నన్ను చూస్తే జగన్ కి భయం -పవన్
టీడీపీ, జనసేన కలిసి.. వైసీపీ భవిష్యత్ తేలుస్తాయని చెప్పారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు పవన్.
వైనాట్ 175 అంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్, తనని చూసి భయపడుతున్నారని అన్నారు పవన్ కల్యాణ్. వారాహి యాత్రలో భాగంగా ఏలూరు జిల్లా ముదినేపల్లిలో ఏర్పాటు చేసిన సభలో.. మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేనాని. మొత్తం సీట్లు వైసీపీకి వస్తాయనే నమ్మకం ఉంటే, ఇక జనసేన-టీడీపీని చూసి ఆ పార్టీ నేతలకు భయమెందుకని అన్నారు. టీడీపీ, జనసేన కలసి వస్తాయనగానే వైసీపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు. గెలుపుపై నమ్మకం ఉంటే వారు ఇంతగా భయపడాల్సిన అవసరం ఏముందన్నారు పవన్. అద్భుతంగా వారు పాలిస్తే.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలి. వారు భయపడుతున్నారంటే.. మాకు బలం ఉందని అంగీకరించినట్లేనని లాజిక్ చెప్పారు.
నా చరిత్ర తెలుసా..?
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదుర్కొని నిలబడిన వాడినని, ఓడిపోయినా హైదరాబాద్ లోనే ధైర్యంగా ఉన్నానని, ఎక్కడికీ పారిపోలేదని చెప్పారు పవన్ కల్యాణ్. టీడీపీ, జనసేన కలిసి.. వైసీపీ భవిష్యత్ తేలుస్తాయని చెప్పారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు పవన్. తమ కూటమి అధికారంలోకి రాగానే పెంచిన మద్యం ధరలు తగ్గిస్తామన్నారు. మద్యం మొత్తం నిషేధిస్తామని అబద్ధపు హామీలివ్వట్లేదని.. మహిళలు ముందుకొచ్చి అడిగిన చోట మద్యం నిషేధిస్తామని అన్నారు.
పోలీసులతో మక్కెలిరగ్గొట్టిస్తా..
ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం పోలీసులను పని చేయనివ్వడం లేదన్నారు పవన్. ఏ పోలీసులను ఇబ్బంది పెడుతున్నారో... అదే పోలీసులతో మక్కెలు విరగ్గొట్టిస్తామని హెచ్చరించారు. 10 గ్రామాలకు వైసీపీ గ్రామాలని పేర్లు పెడతామంటున్నారని, అసలు రాష్ట్రంలో వైసీపీయే లేకుండా చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో అధికారం మారిన రోజున వైసీపీ నేతల్ని కొల్లేరు చుట్టూ తిప్పుతామంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్.