ఆయన కోటలో ఉన్నా, పేటలో ఉన్నా.. ఒకటే..!
పోలీస్ శాఖకు అవార్డులు వచ్చాయని సంబరపడటం, దిశ చట్టం చేశామని గొప్పలు చెప్పుకోవడం మినహా ప్రభుత్వం ఇంకేమీ చేయలేకపోతోందని విమర్శించారు.;
ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు జనసేనాని పవన్ కల్యాణ్. మౌనంగా ఉండే నాయకుడు కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటేనన్నారు. తాడేపల్లిలో యువతి రేప్ అండ్ మర్డర్ వ్యవహారంపై స్పందించారు పవన్ కల్యాణ్. ఆడ బిడ్డలకు రక్షణ ఉందా అంటూ పవన్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి దగ్గర్లోనే ఈ ఘటన జరగడం దారుణం అని అన్నారాయన. కంటి చూపుకి కూడా నోచుకోని యువతిని దారుణంగా వేధించి చంపిన కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.
ఏడాదిన్నర క్రితం ఇదే ప్రాంతంలో ఓ యువతిపై అఘాయిత్యం జరిగిందని, ఆ ఘటనలో నిందితులను ఇంతవరకు పట్టుకోలేకపోయారని, అదే అలుసుగా మృగాళ్లు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు పవన్. గంజాయి మత్తులో ఈ దుర్మార్గాలు జరగడం మరీ దారుణం అన్నారు. తాడేపల్లి గంజాయికి అడ్డాగా మారిందని చెప్పారు. పోలీస్ శాఖకు అవార్డులు వచ్చాయని సంబరపడటం, దిశ చట్టం చేశామని గొప్పలు చెప్పుకోవడం మినహా ప్రభుత్వం ఇంకేమీ చేయలేకపోతోందని విమర్శించారు.
తాడేపల్లిలో అంధ యువతి హత్య పూర్తిగా శాంతిభద్రతల వైఫల్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు పవన్. ‘‘తన నివాసం పక్కనే ఉన్న పరిసరాల పరిస్థితులనే సీఎం సమీక్షించుకోలేకపోతే ఎలా? తల్లి పెంపకంలోనే లోపం ఉందని చెప్పే మంత్రులు ఉన్న ప్రభుత్వమిది.. దొంగతనానికి వచ్చి రేప్ చేశారని చెప్పే మంత్రులున్న ప్రభుత్వమిది.. అఘాయిత్యాలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఏం చేస్తోంది? గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా ఆంధ్రప్రదేశ్‌ని మార్చారు. ఇలాంటి దారుణ ఘటనలపై అన్ని వర్గాలు స్పందించాల్సిన అవసరం ఉంది’’ అని పవన్ పేర్కొన్నారు.
కక్షతోనే హత్య..
తాడేపల్లిలో అంధ యువతి దారుణ హత్యకు గురైన ఘటనలో రాజు అనే యువకుడు కక్షతోనే ఆ పని చేసినట్టు తేలింది. నిన్న రాజు యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో.. ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులు, స్థానికులు అతడిని మందలించారు. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న అతడు.. ఈరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు, ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆమె చనిపోయింది.