ఏపీలో పవన్ క్రేజ్ పడిపోయింది.. సాక్ష్యం ఇదిగో
జనసేనకు ఒక్క ఎంపీ ఉన్నా.. విశాఖకు స్టీల్ ప్లాంట్ కోసం గనులు తాను తెచ్చేవాడినన్నారు పవన్. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని మండిపడ్డారు.
తెలంగాణ ఎన్నికల్లో దారుణ పరాభవం కావొచ్చు, టీడీపీతో మరీ ఎక్కువగా అంటకాగడం కావొచ్చు.. ఏపీలో పవన్ క్రేజ్ ఏపీలో దారుణంగా పడిపోయింది. ఇదేదో వైరివర్గం చేస్తున్న ఆరోపణలు కావు, సాక్ష్యాధారాలతో చెబుతున్న నిజాలు. పవన్ కల్యాణ్ విశాఖలో సభ పెడితే జనం కిటకిటలాడతారనుకున్నారు. కానీ ఖాళీ కుర్చీలు కనపడ్డాయి. అది కూడా ఓ చిన్నపాటి గ్రౌండ్ లో పవన్ వస్తే జనం లేరు అంటే అది ఆయనకు చిన్నతనమే. దీనిపై పవన్ లోతుగా ఆలోచిస్తారా, లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.
వారాహి యాత్రల్లో పవన్ కల్యాణ్ కోసం జనం భారీగా తరలి వచ్చేవారు. ప్రధాన వీధులన్నీ జనంతో నిండిపోయేవి. జనం వస్తారు కానీ, పవన్ కి ఓట్లు ఎవరూ వేయరంటూ వైరి వర్గం విమర్శించేది. ఇప్పుడు ఆ స్టేట్ మెంట్ కూడా ఇవ్వాల్సిన పనిలేదు, పవన్ సభలకు జనమే లేరు, ఇక ఓట్లెవరు వేస్తారంటూ నేరుగానే దెప్పిపొడిచే అవకాశం వైసీపీకి దొరికింది. ఎందుకిలా జరిగిందని జనసేన నేతలు ఆలోచించుకుంటున్నా.. టీడీపీ సావాసం అనేది మాత్రం బహిరంగ రహస్యం. వారాహి మొదలైనప్పుడు జనసేన ఒంటరి, ఇప్పుడు టీడీపీ తోకపార్టీ.. అదే తేడా.
ప్రముఖ కాంట్రాక్టర్ సుందరపు వెంకట సతీష్ కుమార్ చేరికకోసం ఏర్పాటు చేసిన ఈ సభలో.. యధావిధిగా మరోసారి సీఎం జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు పవన్ కల్యాణ్. ఏపీలో నియంత పాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. పదవులకోసం తాను రాజకీయం చేయట్లేదని, మార్పు కావాలని బలంగా కోరుకుంటున్నానని అన్నారు. జనసేనకు ఒక్క ఎంపీ ఉన్నా కూడా విశాఖకు స్టీల్ ప్లాంట్ కోసం గనులు తాను తెచ్చేవాడినన్నారు పవన్. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని మండిపడ్డారు.
వెనక కాదు, కలసి..
ఇటీవల కాలంలో టీడీపీ-జనసేన దోస్తీపై తనదైన శైలిలో వివరణ ఇస్తున్నారు పవన్ కల్యాణ్. తాము టీడీపీ వెనక నడవడంలేదని, టీడీపీతో కలసి నడుస్తున్నామని చెబుతున్నారు. విశాఖలో కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేశారు. టీడీపీ-జనసేన కూటమిని నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు పవన్. అంతా బాగానే ఉంది కానీ సభలో జనం లేకపోవడమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరి వర్గాలకు ట్రోలింగ్ సబ్జెక్ట్ గా దొరికింది.