వైజాగ్ అమ్మాయిలెవ్వ‌రూ బయటికి రావద్దని నేను కోరుతున్నాను. ఇప్పటికే మా సిటీ అమ్మాయిని అతనికి ఇచ్చాం", అని ప్రెస్ మీట్ లో చెప్పాడు.

ఈ మాటల యుద్దంలోకి ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా ఎంటర్ అయ్యారు. '' అతను(పవన్) ప్రజలను మూడు పెళ్లిళ్లు చేసుకోమని ప్రోత్సహిస్తున్నాడు. ఆయన మూడు రాజధానుల గురించి మాట్లాడకుండా.. ముగ్గురు భార్యల గురించి మాట్లాడుతున్నాడు'' అని వ్యాఖ్యానించారు.

''ప్రజానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కొందరు మూడు పెళ్లిళ్లు చేసుకోమని ప్రోత్సహిస్తున్నారు.. ఓ నాయకుడు ఇలా మాట్లాడితే అమ్మాయిల తల్లితండ్రుల‌ పరిస్థితి ఏమవుతుంది.. వ్యవస్థ ఎలా తయారవుతుంది.. ఇటువంటి వాళ్ళు ప్రజలను నడిపించగలరా? " అని సీఎం జగన్ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ పెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా, 2019లో, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషును బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ చర్యను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. అప్పుడు జగన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ''మీకు ముగ్గురు భార్యలు, నలుగురు లేదా ఐదుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏ మాధ్యమంలో చదువుతున్నారు?" అని జగన్ ప్రశ్నించారు.

ఇలా ప్రతీ సారి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ లొల్లి రాజకీయ వేదికపైకి రావడం, పవన్ ఆవేశపడిపోవడం, దాంతో ప్రత్య్రర్థులు మళ్ళీ విమర్శలు గుప్పించడం మామూలయిపోయింది. వరసగా విడాకులు ఇస్తూ పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పుకాదంటూ పవన్ వాదించడం, విడాకులు తీసుకున్నప్పటికీ మళ్ళీ పెళ్ళి చేసుకోవడం తప్పంటూ ఆయన ప్రత్యర్థులు వాదించడం నిత్యకృత్యమైంది. రాజకీయాల్లో ఇలా వ్యక్తిగత విషయాలపై దాడులు, ప్రతిదాడులకు దిగడాన్ని ప్రజలు ఎలా అర్దం చేసుకుంటారు ?

Tags:    
Advertisement

Similar News