వాలంటీర్లను మరోసారి టార్గెట్ చేసిన పవన్
ఆడపిల్లలు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని భయపెడుతున్నారని మండిపడ్డారు పవన్ కల్యాణ్. వాలంటీరు జీతం బూమ్ బూమ్ బీరుకి తక్కువ, ఆంధ్రా గోల్డ్ కి ఎక్కువ అని వెటకారం చేశారు.
వాలంటీర్ల విషయంలో ఇంత గొడవ జరుగుతున్నా పవన్ కల్యాణ్ మాత్రం తగ్గడంలేదు. పదే పదే వారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, మరింత ఘాటుగా బదులిస్తున్నారు. తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన వారాహి బహిరంగ సభలో మరోసారి వాలంటీర్లపై ధ్వజమెత్తారు జనసేనాని.
వాలంటీర్లపై తనకు వ్యక్తిగతంగా ద్వేషం లేదంటూనే వారిలో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు పవన్. ఎర్రచందనం రవాణాలో, మద్యం అక్రమ రవాణాలో, దోపిడీ ఘటనల్లో కొందరు వాలంటీర్లు పట్టుబడ్డారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆడపిల్లలు లొంగకపోతే పథకాలు తొలగిస్తామని భయపెడుతున్నారని మండిపడ్డారు. నేరం చేసిన వాలంటీర్లకు భయం లేదని, మా జగనన్న నేరం చేసి జైల్లోకి వెళ్లి వచ్చేశాడు. మేం కూడా జైలుకెళ్లొచ్చి నాయకులవుతామనే ధీమాతో వారు ఉన్నారని ఎద్దేవా చేశారు.
వాలంటీర్ల జీతంపై వెటకారం..
వాలంటీరు జీతం బూమ్ బూమ్ బీరుకి తక్కువ, ఆంధ్రా గోల్డ్ కి ఎక్కువ అని వెటకారం చేశారు పవన్ కల్యాణ్. అసలు ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరని ప్రశ్నించారు. వాలంటీర్ల కేంద్రం హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ఉందని, ఏపీ డేటా మొత్తం నానక్ రామ్ గూడలోనే ఉందన్నారు పవన్. అక్కడి ఏజెన్సీకి ఏపీ ప్రజల సమాచారం ఎందుకు ఇచ్చారో జగన్ సమాధానం చెప్పాలన్నారు. అందులో పనిచేస్తున్న 700 మందికి ఎవరు జీతాలు ఇస్తున్నారన్నారు.
తెరపైకి సీఎం జగన్ సతీమణి పేరు..
ఇటీవల తన సతీమణి పేరు తెరపైకి తెచ్చారని, ఆమె బాధపడిందని చెప్పిన పవన్ కల్యాణ్, తానెప్పుడూ సీఎం జగన్ సతీమణిని వివాదాల్లోకి లాగలేదని అన్నారు. అయితే పరోక్షంగా ఆయన సీఎం సతీమణి పేరు తెరపైకి తెచ్చారు. జగన్ కు సంస్కారం లేదని, సీఎంగా ఉండే అర్హత లేదన్నారు. నోటిని అదుపులో పెట్టుకోవాలని జగన్ కు ఆయన సతీమణి భారతి చెప్పాలన్నారు. తల్లి, చెల్లిపై గౌరవం లేని వ్యక్తి జగన్ అని విమర్శించారు. సొంత బాబాయిపైనే గొడ్డలి వేటు వేసిన వ్యక్తులు వాళ్లు అంటూ మండిపడ్డారు పవన్ కల్యాణ్.