ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా?

నేతలెవరైనా జనాలకు అభివాదం చేయటానికి, మైకుల్లో మాట్లాడటానికి ఓపెన్ టాప్ వెహికల్సే వాడుతారు. కానీ ఇక్కడ పవన్ ఏమిచేశారంటే కారుపైకి ఎక్కి కూర్చుని ప్రయాణించారు.

Advertisement
Update:2022-11-06 14:35 IST

కక్షసాధింపులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటంలో ఇళ్ళను కూల్చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నానా రచ్చ చేసేశారు. ఇప్పటం గ్రామానికి వెళ్ళి ఎంత ఓవర్ చేయాలో అంతా చేశారు. అయితే అక్కడికి వెళ్ళిన పవన్‌కు నిబంధనలకు విరుద్ధంగా ఇంటి కాంపౌండ్ వాల్ ఎక్కడా కొట్టలేదని అర్ధమైపోయిందట. అలాగే మార్చి-ఏప్రిల్ నెలలోనే రోడ్డును ఆక్రమించుకుని కట్టుకున్న ప్రహరీ గోడలను కూల్చేయబోతున్నట్లు నోటీసులు ఇచ్చిన విషయాన్ని కొందరు పవన్‌కు చూపించారట. దాంతో ఏమి మాట్లాడాలో తెలీక కాసేపు ఏదో యాక్షన్ చేసి వచ్చేశారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం మరోటుంది. అదేమంటే ఇప్పటం గ్రామానికి పవన్ ఓపెన్ టాప్ కారులో వెళ్ళారు. నేతలెవరైనా జనాలకు అభివాదం చేయటానికి, మైకుల్లో మాట్లాడటానికి ఓపెన్ టాప్ వెహికల్సే వాడుతారు. కానీ ఇక్కడ పవన్ ఏమిచేశారంటే కారుపైకి ఎక్కి కూర్చుని ప్రయాణించారు. మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం కారుపైన ఎక్కి కూర్చుని ప్రయాణించటం తప్పు. కానీ పవన్‌కు అడ్డుచెప్పేదెవరు? అందుకనే పవన్ కారుపైకి ఎక్కి కూర్చోగానే భద్రతా సిబ్బందితో పాటు వ్యక్తిగత సిబ్బంది కారుకు రెండు వైపులా నిలబడ్డారు. ప్రయాణంలో వారెవరైనా కిందపడుంటే?

ఎవరైనా అడ్డొచ్చేసి డ్రైవర్ సడెన్‌గా బ్రేకులు వేస్తే పవన్ పరిస్దితి ఏమిటి? కారుపై నుండి జారి కిందకొచ్చి పడతారు. అలా జరగలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే దాన్ని కూడా తనను చంపటానికి రెక్కీ అని ఆరోపణలు చేసుండేవారేమో. కారుపైకి ఎక్కి కూర్చుని ప్రయాణించటం ద్వారా తన అభిమానులకు, జనసైనికులకు పవన్ ఏమి సంకేతాలు ఇవ్వాలని అనుకున్నారు.

అభిమానులంటే తాము ఆరాధ్య దైవంగా కొలిచే సినీ సెలబ్రిటీలను అనుకరించటంలో పోటీలు పడతారని అందరికీ తెలిసిందే. రేపటి నుంచి వాళ్ళు కూడా ఎవరైనా పవన్ కూర్చున్నట్లే కారుపైన కూర్చుని ప్రయాణం చేసి ప్రమాదానికి గురైతే బాధ్యత ఎవరిది? షూటింగుల్లో ఏమి చేసినా చెల్లుబాటైపోతుంది. కానీ షూటింగుల్లో చేసినట్లే బయట కూడా చేయాల్సినంత ఓవర్ యాక్షన్ పవన్‌కు ఏమొచ్చింది? మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకుంటే మళ్ళీ దాన్ని కూడా నానా యాగీ చేయటానికే ప్లాన్ చేశారా?

Tags:    
Advertisement

Similar News