రేపు పిఠాపురంకు పవన్.. వారాహి విజయభేరి షెడ్యూల్ విడుదల
పిఠాపురంతో కలిపి మొత్తం 10 నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. తొలి బహిరంగ సభ చేబ్రోలు రామాలయం సెంటర్ లో ఉంటుంది.;
ఎన్నికలకు ముందుగానే విజయ భేరి మోగిస్తున్నారు పవన్ కల్యాణ్. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి వారాహి యాత్ర మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. రేపు(శనివారం) నుంచి పవన్ యాత్ర మొదలవుతుంది. నాన్ స్టాప్ గా రెండు వారాలపాటు కొనసాగుతుంది. ఇందులో 4 రోజులు కేవలం పిఠాపురం నియోజకవర్గానికే కేటాయించారు పవన్. ఆ తర్వాత తెనాలి నుంచి మొదలు పెట్టి రాజానగరంతో యాత్ర ముగిస్తారు. మొత్తం 14 రోజులపాటు ఆయన ప్రజల్లో ఉండే విధంగా షెడ్యూల్ రూపొందించారు.
విజయభేరి యాత్ర షెడ్యూల్..
మార్చి 30 - ఏప్రిల్ 2 వరకు పిఠాపురం
ఏప్రిల్ 3 – తెనాలి
ఏప్రిల్ 4 – నెల్లిమర్ల
ఏప్రిల్ 5 – అనకాపల్లి
ఏప్రిల్ 6 – యలమంచిలి
ఏప్రిల్ 7 – పెందుర్తి
ఏప్రిల్ 8 – కాకినాడ రూరల్
ఏప్రిల్ 9 - పిఠాపురంలో ఉగాది వేడుకలు
ఏప్రిల్ 10 – రాజోలు
ఏప్రిల్ 11 – పి.గన్నవరం
ఏప్రిల్ 12 – రాజానగరం
పిఠాపురంతో కలిపి మొత్తం 10 నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. పిఠాపురం పర్యటనలో భాగంగా శక్తి పీఠ క్షేత్రంలో ఉన్న పురూహూతిక అమ్మవారిని దర్శించుకుని, వారాహి వాహనానికి పవన్ పూజలు చేయిస్తారు. ఆ తర్వాత దత్తపీఠాన్ని సందర్శిస్తారు. తొలి విడత ప్రచారంలో ఐదు రోజు అక్కడే బహిరంగసభల్లో పాల్గొంటారు. స్థానికంగా వివిధ వర్గాల వారితో సమావేశమవుతారు. పార్టీ క్యాడర్‌తోనూ సమావేశమవుతారు.
తొలి బహిరంగ సభ చేబ్రోలు రామాలయం సెంటర్ లో ఉంటుంది. ఈ సభకోసం పెద్దఎత్తున జన సమీకరణ చేస్తున్నారు జనసేన నేతలు. నాగబాబు ఈ వ్యవహారాన్నీ పర్యవేక్షిస్తున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని జనసైనికులకు పిలుపునిచ్చారాయన. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలోనూ బహిరంగ సభలు జరుగుతాయి.